ములుగు సమ్మక్క-సారక్క యూనివర్సిటీకి లోక్‌సభ ఆమోదం

తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ములుగు జిల్లాలో ‘సమ్మక్క సారక్క సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ’ ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లును కేంద్రం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టగా.. గురువారం ఆమోదం లభించింది. సెంట్రల్‌ యూనివర్సిటీస్‌ (సవరణ) బిల్లు, 2023కి సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. 
 
బిల్లుకు ప్రతిపక్ష సభ్యులు ప్రతిపాదించిన సవరణలను ప్రభుత్వం తిరస్కరించింది. ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ మాట్లాడుతూ గిరిజన యూనివర్సిటీతో తెలంగాణ ప్రజలకు నాణ్యమైన ఉన్నత విద్య, పరిశోధన సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. రానున్న సంవత్సరాలలో ప్రాంతీయ ఆకాంక్షలు నెరవేరుతాయని చెప్పారు. యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్రం ఇప్పటికే రూ.889.7 కోట్లను బడ్జెట్‌లో కేటాయించిన విషయం తెలిసిందే.
 
గిరిజనులకు గిరిజన కళలు, సంస్కృతి, సంప్రదాయాలలో బోధనాపరమైన, పరిశోధనాపరమైన సదుపాయాలు కల్పించడం ద్వారా అధునాతన విజ్ఞానాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. ఇతర కేంద్ర విశ్వవిద్యాలయాల వలెనే ఇది కూడా సంపూర్ణమైన విద్యను అందించడంతోపాటు ఇతర కార్యకలాపాలను కూడా నిర్వహిస్తుందని తెలిపారు. 

ఈ వర్సిటీ ఏర్పాటుకు గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014 సెక్షన్‌ 94, షెడ్యూల్‌ 13(3) ప్రకారం ఈ యూనివర్సిటీని నెలకొల్పనున్నారు. ఈ యూనివర్సిటీ కోసం ములుగు సమీపంలో 200 ఎకరాల స్థలాన్ని బీఆర్‌ఎస్‌ సర్కారు గతంలోనే గుర్తించింది. 

కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు సైతం ఈ స్థలాన్ని పరిశీలించి, యూనివర్సిటీ ఏర్పాటుకు అనుకూలమని తేల్చారు. లోక్‌సభ ఆమోదించిన బిల్లును రాజ్యసభ కూడా ఆమోదించిన తరువాత రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్నారు. ములుగులో ఏర్పాటు చేయనున్న సమ్మక-సారక ట్రైబల్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు లోక్‌సభ ఆమోదం తెలుపడం పట్ల మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.