ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేద్దాం

* భాగ్యలక్ష్మి అమ్మవారికి కిషన్​ రెడ్డి ప్రత్యేక పూజలు

తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్​ రెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన హైదరాబాద్​లోని చార్మినార్​  వద్దనున్న భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

తెలంగాణ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని, సమగ్ర మార్పు కోసం ఆలోచించాలని, ఎలాంటి ప్రలోభాలు, డబ్బు, మద్యానికి లొంగకుండా రాజ్యాంగం కల్పించిన హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు.  దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

అన్ని వర్గాల ప్రజలు ఓటింగ్‌లోపాల్గొనాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలపై భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, తెలంగాణ రాష్ట్రం అవినీతి రహిత, ప్రజాస్వామ్యయుత రాష్ట్రంగా వెల్లివిరియాలని అమ్మవారిని కోరుకున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు.

ఉత్తరాఖండ్‌ సొరంగంలో 17రోజులుగా చిక్కుకున్న కార్మికులు సురక్షితంగా బయట పడటంపై హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రజలంతా ఉత్కంఠతో ఎదురు చూస్తున్న41మంది కార్మికులు ఉత్తరాఖండ్‌లో ఎలాంటి ప్రాణహాని లేకుండా భగవంతుడి ఆశీస్సులతో సురక్షితంగా బయటకు రావడం గొప్ప విషయం అని పేర్కొన్నారు. 

కార్మికులకు సొరంగంలో ఉన్నా ఆరోగ్యంగా, ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో బయటకు వచ్చే శక్తినిచ్చిన భగవంతుడికి కృతజ్ఞతలు తెలిపినట్టు చెప్పారు. కార్మికులు సురక్షితంగా బయటకు రావాడానికి కేంద్ర ప్రభుత్వ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ ఏజెన్సీలు విశేష కృషి చేశాయని కొనియాడారు. ప్రధాని, ఉత్తరాంచల్ నాయకత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ కార్మికుల్ని బయటకు తెచ్చారని తెలిపారు.

 ‘‘దేశ ప్రజలు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నటువంటి 41 మంది కార్మికులు సొరంగం నుంచి 17 రోజుల తర్వాత సురక్షితంగా బయటకు వచ్చారు. ఇది నిజంగా గొప్ప విషయం. వాళ్లు, ధైర్యంగా బయటకు వచ్చినందుకు అమ్మవారికి ఈరోజు ప్రార్థనలు చేశాను. కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చర్చలు జరిపి కార్మికులను బయటకు తీసుకురావడం గొప్ప విషయం” అని ఆయన పేర్కొన్నారు.
 
గురువారం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయని, నాలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఎన్నికలు పూర్తయ్యాయని, చివరగా జరుగుతున్న తెలంగాణ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని కిషన్ రెడ్డి కోరారు. రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజల మీద భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు చెప్పారు.