ప్రపంచంలోకెల్లా అత్యధిక ప్రజామోదం గల నేతగా మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి ప్రపంచంలోకెల్లా అత్యధిక ప్రజామోదం గల నేతగా నిలిచారు. దేశంలో మోదీ నాయకత్వాన్ని 76 శాతం మంది ప్రజలు సమర్థిస్తుండగ18 శాతం మంది మాత్రమే వ్యతిరేకిస్తున్నట్లు ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.  అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్  అనే సంస్థ నిర్వహించిన ఈ సర్వేలో  భారతదేశంలో 76 శాతం మంది ప్రజలు ప్రధాని మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. 18 శాతం మంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు. మరో ఆరు శాతం మంది ఎటువంటి అభిప్రాయాన్ని వెల్లడించలేదు. 

ఇక మోదీ తర్వాతి స్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్‌ మాన్యుయెల్‌ లోపెజ్‌ ఒబ్రేడర్‌ ఉన్నారు. ఆయన నాయకత్వాన్ని మెక్సికో ప్రజలు 66 శాతం మంది ఆమోదిస్తుండగా.. 29 శాతం మంది వ్యతిరేకిస్తున్నారు. ఆండ్రెస్‌ తర్వాత స్విట్జర్లాండ్‌ ప్రెసిడెంట్‌ అలైన్‌ బెర్సెట్‌ మూడో స్థానంలో నిలిచారు. ఆయన నాయకత్వాన్ని 58 శాతం ప్రజలు కోరుకుంటుండగా.. 28 శాతం మంది వ్యతిరేకిస్తున్నారు.

ఈ సర్వేలో బ్రెజిల్‌కు చెందిన లులా డ సిల్వా, ఆస్ట్రేలియాకు చెందిన ఆంథోనీ అల్బనీస్‌ వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. ఇటలీ మాజీ ప్రధాని జార్జియా మెలోనీ ఈ సర్వేలో ఆరో స్థానంలో నిలిచారు. 41 శాతం మంది ఇటలీ వాసులు ఆమె నాయకత్వాన్ని కోరుకుంటున్నారు.

 బెల్జియంకు చెందిన అలెగ్జాండర్ డి క్రూ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇద్దరూ 37 శాతం ప్రజామోదంతో 7, 8 స్థానాల్లో నిలిచారు. ఈ సర్వేలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు 31 శాతం, బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌కి 25 శాతం, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌కు కేవలం 24 శాతం మాత్రమే ఆమోదం లభించింది.

సోనియాకు జన్మదిన శుభాకాంక్షలు

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ 77వ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలో సోనియాకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ పార్టీలకు అతీతంగా పలువురు నేతలు కాంగ్రెస్‌ నాయకురాలికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  సైతం సోనియాకు శుభాకాంక్షలు తెలిపారు.‘సోనియా గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆమెకు సంపూర్ణమైన, ఆరోగ్యవంతమైన జీవితాన్ని ప్రసాదించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా’ అంటూ మోదీ ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

ఆరు నెలల్లో 7.7 శాతంకు చేరుకోనున్న జిడిపి
 
ఇలా ఉండగా, భారతదేశ జిడిపి వృద్ధిరేటు 7.7 శాతానికి చేరువయ్యే అవకాశముందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. శనివారం ఢిల్లీలో జరిగిన ‘ఇన్ఫినిటీ ఫోరమ్‌ 2.0’ సదస్సులో వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా ప్రధాని మాట్లాడుతూ ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో భారత్‌ జిడిపి వృద్ధి రేటు 7.7కి చేరువయ్యే అవకాశం ఉంది. నేడు ప్రపంచం మొత్తం భారత్‌పైనే ఆశలు పెట్టుకుంది’ అని చెప్పారు. 
 
ఈ ఆర్థిక వృద్ధి గత పది సంవత్సరాల్లో అమలు చేసిన ఆర్థిక సంస్కరణల ప్రతిబింబంగా ఆయన అభివర్ణించారు. భారత్‌ నేడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫిన్‌టెక్‌ మార్కెట్‌లలో ఒకటి అని చెబుతూ  జిఐఎఫ్‌టి ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెంటర్‌ (ఐఎఫ్‌ఎస్‌సి) దాని కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. 
 
ఇక ఈ సదస్సునుద్దేశించి ఆయన మాట్లాడుతూ ‘గుజరాత్‌ ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ టెక్‌ (జిఐఎఫ్‌టి) సిటీని కొత్త యుగం ప్రపంచ ఆర్థిక, సాంకేతిక సేవల ప్రపంచ నాడీ కేంద్రంగా మార్చాలని తమ ప్రభుత్వం కోరుకుంటుందని ఆయన తెలిపారు. అలాగే గ్రీన్‌ క్రెడిట్స్‌ కోసం మార్కెట్‌ మెకానిజంను అభివృద్ధి చేయడంపై తమ ఆలోచనలను పంచుకోవాలని ఆయన నిపుణులను కోరారు.