20న భూదాన్‌ పోచంపల్లికి రాష్ట్రపతి ముర్ము

ఈ నెల 20న యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. పోచంపల్లి ఇక్క‌త్‌ వస్త్రాలు, వీవింగ్‌, కార్మికుల జీవనశైలిని తెలుసుకోనున్నారు. రాష్ట్రపతి రాక సందర్భంగా వీవర్స్‌ సర్వీస్‌ సెంటర్‌ రీజినల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ అనిల్‌ కుమార్‌ గురువారం పోచంపల్లిలో ఏర్పాట్లను పరిశీలించారు. 
 
అనంతరం ఆయన విలేకరులతో వివరాలు వెల్లడించారు. ఈ నెల 18న హైదరాబాద్‌ బొల్లారంలో శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి విచ్చేయనున్నారని, వారం రోజుల ప్రోగ్రాంలో ఈ నెల 20న భూదాన్‌ పోచంపల్లికి ఉదయం 11:10 గంటలకు రానున్నారని తెలిపారు.  గంట పాటు పర్యటన ఉంటుందని, చేనేత ఉత్పత్తులు, వీవింగ్‌, కార్మికుల జీవనశైలిని తెలుసుకుంటారని చెప్పారు.
సుమారు 500 మంది చేనేత కార్మికులతో నిర్వహించే సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగిస్తారని తెలిపారు. సంత్‌ కబీర్‌, పద్మశ్రీ జాతీయ అవార్డులు పొందిన వారు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 16 మంది ఉన్నారని, అందులో ఐదు నుంచి పది మందిని ఎంపిక చేసి రాష్ట్రపతి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. వీటితోపాటు తెలంగాణ హ్యాండ్లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ ఆధ్వర్యంలో తెలంగాణ ఔన్నత్యాన్ని ప్రతిబింబించేలా డిస్‌ప్లే ఉంటుందని చెప్పారు. 

తెలంగాణ చేనేత వస్త్రాలు గొల్లభామ, పోచంపల్లి ఇక్క‌త్‌ వస్త్రాలు, నారాయణపేట, గద్వాల వస్ర్తాలు, పుట్టపాక తెలియా రుమాలును ప్రదర్శన నిర్వహిస్తారని వివరించారు. నాలుగు మగ్గాలపైన తెలియా రుమాలు, పోచంపల్లి ట్రెడిషనల్‌, డబుల్‌ ఇకత్‌, పోచంపల్లి లేటెస్ట్‌ వస్త్రాలను నేసేలా ఏర్పాటు చేస్తారని చెప్పారు.