అస్సాంతో సహా భారత భూభాగంలోకి ప్రవేశించిన అక్రమ వలసదారుల వివరాలు ఇవ్వాలని సుప్రీం కోర్టు గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దీంతోబాటు ఈ అక్రమ వలసదారులను నిరోధించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటో తెలపాలని కోరింది. పౌరసత్వ చట్టం 1955 సెక్షన్ 6ఎ(2) ద్వారా ఎంతమందికి పౌరసత్వం ఇచ్చారో ఆ వివరాలు కూడా కావాలని అడిగింది.
పౌరసత్వ చట్టం 1955 లోనిసెక్షన్ 6ఎ(2) రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్లను ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని అస్సామీ గ్రూపులు వేసిన పిటీషన్లపై విచారణ వరుసగా మూడో రోజు కూడా కొనసాగింది.
ఈ సందర్భంగా పలు ప్రశ్నలను సుప్రీం ధర్మాసనం సంధించింది. బంగ్లాదేశ్‌తో పశ్చిమ బెంగాల్ కూడా సరిహద్దును పంచుకుంటున్నప్పుడు కేవలం అస్సాంకు మాత్రమే ఈ సెక్షన్‌ను ఎందుకు అమలు చేస్తున్నారని ప్రశ్నించింది. 1985లో అస్సాం ఒప్పందంపై సంతకం చేసిన కొద్ది కాలానికే ఈ ప్రత్యేక నిబంధన తీసుకొచ్చారని పిటీషనదారులు ఆరోపించారు.
భారత దేశం నిరంకుశ దేశం కాదని, అక్రమ వలసదారులను పట్టుకుని బహిష్కరించలేమని ప్రధాన న్యాయమూర్తి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అదే సమయంలో అక్రమ వలసదారులను అపరిమిత సంఖ్యలో దేశంలోకి అనుమతించలేమని స్పష్టం చేశారు. వీటిపై అఫిడవిట్ దాఖలు చేయడానికి సోమవారం వరకూ సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది.
సెక్షన్ 6 ఎ ప్రకారం బంగ్లాదేశ్ నుండి భారతదేశానికి వలసలను మూడు టైమ్ జోన్లుగా విభజించింది. 1966 జనవరి 1 కన్నా ముందు భారతదేశంలోకి ప్రవేశించిన వారు ఎలాంటి షరతులు లేకుండా భారతీయ పౌరులుగా పరిగణించబడతారు. 1966 జనవరి 1 నుంచి 1971 మార్చి 25 వరకూ మధ్య వచ్చిన వారు కొన్ని షరతులకు లోబడి భారతీయులుగా పరిగణించబడతారు.
వీటికి బదులేదీ..?
- పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6 ఎ(2) ప్రకారం పౌరసత్వం మంజూరు చేయబడిన వ్యక్తుల సంఖ్య, అంటే జనవరి 1,1966 నుండి మార్చి 25, 1971 మధ్య వచ్చిన వారు.
- పై కాలవ్యవధికి సంబంధించి విదేశీయుల ట్రిబ్యునల్‌ల ఆదేశాల ప్రకారం ఎంతమంది విదేశీయులను కనుగొన్నారు?
- అస్సాంతో సహా భారతదేశంలోకి అక్రమ వలసదారుల ప్రవాహం గురించిన అంచనాలు తెలపండి.
- మార్చి 25, 1971 తర్వాత భారతదేశంలోకి ప్రవేశించినట్లు ఆరోపణలెదుర్కొంటున్న వ్యక్తులకు సంబంధించి, (ఎ) కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొత్తం విదేశీయుల ట్రిబ్యునళ్ల సంఖ్య, (బి) పరిష్కరించబడిన మొత్తం కేసుల సంఖ్య, (సి) తేదీ నాటికి పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య, (డి) కేసుల పరిష్కారానికి తీసుకున్న సగటు సమయం (ఇ) అటువంటి సమస్యలపై గౌహతి హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య.
- భారత భూభాగంలోకి, ప్రత్యేకించి ఈశాన్య రాష్ట్రాలలోకి అక్రమ వలసలను ఎదుర్కోవడానికి పరిపాలనా స్థాయిలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు.ఈ అంశాలపై కేంద్ర ప్రభుత్వం, అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి అఫిడవిట్‌ను దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.
More Stories
చైనా జలవిద్యుత్ విస్తరణను సవాల్ చేస్తున్న టిబెట్ నమూనా!
మతం ఆధారంగా రిజర్వేషన్ ఉండొద్దు
రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్‌పై అవిశ్వాస తీర్మానం