భారీ వర్షాలు తగ్గినా ఇంకా జలదిగ్బంధంలో చెన్నై

మిచౌంగ్‌ తుఫాను తీరం దాటి 36 గంటలు గడిచినా ఉత్తర చెన్నై, శివారు ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో పాటు విద్యుత్‌ సరఫరా లేక అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నాయి. దీంతో తమ ప్రాంతాల్లోని నీరు తగ్గినా విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించలేదని బాధిత ప్రాంతాల ప్రజలు రాత్రి వేళ విద్యుత్‌ కార్యాలయాలు, రోడ్లపై బైఠాయిస్తున్నారు.  
 
తుఫాను ధాటికి అతలాకుతలమైన నగరంలో ఇంకా 1.50 లక్షల గృహాలు నీటిలోనే తేలియాడుతున్నాయి.  ఈ గృహాల్లో నివసించే ప్రజలు కోటి మందికిపైగా వరద బాధితులుగా మిగిలిపోయారు. వీరి చుట్టూ మోకాలిలోతు నీరు ఉన్నప్పటికీ తాగేందుకు గుక్కెడు నీరు అందడం లేదు.  మరోవైపు నగరంలో పాల ప్యాకెట్ల సరఫరాలో అంతరాయం ఏర్పడింది. నిత్యావసర సరుకుల కోసం వెంపర్లాడుతున్నారు.
ప్రస్తుతం 2015లో సంభవించిన వర్ధా తుఫాను కంటే అధిక నష్టం చేకూరిందని నగరవాసులు చెబుతున్నారు. కేవలం ప్రాణనష్టం మాత్రమే తక్కువగా ఉందని, మిగిలిన అన్ని విషయాల్లో నష్టం అంచనాలకు మించి ఉందంటున్నారు.  శివార్లలో నీరు మాత్రం ఒక్క అంగుళం కూడా తగ్గలేదు. గత ఆదివారం సాయంత్రం నుంచి తుఫాను ముందస్తు చర్యల్లో భాగంగా నగరం, శివారు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు.
తుఫాను ప్రభావంతో పలు ప్రాంతాల్లో ఇళ్లలో నీరు చేరడంతో రెండు రోజులుగా ప్రజలు బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. భారీగా పోటెత్తిన వరద నీటితో చెన్నైలోని పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఇంకా వరద పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వరద బాధిత ప్రాంతాల్లో నీటిని తొలగించిన తరువాతే విద్యుత్‌ సరఫరా పునరుద్ధరిస్తున్నామని చెబుతున్నారు. 
 
వరద ప్రాంతాలను పరిశీలించేందకు వెళ్లిన మంత్రులకు ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. తమ ప్రాంతాల్లో నీరు తొలగించలేదని, విద్యుత్‌ సరఫరా పునురుద్ధరించలేదంటూ తండయార్‌పేట మండల కార్యాలయం ఎదుట బుధవారం ప్రజలు ఆందోళన చేపట్టారు. వారితో మాట్లాడేందుకు వెళ్లిన దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబును ప్రజలు చుట్టుముట్టారు. ఆయనతో వాగ్వాదానికి దిగారు.
 
వరద బాధిత ప్రాంతాల్లో సోమవారం ఉదయం నుంచి బుధవారం వరకు పాలు, మంచినీటి సరఫరా స్తంభించింది. జనావాస ప్రాంతాల్లో నాలుగు నుంచి అడుగుల మేరకు నీరు పారుతోంది. ఈ ప్రాంతాల్లో ఉండే చిరు వ్యాపారులు సైతం వరద బాధితులగా మారడంతో పాలతో పాటు ఇతర నిత్యావసరాల కొరత ఏర్పడింది. దీంతో కొన్నిచోట్ల లీటరు పాలు రూ.200కు విక్రయిస్తున్నారు. కొన్ని ప్రాంతాలకు మాత్రం పడవల్లో ద్వారా పాలు, వాటర్‌ బాటిళ్ళు, ఇతర నిత్యాసర సరకులను చేరవేస్తున్నారు. కానీ, ఇవి పూర్తి స్థాయిలో వరద బాధితుల అవసరాలను తీర్చలేకపోతున్నాయి.