బాన్సువాడ బీజేపీ అభ్యర్థి ఇంటిపై దాడి

కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజ‌క‌వ‌ర్గం బీజేపీ అభ్యర్థి, మాజీ ఎమ్యెల్యే యెండ‌ల ల‌క్ష్మీనారాయ‌ణ ఇంటిపై మంగ‌ళ‌వారం అర్ధరాత్రి గుర్తు తెలియ‌ని దుండ‌గులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ల‌క్ష్మీనారాయ‌ణ డ్రైవ‌ర్‌తో పాటు వ్యక్తిగ‌త స‌హాయ‌కుడు గాయాల‌పాల‌య్యారు.  అయితే ఓట‌మి భ‌యంతో బిఆర్ఎస్ అభ్యర్థి పోచారం భాస్కర్‌రెడ్డి దాడుల‌కు తెగ‌బ‌డుతున్నాడ‌ని  ల‌క్ష్మీనారాయ‌ణ ఆరోపించారు.
ఈ విష‌యంపై పోలీసుల‌తో తీవ్ర వాగ్వాదం జ‌రిగింది. స్థానిక పోలీసులు అధికార పార్టీ క‌నుస‌న్నల్లో ప‌ని చేస్తున్నార‌ని, అభ్యర్థికి సైతం ర‌క్షణ ఇవ్వడం లేద‌ని ఆరోపించారు. దాడి చేయడం పట్ల నిరసన తెలియజేస్తూ దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ  డీఎస్పీ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.

బాన్సువాడ‌లో దాడులు చేస్తూ భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తున్నార‌ని, ఓటు ద్వారా పోచారం కుటుంబానికి గుణ‌పాఠం చెప్పాల‌ని యెండ‌ల ల‌క్ష్మీనారాయ‌ణ సూచించారు. దాడికి సంబంధించిన ఘ‌ట‌న సీసీటీవీలో రికార్డు అయ్యింది.  బాన్సువాడ క్యాంపు కార్యాలయంలో నిద్రిస్తున్న బీజేపీ అభ్యర్థి  లక్ష్మీనారాయణతో పాటు బీజేపీ కార్యకర్తలపై బీఆర్ఎస్ గుండాలు దాడి చేయడాన్ని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.  కార్యాలయాన్ని విధ్వంసం చేయడంతోపాటుగా లక్ష్మీనారాయణ గారి డ్రైవర్‌పై భౌతికదాడులకు దిగడం హేయనీయమని మండిపడ్డారు.

సంఘ విద్రోహశక్తులకు వ్యతిరేకంగా పోరాడే చరిత్ర కలిగిన బిజెపి బిఆర్ఎస్ గుండాల దాడులకు భయపడదని ఆయన స్పష్టం చేశారు. వైఫల్యాలతో జనం తిరగబడుతుంటే  వారి సమస్యలను పరిష్కరించకుండా బీజేపీపై దాడులకు పాల్పడడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతామని భయంతోనే బీఆర్ఎస్ నాయకులు భౌతిక దాడులకు దిగుతున్నారని దుయ్యబట్టారు.

కేసీఆర్ కు దమ్ము, ధైర్యం ఉంటే ప్రజా క్షేత్రంలో బీజేపిని నేరుగా ఎదుర్కోవాలి తప్ప ఇలాంటి దాడులు చేయించడం పిరికిపంద చర్య అంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి డైరెక్షన్ లోనే ఈ దాడులు జరుగుతున్నాయనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశాడు.  బాన్సువాడ నియోజకవర్గంలో గెలుపు బీజేపీదే అని తెలిసి బీఆర్ఎస్‌లో వణుకు మొదలైందని తెలిపారు.