ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్‌… ప్రమాణస్వీకారంకు బిజెపి దూరం 

శాసనసభ సంప్రదాయాలను పక్కనబెట్టి తెలంగాణ శాసనసభ ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం పక్ష నాయకుడు అక్బరుద్దీన్‌ ఒవైసీని ఎన్నుకోవడాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండిస్తూ అసెంబ్లీ సమావేశాలకు గర్హాజరయ్యారు. శనివారం జరిపిన ఎమ్యెల్యేల ప్రమాణస్వీకారం ఎనిమిదిమంది బిజెపి సభ్యులు పాల్గొనలేదు. తమ నిరసనను గవర్నర్ డా. తమిళసై సౌందరాజన్ కు తెలిపారు.
 
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్‌ ఒవైసీ తాను ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనని శుక్రవారం ప్రకటించారు. శనివారం ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డితో భేటీ అయి ఈ విషయంపై చర్చించారు. అనంతరం ఈరోజు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు బీజేపీ ఎమ్మెల్యేలు వెల్లడించారు.
 
బిజెపి శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు కిషన్ రెడ్డితో కలిసి భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయంలో పూజలు చేసిన అనంతరం, ట్యాంక్ బండ్ వద్ద డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం, తర్వాత అమరవీరుల స్థూపం చేరుకొని నివాళులు అర్పించారు.
 
వాస్తవానికి స్పీకర్‌ ఎన్నిక జరిగే వరకు శాసనసభ కొనసాగడానికి వీలుగా ప్రతిపక్ష ఎమ్మెల్యేల్లో సీనియర్‌ సభ్యుడిని ప్రొటెం స్పీకర్‌గా నియమించడం ఆనవాయితీ. దాని ప్రకారం ఇటీవలి ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించి, ప్రతిపక్ష హోదా పొందబోతున్న బీఆర్‌ఎ్‌సలోని సీనియర్‌ సభ్యుడిని ప్రొటెం స్పీకర్‌గా నియమించాల్సి ఉంటుంది. 
 
ఈ లెక్కన తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మాజీ సీఎం కేసీఆర్‌ ఈ నియామకానికి అర్హుడు. కానీ, ఆయన తుంటి ఎముక ఫ్రాక్చర్‌ అయి ఆస్పత్రిపాలు కావడంతో ప్రొటెం స్పీకర్‌గా నియమించలేదని తెలుస్తోంది. కేసీఆర్‌ తరువాత బీఆర్‌ఎ్‌సకే చెందిన పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు ఏడుసార్లు ఎన్నికైన సీనియర్లుగా ఉన్నారు. వీరిలో ఒకరిని ప్రొటెం స్పీకర్‌గా నియమించే అవకాశం ఉంటుంది. 
 
అయితే పోచారం శ్రీనివా్‌సరెడ్డి ఇదివరకటి శాసనసభకు స్పీకర్‌గా పని చేసినందున ఆయనను డీగ్రేడ్‌ చేస్తూ ప్రొటెం స్పీకర్‌గా నియమించలేదని తెలుస్తోంది. కానీ, హరీశ్‌రావును ఎందుకు చేయలేదన్న విషయంలో మాత్రం సందేహాలున్నాయి. ఏడుసార్లు ఎన్నికైన హరీశ్‌రావును పక్కన పెట్టి ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన అక్బరుద్దీన్‌ ఒవైసీని ప్రొటెం స్పీకర్‌గా నియమించారు. 
 
అంతేకాకుండా బీఆర్‌ఎ్‌సకు చెందిన తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, దానం నాగేందర్‌ కూడా ఆరుసార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అయినా వీరికి కూడా అవకాశం దక్కలేదు. 2018లో కూడా నాటి కేసీఆర్ ప్రభుత్వం ఎంఐఎం శాసనసభ్యుడినే  ప్రొటెం స్పీకర్ గా నియమించడం గమనార్హం.
 
ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎంకు చెందిన అక్బరుద్దీన్ ఒవైసీని నామినేట్ చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా ఎన్నికైన అసెంబ్లీ ప్రారంభంలోనే విధివిధానాలు, ప్రొటోకాల్‌లు, పూర్వాపరాలను ఉల్లంఘించడం పట్ల బిజెపి సభ్యులు గవర్నర్ కు నిరసన వ్యక్తం చేశారు. రాజ్యాంగం ప్రకారం, ఆర్టికల్ 188 ప్రకారం, అసెంబ్లీలో సంవత్సరాల పరంగా అత్యంత సీనియర్ సభ్యుడు ప్రొటెం స్పీకర్‌గా నామినేట్ చేయబడతారని గుర్తు చేశారు.
 
అక్బరుద్దీన్ ఒవైసీ కంటే సీనియర్ సభ్యులు చాలా మంది ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఆయనను ప్రొటెం స్పీకర్‌గా నియమించాలని నిర్ణయించడం నిర్ణీత నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించడమే అని వారు స్పష్టం చేశారు. బుజ్జగింపు రాజకీయాల ముసుగులో కొన్ని వర్గాల ప్రజలను మభ్యపెట్టడానికి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిబంధనలను ఉల్లంఘించిన తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 
 
 ఈ నేపథ్యంలో, ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ నామినేషన్‌ను పక్కనపెట్టి, ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా సీనియర్ సభ్యుడిని నియమించాలని సూచించాలని బీజేపీ సభ్యులు గవర్నర్ ను అభ్యర్ధించారు.  అప్పటివరకు, కొత్తగా ఏర్పాటైన అసెంబ్లీకి పూర్తిస్థాయి స్పీకర్ ఎన్నిక ప్రక్రియను నిలుపుదల చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించాల్సిందిగా కోరారు. నిబంధనలకు విరుద్ధంగా నియమించిన అక్బరుద్దీన్ ముందు తాము ప్రమాణం చేయలేమని తేల్చి చెప్పారు. 
 
కాగా, శాసనసభ గౌరవాన్ని కాలరాసేలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోందని  కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. సీనియర్ సభ్యులు ఉన్నా ఎంఐఎంతో ఒప్పందం మేరకు అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్‌గా నియమించారని మండిపడ్డారు. సభా నియమాలను తుంగలో తొక్కడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందని చెప్పారు. అందుకే ఇవాళ అసెంబ్లీని బహిష్కరించాలని నిర్ణయించామని వెల్లడించారు. 
 
ఎన్నికల ప్రచారంలో బీజేపీ, ఎంఐఎం ఒకటేనన్న కాంగ్రెస్ అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా ఎలా నియమించిందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. సీనియర్ సభ్యుడిని ప్రొటెం స్పీకర్‌గా నియమించి ఆయన ఆధ్వర్యంలోనే స్పీకర్ ఎన్నిక జరగాలని ఆయన డిమాండ్ చేశారు.