తొలిసారి 70 వేల మార్కును అధిగమించిన సెన్సెక్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం సరికొత్త రికార్డును సృష్టించాయి. చరిత్రలోనే తొలిసారి సెన్సెక్స్ 70 వేల మార్కును అధిగమించింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 70,083 పాయింట్లకు పెరిగింది. ఆ తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్లు ఒడిదుడుకులకు గురయ్యాయి. సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 103 పాయింట్ల లాభంతో 69,929కి చేరుకుంది. నిఫ్టీ 28 పాయింట్లు పుంజుకుని 20,997 వద్ద స్థిరపడింది.

మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.39 వద్ద కొనసాగుతోంది. బీఎస్ఈ సెన్సెక్స్ 1986లో ప్రారంభమైంది. మొదటి 1000 పాయింట్లను చేరుకోవడానికి సెన్సెక్స్కు 970 సెషన్స్ పట్టింది. 1990 జులైలో సెన్సెక్స్ 1000 మార్క్ని టచ్ చేసింది. ఆ తర్వాత 1000ని తాకడానకి కేవలం 270 సెషన్స్ సమయం మాత్రమే పట్టింది! 1999 అక్టోబర్లో 5000 మార్క్ని తాకిన సెన్సెక్స్,   10వేల మార్క్ని 2006 ఫిబ్రవరిలో చేరుకుంది.

 అంటే తొలి 5వేల మార్క్ను తాకడానికి 13ఏళ్ల సమయం పడితే, మరో 5వేల (మొత్తం 10వేల మార్క్) పాయింట్లు పెరగడానికి కేవలం 7 ఏళ్ల సమయం మాత్రమే తీసుకుంది సెన్సెక్స్. ఇక 2006లోనే 11వేలు, 12వేలు, 13వేల మార్క్లను విజయవంతంగా దాటేసింది సెన్సెక్స్. 2007 డిసెంబర్లో 20వేల మార్క్ను టచ్ చేసింది. 10వేల నుంచి 20వేల మార్క్ను తాకడానికి కేవలం 109 సెషన్స్ మాత్రమే పట్టడం విశేషం.

అయితే, అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభం కారణంగా 2008 తర్వాత కొంతకాలం సెన్సెక్స్లో తీవ్ర ఒడిదొడుకులు కనిపించాయి. 21వేల మార్క్ను సెన్సెక్స్ టచ్ అవ్వడానికి మరో 3 ఏళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. 2010 నవంబర్లో ఈ ఫిగర్ని టచ్ చేసింది. అక్కడి నుంచి 22వేల మార్క్ను టచ్ చేయడానికి.. 2014 మార్చ్ వరకు ఎదురుచూడాల్సి వచ్చింది.

కానీ 2014లో స్టాక్ మార్కెట్ లు దూసుకెళ్లాయి. ఆ ఏడాది నవంబర్ నాటికి 28వేల మార్క్ని కూడా తాకేసింది సెన్సెక్స్. 2015 జనవరి సమయానికి.. కేవలం 50 సెషన్స్లో 29,000 మార్క్ వద్ద నిలబడింది. అక్కడి నుంచి 1000 పాయింట్లు పెరగడానికి మాత్రం 2ఏళ్ల సమయం పట్టింది. చివరికి 2017 ఏప్రిల్లో 30వేల మార్క్ను అందుకుంది.

2017 ముగింపు నాటికి సెన్సెక్స్ 34వేల వద్ద నిలిచింది. మరో 16 సెషన్స్లో, అంటే 2018 జనవరిలో 35వేల మార్క్ని కూడా దాటేసింది. అక్కడి నుంచి మరో 5వేల పాయింట్లు (40వేల మార్క్) చేరడానికి 1.5ఏళ్లు పట్టింది. 2019 జూన్లో ఈ మార్క్ను తాకింది. 

అంతా బాగుంది అనుకున్న సమయంలో కరోనా సంక్షోభంతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. కానీ ఆవెంటనే వీ షేప్లో పుంజుకున్నాయి. ఫలితంగా.. 2020 డిసెంబర్ నాటికి.. సెన్సెక్స్ 45వేల మార్క్ వద్ద నిలబడింది. 50వేల మార్క్ను 2021 ఫిబ్రవరిలో, 60వేల మార్క్ని 2021 సెప్టెంబర్లో టచ్ చేసింది సెన్సెక్స్. కానీ 60వేల నుంచి 65వేల వరకు కాస్త ఎక్కువ సమయమే పట్టిందని చెప్పుకోవాలి. ఏడాదిన్నరలో 438 ట్రేడింగ్ సెషన్స్ తర్వాత  2023 జులై 3న 65వేల్ మార్క్ని తాకింది సెన్సెక్స్.