ప్రముఖ రాజ్‌పుత్ నేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్యకు నిరసనగా బుధవారం ఆయన మద్దతుదారులు రాజస్థాన్ బంద్‌కు పిలుపునిచ్చారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా సుఖ్‌దేవ్ సింగ్ మద్దతుదారులు నిరసనలు చేపట్టారు. జైపూర్‌తో పాటు బుండి, అజ్మేర్, మధోపూర్, చిత్తోర్‌ఘఢ్ వంటి జిల్లాలోనూ కార్యాలయాలు, పాఠశాలలు, దుకాణాలు మూసివేశారు.
జైపూర్‌లోని ఖాతిపురా రహదారిని ఆందోళనకారులు దిగ్భంధించారు. సుఖదేవ్ సింగ్ గోగమేది మృత దేహాన్ని ఉంచిన మెట్రో మాస్ ఆసుపత్రి వద్ద భారీ సంఖ్యలో కర్ణిసేన మద్దతుదారులు మోహరించారు. గోగమేది హత్యకు రాష్ట్ర పోలీసులదే బాధ్యత అని రాజ్‌పుత్ కర్ణిసేన జాతీయ అధ్యక్షులు మహిపాల్ సింగ్ మక్రాన్ ఆరోపించారు.
‘గోగమేది హత్య గురించి పంజాబ్ పోలీసుల నుంచి ఇంటెలిజెన్స్ నివేదిక వచ్చింది. కానీ రాజస్థాన్ పోలీసులు ఆయనకు భద్రత కల్పించ లేదు. ఇది పోలీసుల వైఫల్యం’ అని మక్రాన్ స్పష్టం చేశారు. డిజిని తొలగించి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితులను పట్టుకోకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలను చేస్తామని హెచ్చరించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉషా శర్మతో గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా సమావేశం జరిపారు. సుఖ్‌దేవ్ సింగ్ గొగమేది హత్యపై విచారణ కోసం ఎడిజి (క్రైమ్) దినేష్ ఎంఎన్ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేశారు. హత్య కేసులో నిందితుల గురించి సమాచారం ఇస్తే రూ. 5 లక్షల నగదు బహుమతి కూడా ప్రకటించారు.
కాగా, ఈ ఘటనలో ఇద్దరు పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. హత్యకు సంబంధించిన విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో శ్యామ్ నగర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్, బీట్ కానిస్టేబుల్‌పై బుధవారం జైపూర్ పోలీస్ కమిషనర్ సస్పెన్షన్ విధించారు. గోగమేడి హత్య నేపథ్యంలో చేపట్టిన నిరసనలు తగ్గిపోయాయని, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని ఓ అధికారి తెలిపారు. ఇక హత్యకు దారితీసిన ఘటన మొత్తం క్రమాన్ని హైకోర్టు రిటైర్డ్ జడ్జి దర్యాప్తు చేస్తారని అధికారులు ప్రకటించారు.
నిందితులను గుర్తించామని, వారి కోసం గాలిస్తున్నామని జైపూర్ పోలీస్ కమిషనర్ బిజు జార్జ్ జోసెఫ్ మీడియాకు తెలిపారు. నిందితుల్లో ఒకరు హర్యానాకు, మరొకరు రాజస్థాన్‌కు చెందిన వారిని చెప్పారు. గోగమేడి అంత్యక్రియల రోజున గురువారం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జైపూర్‌తో పాటు రాజస్థాన్‌లోని ఇతర ప్రాంతాల్లో కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించారు. నగరంలోని కొన్ని సున్నితమైన ప్రదేశాలలో సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందిని మోహరించారు.
More Stories
జమిలీ ఎన్నికలపై 31న జేపీసీ రెండో సమావేశం
బిజెపి ఎంపీలపై క్రిమినల్ కేసు కొట్టివేత
8 రోజుల్లో 9 కోట్ల మంది పుణ్యస్నానాలు