అమరావతి రైతులకు హైకోర్టులో ఊరట

ఏపీ హైకోర్టులో అమరావతి రైతులకు ఊరట లభించింది. కౌలు చెల్లించాలని రైతు పరిరక్షణ సమితి, రైతు సమాఖ్య తరపున వేసిన పిటేషన్లకు విచారణ అర్హత ఉందని గురువారం హైకోర్టు తీర్పును వెల్లడించింది. ఈ పిటీషన్‌లకు విచారణ అర్హత లేదని ప్రభుత్వ న్యాయవాదుల అభ్యంతరం వ్యక్తం చేయగా, ప్రభుత్వానికి చుక్కెదురైంది.
 
 ప్రభుత్వ వాదనలపై రైతుల తరపు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ రావు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం ఈ మేరకు న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. రైతులకు కౌలు చెల్లించాలని వేసిన పిటీషన్‌లకు విచారణ అర్హత ఉందని కోర్టు తెలిపింది. రెండు సంఘాల్లోని రైతులందరూ కోర్టు ఫీజ్ చెల్లించాలని ఆదేశించింది.. 10 రోజుల్లో కోర్టు ఫీజ్ చెల్లించిన తరువాత విచారణ చేస్తామంది హైకోర్టు.
 
మరోవైపు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించేందుకు జారీ చేసిన జీవోని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పైనా కోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు సింగిల్‌ జడ్జి దగ్గరకు విచారణకు రావడంపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్‌ అభ్యంతరం తెలిపారు. హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం లేదా డివిజన్‌ బెంచ్‌ ముందుకు వ్యాజ్యం విచారణకు రావాల్సి ఉందని వాదనలు వినిపించారు. పిటిషనర్ల్లు ఫోరంషాపింగ్‌కు పాల్పడుతూ నచ్చిన బెంచ్‌ను ఎన్నుకున్నారన్నారు. 
 
మరోవంక, సీఎం క్యాంపు కార్యాలయ వ్యవహరంపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం గతంలో విచారణ జరిపిన సంగతి పిటిషనర్లకు తెలుసన్నారు. మొదటి పిటిషనర్‌ గతంలో రెండు పిల్‌లు దాఖలు చేశారని గుర్తుచేశారు. సింగిల్‌ జడ్జి వద్దకు కేసు విచారణకు వచ్చేలా వ్యాజ్యంలో వివరాలను పేర్కొన్నారన్నారు. పూర్తిస్థాయి వాదనలు వినిపించేందుకు సమయం లేకపోవడంతో విచారణను శుక్రవారానికి వాయిదా వేయాలని కోరారు.
దీంతో న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు విచారణను వాయిదా వేశారు. సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు పేరుతో విశాఖలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించడాన్ని సవాల్ చేశారు.  అమరావతి పరిరక్షణ సమితి మేనేజింగ్‌ ట్రస్టీ గద్దె తిరుపతిరావు, రాజధాని ప్రాంత రైతులు మాదాల శ్రీనివాసరావు, వలపర్ల మనోహరం హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
విశాఖలో కార్యాలయాల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను గుర్తిస్తూ ఐఏఎస్‌ల కమిటీ చేసిన సిఫారసులకు అనుగుణంగా జారీచేసిన జీవో 2283ని రద్దు చేయాలని కోరారు. ఏపీ రాజధాని అమరావతే అంటూ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తూ అమరావతిలోని సచివాలయం నుంచి కార్యాలయాలను తరలిస్తున్నారని తెలిపారు. విచారణ జరిపి జీవోను నిలిపివేయాలని హైకోర్టును రైతులు కోరారు.