కెసిఆర్ కు శస్త్రచికిత్స విజయవంతం

* ప్రధాని మోదీ, సీఎం రేవంత్ ఆరా
 
బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు శుక్రవారం తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా జరిపారు. ఆయన ఎర్రవల్లిలోని తన నివాసంలో గురువారం రాత్రి కాలు జారిపడ్డారు. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఆయనను సోమాజిగూడలోని యశోద దవాఖానకు తరలించారు. 
 
వైద్యులు సీటీ స్కాన్‌ సహా అనేక రకాల వైద్య పరీక్షలు నిర్వహించి కేసీఆర్‌ ఎడమ కాలి తుంటి భాగంలో ఫ్రాక్చర్‌ అయినట్టు గుర్తించారు. ఈ మేరకు వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. సాయంత్రం కేసీఆర్‌కు తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స నిర్వహించారు.  శస్త్ర చికిత్స అనంతరం కేసీఆర్‌ సంపూర్ణంగా కోలుకోవడానికి 6-8 వారాల సమయం పడుతుందని వెల్లడించారు. 
 
కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నదని తెలిపారు. కేసీఆర్‌ వెంట ఆయన సతీమణి శోభ, కుమారుడు కేటీఆర్‌, కూతురు కవిత, మనుమడు హిమాన్షు, ఎంపీ సంతోశ్‌ కుమార్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు.  కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని పలువురు ఆకాంక్షించారు. కొందరు ట్వీట్‌ చేయగా, మరికొందరు కేటీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు.
కేసీఆర్‌ గాయపడిన విషయం తెలిసి బాధపడ్డానని, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్‌ చేశారు. కెసిఆర్‌కు అయిన గాయం గురించి తెలిసి చాలా బాధప డినట్టు తెలిపారు. ఆరోగ్యంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. కేసీఆర్‌ త్వరగా కోలుకొని, సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని ప్రార్థిస్తున్నట్టు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ట్వీట్‌ చేశారు. 
 
కెసిఆర్ ఆరోగ్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. కెసిఆర్ ఆరోగ్య పరిస్థితిపై తనకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని, కెసిఆర్‌కు మె రుగైన వైద్య సహాయం అందించాలని వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వికి సూచించారు. సిఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు యశోద హాస్పిటల్‌కు వైద్య, ఆరోగ్య శాఖ సెక్రటరీ రిజ్వీ వెళ్లి వైద్యులను అడిగి కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన తెలుసుకున్నారు.
 
ఏపీ సీఎం జగన్‌, హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ తదితరులు కేటీఆర్‌కు ఫోన్‌ చేసి ఆరా తీశారు. కేసీఆర్‌ కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, చంద్రబాబు, లోకేశ్‌, బీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు, సినీ నటుడు చిరంజీవి ఆకాంక్షించారు.
 
కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున దవాఖానకు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో ఇన్ఫెక్షన్‌ సోకే ప్రమాదం ఉన్నందున కార్యకర్తలు ఎవరూ దవాఖాన వద్దకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్‌ ఆరోగ్యం కోసం అందరూ ఇంటి వద్దే ప్రార్థన చేయాలని కోరారు. నేతలు, అభిమానులు కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందవద్దని బీఆర్‌ఎస్‌ వరింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు.