ముగ్గురు పోలీసు అధికారులపై ఈసీ సస్పెన్షన్ వేటు

* బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ బదిలీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. మరికొన్ని గంటల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానున్న వేళ ఇసి కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎన్నికల విధుల నుండి పలువురు అధికారులను తప్పించిన ఇసి తాజాగా ముగ్గురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది.
 
ముషీరాబాద్ పరిధిలో నగదు స్వాధీనం విషయంలో బీఆర్ఎస్ అభ్యర్థి కుమారుడిపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం వహించారని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఈసీ సెంట్రల్ జోన్ డిసిపి వెంకటేశ్వర్లు, చిక్కడపల్లి ఎసిపి యాదగిరి, ముషీరాబాద్ ఎసిపి జహంగీర్‌లను ఇసి సస్పెండ్ చేసింది.  ఈ ముగ్గురు పోలీసు అధికారులపై.. శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్ శాంతి కుమారికి ఈసీ లేఖ రాసింది.
 
ఆ ముగ్గురు పోలీసు అధికారులపై హైదరాబాద్ నగర కమిషనర్ సందీప్ శాండిల్యా సస్పెన్షన్ వేటు వేశారు. ముషీరాబాద్‌లో బిఆర్‌ఎస్ అభ్యర్థి డబ్బులు పంచుతుంటే చర్యలు తీసుకోలేదని అభియోగాలున్నాయి. ముషీరాబాద్ పరిధిలో నగదును స్వాధీనం చేసుకున్న వ్యవహారంలో పక్షపాతం చూపించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎన్నికల సంఘం రాసిన లేఖలో పేర్కొంది.
 
ఎన్నికల తనిఖీల్లో భాగంగా ముషీరాబాద్‌లోని సంతోష్‌ ఎలైట్‌ అపార్ట్‌మెంట్‌లో సుమారు రూ.18 లక్షల నగదు, చెక్‌బుక్‌, 2 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నగదు ముషీరాబాద్‌ బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్‌ కుమారుడు ముఠా జై సింహకు చెందినదిగా పోలీసులు గుర్తించగా ఎఫ్‌ఐఆర్‌లో మాత్రం నిందితుల వివరాలు గుర్తుతెలియనివారిగా పేర్కొనటం గమనార్హం. ఈ కేసులో ముఠా జై సింహను కాకుండా ముఠా గోపాల్‌ స్నేహితులు సంతోష్‌, సుధాకర్‌ను అరెస్టు చేశారు. నిందితులను వదిలిపెట్టారని, సరైన సెక్షన్లు పెట్టలేదని ఈసీ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
 
మరోవంక, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ కె.సమ్మయ్యపై వేటుపడింది. ఎన్నికల నిబంధనలను ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించినందుకు మున్సిపల్ కమిషనర్‌ను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి బాదావత్ సంతోష్ ఆదేశాలు ఇచ్చారు. ఈ నెల 8న బెల్లంపల్లిలో జరిగిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య ఏర్పాట్లు చేశారు. 
 
దీనిపై అందిన ఫిర్యాదుతో ఉన్నతాధికారులు స్పందించారు. ఆయనపై జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి చర్యలు తీసుకున్నారు. వెంటనే మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యను బెల్లంపల్లి నుంచి బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. హైదరాబాద్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్ కమిషనర్ గా రెవెన్యూ అధికారి భుజంగంకు అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.