కౌశిక్ రెడ్డి వాఖ్యలలపై విచారణకు ఈసీ ఆదేశం

సెంటిమెంట్‌ను ప్రచారాస్త్రంగా వాడుకొనేందుకు ప్రయత్నించిన హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగుతున్న పాడి కౌశిక్ రెడ్డి వాఖ్యలపై ఎన్నికల కమిషన్  సీరియస్ అయింది. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించింది. ప్రచారం చివరి రోజు గురువారం తన భార్య, కూతురుతో కలిసి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఓ చోట నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన చేసిన వాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తనను గెలిపించకపోతే చచ్చిపోతానంటూ బెదిరించారు.
 
‘మీకు దండం పెడతా.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. నాకు ఓటేసి నన్ను గెలిపించండి.. నేను చేయాల్సిన ప్రచారం చేసిన.. ఇక నన్ను సాదుకుంటరో, సంపుకుంటరో మీ ఇష్టం.. నన్ను, నా భార్య, నా బిడ్డను సాదుకుంటారో.. ఓడించి ఉరేసుకొమ్మంటారో మీ చేతుల్లోనే ఉంది. ఓట్లేసి గెలిపిస్తే డిసెంబర్ 3న విజయ యాత్రకు నేను వస్తా.. లేకపోతే డిసెంబర్ నాలుగో తారీఖు నాడు నా శవయాత్రకు మీరు రండి.” అంటూ కౌశిక్ రెడ్డి సంచలన వాఖ్యలు చేశారు. 
 
కౌశిక్ రెడ్డి చేసిన ఈ భావోద్వేగ వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హుజూరాబాద్‌ ఎన్నికల అధికారులను ఈసీ ఆదేశించింది. భావోద్వేగ వ్యాఖ్యల నేపథ్యంలో ఈసీ నివేదిక కోరింది. మరోవంక, కమలాపూర్ పోలీస్ స్టేషన్ లో బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి పై కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారనే ఎంపిడీవో ఫిర్యాదుతో పిఎస్ లో కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న కౌశిక్ రెడ్డి ఈసారి అసెంబ్లీ బరిలో నిలిచారు. అక్కడ బీజేపీ తరపున పోటీ చేస్తున్న ఈటల రాజేందర్‌తో ఆయన పోటీపడుతున్నారు. కౌశిక్ రెడ్డి తరపున ఆయన కూతురు శ్రీనిక కూడా ఈసారి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.