కాలు జారి పడి యశోదా ఆస్పత్రిలో చేరిన కేసీఆర్

బిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు  ఇంట్లో కాలు జారి పడటంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సోమాజిగూడ యశోదా ఆస్పత్రిలో కేసీఆర్‌కు చికిత్స అందిస్తున్నారు. ప్రాథమిక పరీక్షల్లో కేసీఆర్‌కు తుంటి ఎముక విరిగినట్టు గుర్తించారు.  కేసీఆర్‌కు శస్త్ర చికిత్స చేయాల్సి రావొచ్చని భావిస్తున్నారు.
పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత శస్త్ర చికిత్సపై నిర్ణయం తీసుకోనున్నారు. ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.  కేసీఆర్‌ ఆరోగ్యంపై ఆయన  కుమార్తె,ఎమ్మెల్సీ కవిత సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా స్పందించారు. కేసీఆర్‌కు స్వల్ప గాయమైందని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని చెప్పారు. ఆయన త్వరలోనే కోలుకుంటారని వెల్లడించారు. కేసీఆర్‌పై ప్రజల ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపారు.
 
ఈ నెల 3వ తేదీ మధ్యాహ్నం నుంచి కేసీఆర్‌ ఎర్రవెల్లిలోని ఫాం హౌస్‌లో ఉంటున్నారు.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ప్రగతి భవన్‌ విడిచి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఫాం హౌస్‌లోనే ఉంటున్నారు. బిఆర్‌ఎస్‌ తరపున ఎన్నికైన ఎమ్మెల్యేలతో ఫాంహౌస్‌లోనే భేటీ అయ్యారు. గురువారం స్వగ్రామం చింతమడకకు చెందిన ప్రజలతో కూడా కేసీఆర్ భేటీ అయ్యారు. 
 
రాత్రి పొద్దు పోయిన తర్వాత కేసీఆర్ కాలు జారి పడిపోయినట్టు తెలుస్తోంది. ఆ వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. కేసీఆర్ అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు, బిఆర్‌ఎస్ ముఖ్య నాయకులు హుటాహుటిన యశోద ఆస్పత్రికి చేరుకున్నారు. కుమారుడు కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఇతర నాయకులు యశోదా ఆస్పత్రికి చేరుకున్నారు.