ఉత్తరాఖండ్‌ సొరంగంపై 42 మీటర్ల డ్రిల్లింగ్‌

ఓవైపు సొరంగంపైన ఉన్న కొండను తొలుస్తూ.. మరోవైపు సొరంగం లోపల ఉన్న శిథిలాల తొలగింపు ముమ్మరం చేస్తూ.. ఇంకోవైపు నుంచి కూడా తవ్వకం చేపడుతూ కూలీలను బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. టన్నెల్‌లో చిక్కుకున్న 41 మంది స్థైర్యం సడలకుండా ధైర్యం చెబుతున్నారు. మరో రెండు రోజులలో, గురువారం నాటికి ఈ ప్రయత్నం సఫలం కాగలదని భావిస్తున్నారు.

ఉత్తరాఖండ్‌ రాష్ట్రం ఉత్తర కాశీ జిల్లా సిల్క్యారా వద్ద సొరంగంపైన ఉన్న కొండపై టన్నెల్ పై నుంచి జరుపుతున్న వర్టికల్ డ్రిల్లింగ్ మంగళవారం ఉదయం నాటికి 42 మీటర్లు పూర్తైంది. మొత్తం 82 మీటర్ల లోతు వరకు తవ్వాల్సి ఉంది. కూలీలను బయటకు తెచ్చేందుకు 1.2 మీటర్ల వ్యాసం ఉన్న పైప్‌లను నిలువునా వేయాల్సి ఉంటుంది.  సైన్యంలో ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌గా పని చేసిన లెఫ్టినెంట్‌ జనరల్‌ హర్పాల్‌ సింగ్‌ ఈ రెస్య్కూ ఆపరేషన్‌లో పాల్పంచుకుంటున్నారు.

కొండపైన నేల స్వభావం, ఏమైనా అడ్డంకులు ఉన్నాయా? లేదా? అని తెలుసుకునేందుకు 200 మిల్లీ మీటర్ల వ్యాసం ఉన్న పైప్‌లను 70 మీటర్ల మేర పంపి పరిశీలించినట్లు చెప్పారు. సొరంగం లోపల ఉన్న శిథిలాలను తొలగించేందుకు 12 మంది ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌ను రంగంలోకి దింపారు. 800 మిల్లీమీటర్ల పైప్‌ల ఫ్రేమ్స్‌ను సిద్ధం చేశామని.. వీటిని అరమీటరు మీటరు మేర చొప్పిస్తూ వెళ్తామని, అడ్డంకులు లేకుంటే మిగిలిన 10 మీటర్ల శిథిలాల తొలగింపును 24 నుంచి 36 గంటల్లో పూర్తిచేస్తామని హర్పాల్‌ వివరించారు. 

ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా, హెం సెక్రటరీ అజయ్ భల్లా, ఉత్తరాఖండ్ చీఫ్ సెక్రటరీ ఎస్‌ఎస్ సంధు సోమవారం సొరంగం వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ క్రమంలో సొరంగంలో చిక్కుకున్న కార్మికులతో మిశ్రా మాట్లాడారు. వారిని రక్షించడానికి బహుళ ఏజేన్సీలు పని చేస్తున్నాయని, ధైర్యంగా ఉండాలని సూచించారు.

ర్యాట్‌ హోల్‌ మైనింగ్‌ బృందం సోమవారం రాత్రి నుంచి డ్రిల్లింగ్‌ మొదలుపెట్టింది. వీరు 800 మిల్లీమీటర్ల పైప్‌లో ఒకరి తర్వాత ఒకరు వెళ్లి గడ్డపారలతో శిథిలాలను తొలగించి చక్రాల వాహనాల్లో బయటకు పంపుతారు.మరోవైపు హైదరాబాద్‌ నుంచి వెళ్లిన ప్లాస్మా కట్టర్‌ 46 మీటర్ల మేర శిథిలాల్లోని ఆగర్‌ యంత్రం బ్లేడ్లను తొలగించింది. 

దెబ్బతిన్న మీటరున్నర పైప్‌నూ తీసివేశారు. ప్రధాని మోదీ ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా టన్నెల్‌ వద్దకు వచ్చి సమీక్షించారు. లోపల ఉన్న కూలీలతో మిశ్రా మాట్లాడి ధైర్యం చెప్పారు. టన్నెల్‌పై నుంచి 300 మీటర్లు ఎత్తుకు వెళ్లి నిలువునా 86 మీటర్ల మేర డ్రిల్లింగ్‌ చేస్తున్నారు. 

అయితే, టన్నెల్‌ పైభాగం ఎదురైనప్పుడు కార్మికులు గాయపడకుండా ఏం చేయాలనేది పెద్ద సమస్యగా మారింది. అడ్డంగా తవ్వుకుంటూ వెళ్తున్న బృందంతో దీనిపై సమన్వయం చేసుకోనున్నారు. కాగా,బార్‌కోట్‌ నుంచి 480 మీటర్ల తవ్వకం సుదీర్ఘ సమయం పట్టనుంది. ఇప్పటికి 10 మీటర్లే తవ్వారు. 

టన్నెల్‌కు ఎడమ వైపున లంబకోణంలో 180 మీటర్ల పొడవునా చిన్న టన్నెల్‌ నిర్మాణం ఆలోచన కూడా చేస్తున్నారు. మంగళవారం నుంచి మొదలయ్యే దీని నిర్మాణానికి 10-15 రోజులు పడుతుంది. కాగా, సిల్క్యారా టన్నెల్‌ నిర్మాణంలో తమకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కానీ ఎలాంటి ప్రమేయమూ లేదని అదానీ గ్రూప్‌ తెలిపింది.