మావోయిస్టులతో జాగ్రత్త.. చరిత్ర చెబుతున్న సత్యం ఇదే..!!

తెలంగాణలో కొత్త సర్కార్ కొలువు దీరింది. దశాబ్దం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టింది. డైనమిక్ నాయకునిగా గుర్తింపు పొందిన ఎనుముల రేవంతరెడ్డి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం విశాల ప్రజాసమూహం సమక్షంలో ప్రమాణం చేసింది. దాంతో రాష్ట్రంలో ప్రజాస్వామ్య వాతావరణం నలుదిశలా కనిపించింది. రాజ్యాధికారం చుట్టూ ఎల్లప్పుడూ అనేక కుట్రలు, కుతంత్రాలు జరుగుతూ ఉంటాయి. ఇది అనాదిగా కనిపించే అంశమే అయినప్పటికీ, రాజ్యాంగ విరుద్ధంగా, అప్రజాస్వామిక పద్ధతిలో, చట్టవ్యతిరేకంగా సాయుధంగా కుట్రలు, కుతంత్రాలు జరపడం ఆధునిక ప్రజాస్వామ్య, వైజ్ఞానిక యుగంలో అంతగా అభిలషణీయం కాదు. కానీ, దురదృష్టవశాత్తూ భారత మావోలు దశాబ్దాలుగా ఈ పద్దతిలో, మార్గంలో రాజ్యాధికారం కోసం కుట్రలు పన్నుతున్న సంగతి తెలిసిందే. వర్తమాన కాలంలో సాయుధ పోరాటం ద్వారా రాజ్యాధికారం చేపట్టలేరన్న దృశ్యం ప్రజలకు స్పష్టంగా కనిపిస్తున్నా, మావోలకు మాత్రం ఆ విషయం ఇసుమంత కూడా బోధపడటం లేదు. అర్ధం కావడం లేదు. దీర్ఘకాలిక సాయుధ పోరాటం చేసి తమ లక్ష్యాన్ని చేరుకుంటామని వారు పదే పదే ప్రకటించడం విడ్డూరం.

కోట్ల మంది భారతీయులు ప్రజాస్వామ్య ప్రక్రియలో గత 75 ఏళ్ళుగా పాల్గొంటూ తమ ప్రభుత్వాన్ని తామే ఎన్ను కుంటున్నామన్న భావనతో ప్రజలు సంతృప్తితో కొనసాగుతున్న విషయాన్ని గమనిస్తూ మావోయిస్టులు ఇలా మాయదారి మార్గాన్ని ఎంచుకోవడం విషాదం. ఆ మార్గాన్ని, విధానాన్ని కాదని సమాజం చాలా దూరం ప్రయాణించి ముందుకు సాగుతున్న ఎరుక, స్పృహ మావోయిస్టుల్లో లేకపోవడం వారి అజ్ఞానానికి చిహ్నం తప్ప మరొకటి అవదు.
ఇప్పుడు ఇదంతా ఎందుకు ప్రస్తావించుకోవలసి వస్తోందంటే…. పూర్వపు పీపుల్స్ వార్, ప్రస్తుత మావోయిస్టులకు ఒకప్పుడు పెట్టని కోటగా నిలిచిన తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడంతో ఆ పార్టీ ఉదార వైఖరి, బలహీనతల గూర్చి క్షుణ్ణంగా తెలిసిన వామపక్ష తీవ్ర వాదులైన మావోలు తిరిగి తెలంగాణలో చెలరేగే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ఉపోద్ఘాతమంతా.
దశాబ్దాల క్రితం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలో కొనసాగినప్పుడు అప్పటి పీపుల్స్ వార్ శాంతి చర్చల పేరిట కాల్పుల విరమణ, విరామ సమయంలో బాగా పుంజుకున్న సంగతి విస్మరించరాదు. ఆ చర్చలను ఎత్తుగడగా తమ వ్యూహంలో భాగంగా మావోయిస్టులు కదతొక్కారు. పైకి శాంతిచర్చలుగా భావించి రహస్యంగా రాజ్యాధికారం కోసం సాయుధ పోరాట బాటల్ని విస్తృతం చేసుకున్న విషయం విదితమే. శాంతి, శాంతి అంటూనే వార్‌ను విస్తరించడం పాన్ ఇండియా మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందిన మాటమరువ రాదు. అలా వారి మాటలకు అర్థాలు వేరుగా ఉంటాయన్న విషయం గతంలో అనేక సార్లు రుజువైంది. మావోయిస్టు పార్టీ ఆవిర్భావంతో ఉత్తరాదికి చెందిన మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ కమ్యూనిస్టు సెంటర్ (ఎంసీసీ) కార్యాచరణ అధికార పంథాగా మారడంతో తెలంగాణలో పెద్ద ఎత్తున హింసకు తెగబడ్డారు. దాంతో వారిదంతా రక్త చరిత్రగానే మిగిలింది. తెలంగాణ పెద్దఎత్తున రక్తమోడింది. అలా దశాబ్దాలపాటు హింసరచన, ధ్వంస రచనకు పాల్పడినా ఫలితం ఏమైనా కనిపించిందా? అంటే శూన్యం…. అన్న సమాధానం కనిపిస్తోంది. అంతేకాక, సమకాలీన జ్ఞాన సమాజానికి తెలంగాణ కొత్త తరాలు దూరమై ఆర్థిక ఎదుగుదల అవకాశాలు కోల్పోయారు. ఆధునిక విద్యకు, కంప్యూటర్ పరిజ్ఞానానికి మొఖం వాచి వంచితులై మిగిలాయి. దాంతో వారి కుటుంబాలు మరింత వెనుకబడిపోయాయి. పేదరికంలో మగ్గేందుకు ఆ ఉద్యమం ఉపకరించిందన్న విశ్లేషణలు అనేకం వెలువడ్డాయి. ఇది ఎంతటి అన్యాయం? ఎంతటి దౌర్భాగ్యం? తెలంగాణ రాజధాని హైదరాబాద్ అభివృద్ధి, ఇక్కడి పని సంస్కృ తి, సంపద సృష్టి విధానం పట్టించుకోకుండా, ఆ వాతావరణం ఆలోచనను మిగతా జిల్లాలకు వేగంగా విస్తరించ రాదన్న స్పృహ లేకుండా ఇంకా దండకారణ్యం, బస్తర్ అడవులు, అంబూజ్ ఢ్ కొండల గూర్చి కలవరిస్తూ మావోయిస్టులు ఊదరగొట్టడం ఎలా ప్రజాసంక్షేమ-ప్రజోపయోగ కార్యక్రమం అవుతుందో వారికే తెలియాలి.

ప్రజల బాగోగులకన్నా, వారి జ్ఞాన చక్షువులు విప్పారడంకన్నా, సమకాలీన – ఆధునిక విజ్ఞానదారుల వెంట నడవడంకన్నా తెలంగాణ యువత అడవిబాట పట్టడం, దండకారణ్యంలో దండుగా ఏర్పడటం మావోల లక్ష్యం. ఇది ఎంతటి దారుణమో, అపరాథమో ఎవరికి వారే యోచించాలి. మార్క్సిజం – మావోయిజం మత్తులో పడి ఆ సిద్ధాంత గంతలు కళ్ళకు కట్టుకుని మావోయిస్టులు తెలంగాణాను, భారతదేశాన్ని తిలకిస్తే ఎలా? ఆ సిద్ధాంతాలకు నూకలు చెల్లాయనీ, వాటికి బూజు పట్టిందని ప్రపంచ మంతా ఘోషి స్తున్నా, ఆయా దేశాలలోని మావోయిస్టులు ఆ పంథా నుంచి తప్పుకుంటున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నా, భారత మావోయిస్టులు ఇలా ప్రజలకు భారంగా మారడం విషాదం కాక ఏమవుతుంది?

పైగా తమ పార్టీకి ప్రజాసైన్యం (పీఎల్బీఏ) కీలకమంటూ తాజాగా డిసెంబర్ 2వ తేదీనుంచి వారోత్సవం నిర్వహించారు. ఇది చదవేస్తే ఉన్న మతిపోయిన చందంగా ఉంది తప్ప అందులో ఇసుమంతయినా విజ్ఞత కనిపించడం లేదు. రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధకాండ కనిపిస్తున్న మానవ కల్లోలం. విధ్వంసం కళ్ళారా చూస్తున్నా తమ పీఎల్ జీఏని బలోపేతం చేసేందుకు మావోయిస్టులు మానవ, ఆర్థిక వనరులను సమీకరించడం ఏ విధంగా ప్రజల సాధికారతకు తోడ్పడుతుందో వారికే తెలియాలి? శవాల దిబ్బలు, బూడిద కుప్పలు, రక్తపుటేరులు ప్రజాస్వామ్య యుగంలో ప్రజల సాధికారతను పెంచలేవన్న అత్యంత సూక్ష్మ విషయాన్ని విస్మరించి దండకారణ్యంలో ప్రజా సైన్యం సంఖ్యను పెంచే యత్నం మార్పునకు బాట వేయదు.

తాజాగా చత్తీస్‌గఢ్‌లో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడింది. మోదీ-షా నాయకత్వ ద్వయం వామపక్ష తీవ్రవాదం, ఉగ్ర వాదంపై ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే దేశంలో మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య బాగా తగ్గిందని, సీఆర్పీఎఫ్ మావోయిస్టు నిరోధక ప్రత్యేక దళాల క్యాంపుల సంఖ్య బాగా పెరిగిందని అధికార లెక్కలు చెబుతున్నాయి. మావోయిస్టులు ఇచ్చిన బహిష్కరణ పిలుపునకు ఆదరణ కరవైన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పొరుగున ఉన్న తెలంగాణలో తమ పూర్వ పరిచయాలను పునరుద్ధరించు కుని పూర్వవైభవం పొందేందుకు మావోలు ఎత్తులు, వ్యూహాలు పన్నే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. వాటి జాడలు అప్పుడే బయట పడ్డాయి. రామగుండం, మంచిర్యాల పట్టణాల్లో మావోయిస్టుల జంటను ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే, చర్ల సరిహద్దుల్లో శక్తిమంతమైన మందు పాతరను పోలీసులు కనుగొన్నారు. అలాగే, మహారాష్ట్ర సరిహద్దుల్లోని సికొంచ, గడ్చిరోలీ ప్రాంతాల్లో సాయుధ మావోయిస్టుల కదలికలు పెరిగాయని ఆ రాష్ట్ర నక్సల్స్ వ్యతిరేక దళం సి-60 పేర్కొంది. చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఇటీవల ధాన్యం లారీని మావోలు దగ్ధం చేశారు. ఇదంతా దేనికి సంకేతం? తెలంగాణలోకి చొరబడి తమదైన శైలిలో కార్యక్రమాలను నిర్వహిస్తూ కొత్త సర్కార్‌కి పక్కలో బల్లెంలా మారే ముప్పును సూచిస్తోందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అయితే, అది అంత ఆషామాషీ వ్యవహారం కాదని మావొయిస్టులకు సైతం తెలియడం గమనార్హం. అయినా ఉనికి కోసం మావోలు తెగిస్తే నష్టపోయేది తెలంగాణ మాత్రమే!

– పుప్పల నరసింహం, వ్యాసకర్త, సీనియర్ జర్నలిస్ట్