మోదీ గ్యారంటీ ప్రజల హృదయాల్లో ప్రతిధ్వనించింది

మోదీ  గ్యారంటీ ప్రజల హృదయాల్లో ప్రతిధ్వనించిందని ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు నిరూపించాయని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. తప్పుడు ప్రకటనలు చేయడం ద్వారా తాము ఏమీ సాధించలేమనే విషయాన్ని కొన్ని రాజకీయ పార్టీలు అర్థం చేసుకోలేదని పరేక్షంగా కాంగ్రెస్‌నుద్దేశించి ఆయన చురకలు అంటించారు. 

ప్రధాని ఇక్కడ వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర లబ్ధిదారులతో ప్రధాని వర్చువల్‌గా ముచ్చటిస్తూ ఎన్నికల్లో విజయం సాధించడానికన్నా ముందు ప్రజల హృదయాలను గెలుచుకోవడం ముఖ్యమని తెలిపారు. ప్రజల విజ్ఞతను తక్కువ అంచనా వేయడం సరి కాదని హితవు చెప్పారు.

‘మేము ప్రజలతో నేరుగా సంబంధాన్ని పెట్టుకున్నాం. కేంద్ర ప్రభుత్వానికి, ఈ దేశ ప్రజలకు మధ్య ఒక భావోద్వేగ బంధం ఉంది. మన ప్రభుత్వం కేవలం ‘మాయీబాప్’ (అమ్మా నాన్నల) ప్రభుత్వం కాదు. తల్లులు, తండ్రులకు సేవ చేసే ప్రభుత్వం. బిడ్డ తన తల్లిదండులకు ఎలా సేవ చేస్తాడో అదే విధంగా మోడీ మీకు సేవ చేయడానికి పని చేస్తాడు’ అని ప్రధాని తెలిపారు. 

పేదల కోసం, ఎవరూ పట్టించుకోని అణగారిన వర్గాలు, ఎవరికోసం ఆఫీసుల తలుపులు మూసి ఉంచబడతాయో అలాంటి వారిని మోదీ  పట్టించుకుంటాడని ఆయన స్పష్టం చేశారు. వారిని పట్టించుకోవడమే కాదు, వారిని పూజిస్తాడు అని చెబుతూ `నాకు ప్రతి పేదవాడు.. ప్రతి యువకుడు ఓ విఐపియే’ అని కూడా ఆయన పేర్కొన్నారు.

‘మోదీ గ్యారంటీ’ ప్రజల హృదయాల్లో ప్రతిధ్వనించిందని ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలు రుజువు చేశాయని ప్రధాని అంటూ బిజెపిని గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. మోదీ గ్యారంటీపై ప్రజలకు నమ్మకం అంటే అన్ని గ్యారంటీలను నెరవేరుస్తారన్న గ్యారంటీ అని కూడా ఆయన తెలిపారు.

‘ఎన్నికల్లో గెలవడానికన్నా ముందు ప్రజల హృదయాలను గెలవడం ముఖ్యం. వారి వివేకాన్ని తక్కువ అంచనా వేయడం సరికాదు. కొన్ని ప్రతిపక్షాలు గనుక తమ స్వార్థ ప్రయోజనాలకన్నా కూడా ప్రజలకు సేవచేయడానికి ప్రాధాన్యత ఇచ్చి ఉంటే దేశ ప్రజ్జల్లో అధిక భాగం పేదరికం,కష్టాల్లో ఉండే వారు కాదు’ అంటూ ధ్వజమెత్తారు. 

దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన వారు నిజాయితీగా పని చేసిఉంటే ఇప్పుడు మోదీ ఇచ్చిన గ్యారంటీలు 50 ఏళ్ల క్రితమే నెరవేరి ఉండేవని ప్రధాని ఎద్దేవా చేశారు. మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అందరికీ అందేలా చూడాలన్న లక్ష్యంతో వికసిత్ సంకల్ప్ యాత్రను బిజెపి దేశవ్యాప్తంగా నిర్వహిస్తోందని తెలిపారు. 

ఈ యాత్ర రథాలు ఎక్కువ ప్రాంతాలకు చేరే కొద్దీ ప్రజల్లో ఉత్సాహం కూడా పెరుగుతుండడం సంతృప్తినిస్తోందని ప్రధాని చెప్పారు. అతి తక్కువ సమయంలో 1.25 కోట్లకు పైగా ప్రజలు ‘మోదీ కీ గ్యారంటీ’తో అనుసంధానం అయ్యారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.