ప్రజాదరణ కోల్పోయి బందిపోటు చర్యలకు మావోయిస్టులు

తెలంగాణ ప్రాంతాల్లో ప్రజాధరణ లేక ఉనికిని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న నిషేధిత మావోయిస్టులు పనీపాటా లేని కొంతమంది లంపేన్ యువకులను ఆర్.పి.సి కమిటీల పేర్లతో నియమించి, పోలీస్ ఇన్ ఫార్మర్ల  నెపంతో చిరు వ్యాపారులపై దారిదోపిడి చర్యలకు పాల్పడుతున్నారు.  సిపిఐ తెలంగాణ మావోయిస్టు పార్టీ విచక్షణ కోల్పోయి తెలంగాణ- చత్తీస్గడ్ సరిహద్దు ఆదివాసి ప్రాంతంలో చిరువ్యాపారులను దారిదోపిడి చేస్తూ, అమాయక ప్రజల వాహనాలను తగలబెట్టడం, ఎత్తుకెళ్లడం వంటి చర్యలతో బందిపోట్ల లాగా వ్యవహరిస్తున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్, టి.సాయి మనోహర్ ధ్వజమెత్తారు. 

గత సంవత్సరం చర్ల మండలం తిప్పాపురం ప్రాంతంలో ఆదివాసీల పోడు భూముల్లో మొట్లు తీయడానికి ఆదివాసీలు మాట్లాడుకుని చర్ల నుండి తీసుకెళ్లిన ఒక జెసిబి వాహనాన్ని ఫారెస్ట్ అధికారులు ఆ జెసిబి యజమానిని బెదిరించి తీసుకెళ్లగా నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ సభ్యులు ఆ జెసిబి డ్రైవర్ ని తుపాకులతో చంపుతామని బెదిరించి జెసిబి ని అపహరించారని తెలిపారు. 

అల్లుడు, కొడుకు ఇద్దరూ చనిపోయి కూతురు, కోడలు, మనుమరాళ్లను పోషిస్తూ షుగరు వ్యాధికి గురై మంచానికి పరిమితమైన ఆ జెసిబి ఓనర్ ఎన్నిసార్లు మావోయిస్టు పార్టీని సంప్రదించినా జెసిబిని వదిలిపెట్టకుండా బెదిరించి పంపుతున్నారని తెలిపారు.   వారం రోజుల క్రితం చర్ల మండలం పూసుకుప్ప గ్రామానికి చెందిన ఆదివాసీ రైతుల ధాన్యం బస్తాలను మార్కెట్కు తరలించడానికి వెళ్లిన ఒక లారీని మావోయిస్టు పార్టీ సభ్యులు పూసుకుప్ప అటవీ ప్రాంతంలో దారి కాచి అడ్డగించి దాన్యం బస్తాలను దించి లారీని తగలబెట్టారని చెప్పారు.

అదేవిధంగా గత కొంతకాలంగా చర్ల, దుమ్ముగూడెం,భద్రాచలం, సమీప చత్తీస్గడ్ గ్రామాల నుండి వారాంతపు సంతలకు వెళ్లే చిరు వ్యాపారులను నిర్బంధించి, వారిని చితకబాదుతూ వారి దగ్గర ఉన్న సరుకులను మావోయిస్టులు దోచుకోవడం, చిరు వ్యాపారులమని, ఆదివాసీలమని బ్రతిమాలిన వినకుండా పోలీస్ ఇన్ ఫార్మర్లనే నెపంవేసి హతమారుస్తామని బెదిరించి వారి దగ్గర ఉన్న నిత్యవసరాలను సరుకులను దోపిడీ  చేస్తున్నారని వివరించారు.

జల్, జంగిల్, జమీన్ కోసం ఆదీవాసి ప్రజల తరపున పోరాడుతున్నామని మాయమాటలు చెబుతూ, తమ స్వప్రయోజనాల కోసం ఆదీవాసిలపైనే
భౌతిక, మానసిక దాడులకు పాల్పడుతూ జీవనోపాధిని దూరం చేస్తున్న మావోయిస్టులను తమ గ్రామాల్లోకి రానివ్వకుండా, అడవుల్లో తిరగకుండా బహిష్కరించాలని ఆదీవాసి ప్రజలకు సాయి మనోహర్ విజ్ఞప్తి చేశారు. 

అదేవిధంగా  ఆదివాసీల పట్ల మావోయిస్టులు అనుసరిస్తున్న భౌతిక, మానసిక దాడులను పట్ల, దారి దోపిడీ, బందిపోటు ఉన్మాద చర్యల పట్ల ఆదివాసీ సంఘాల నాయకులు, పౌర సంఘాలు, ప్రజా ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు తమ వైఖరిని తెలియజేస్తూ ఖండించాలని ఆయన కోరారు.