రేపటి నుంచే మహిళలకు టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఎ రేవంత్ రెడ్డి జరిపిన తొలి మంత్రివర్గ సమావేశంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు వాగ్ధానాలలో రెండు వాగ్ధానాలను వెంటనే అమలు చేయాలని నిర్ణయించారు.  ముందుగా మహిళలకు టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
శనివారం నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి రానున్నది.
బస్సుల్లో ఆధార్‌ కార్డును చూపించి మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. శుక్రవారం సంబంధిత శాఖ అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించే సమావేశానంతరం తుది మార్గదర్శకాలు ఖరారు కానున్నాయి.  ఈ పథకం అమలుపై మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న తమిళనాడు, కర్ణాటకలో టీఎస్‌ఆర్టీసీ ఐదుగురు అధికారుల బృందం పర్యటించింది. ఆ రాష్ర్టాల్లో ఉచిత ప్రయాణం ఏయే క్యాటగిరీ బస్సుల్లో అమలు చేస్తే ఎంత భారం పడనున్నదనే దానిపై అధ్యయనం చేసింది.
 
ఈ భేటీ గురించిన వివరాలను మీడియాకు మంత్రి డి. శ్రీధర్‌బాబు తెలుపుతూ ‘‘కేబినెట్ సమావేశంలో ఆరు గ్యారెంటీలతో పాటు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపాం. ఐదేళ్లలో మార్పు చూపెడతాం. 2014 నుంచి 2023 డిసెంబర్ 7వ తేదీ వరకు అన్ని డిపార్ట్‌మెంట్‌లో ఎంత ఖర్చు పెట్టారని శ్వేతపత్రం విడుదల చేయాలని అధికారులను ఆదేశించాం” అని వెల్లడించారు. 
 
ఆరు గ్యారెంటీల విషయంలో సుదీర్ఘంగా చర్చ జరుగుతుందని చెబుతూ రెండు గ్యారెంటీలు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.  మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఆరోగ్యశ్రీ పరిధిని రూ. 10 లక్షలకు పెంపు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినమైన ఈ నెల 9 (శనివారం) నుండే అమలు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.
ఇలా ఉండగా, 24 గంటలు విద్యుత్ రైతులు, పరిశ్రమలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.  2014 నుంచి విద్యుత్ విషయంలో అనేక తప్పులు జరిగాయని పేర్కొంటూ శుక్రవారం విద్యుత్ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష చేస్తారని తెలిపారు. గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.
ఈనెల 9వ తేదీన అసెంబ్లీని నిర్వహిస్తామని, ఆరోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపారు. రైతు బంధుకు సంబంధించి ఫైనాన్స్ డిపార్ట్ ‌మెంట్ నుంచి వివరాలు కోరామని పేర్కొంటూ వివరాలు రాగానే అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.  
ఉచిత విద్యుత్ పై సీఎం ఆగ్రహం ఉచిత విద్యుత్‌పై సుదీర్ఘంగా చర్చి సాగినట్లు, విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీపై సిఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. శాఖలో ఉన్న ప్రస్తుత పరిస్ధితులను గోప్యంగా ఉంచడంపై మండిపడిట్లు తెలిసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభం తెచ్చేలా కుట్ర జరిగిందని ధ్వజమెత్తారు. 

 విద్యుత్ శాఖలో ఇప్పటివరకు రూ. 85 వేల కోట్ల అప్పులు ఉన్నట్లు అధికారులు సీఎంకు వివరించగా దీనిపై పూర్తి స్థాయి వివరణ కోసం 2014 నుంచి ఇప్పటివరకు శాఖకు సంబంధించిన పూర్తి వివరాలతో శుక్రవారం సమీక్షా సమావేశంకు హాజరు కావాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

కాగా ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు ఇప్పటికే రాజీనామా చేయడంతో ఆయన రాజీనామాను ఆమోదించవద్దని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అంతేగాకుండా శుక్రవారం నిర్వహించే రివ్యూకు ప్రభాకర్ రావును కూడా రప్పించాలని ఆర్డర్ వేశారు. దీంతో ఆ సమీక్షలో ఏ జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.