కేసీఆర్ కారును గ్యారేజీకి పంపే సమయం

తెలంగాణలో రాష్ట్రంలో కేసీఆర్ కారును గ్యారేజీకి పంపించే సమయం ఆసన్నమైందని బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీతో కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాడని, కాంగ్రెస్ కు ఓటు వేస్తే కేసీఆర్ కు వేసినట్లేనని  ఆయన హెచ్చరించారు. 
 
సోమవారం తెలంగాణాలో ఎన్నికల ప్రచారసభలలో పాల్గొంటూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొని మాట్లాడారు. బీజేపీని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే సింగరేణి బొగ్గు గని కార్మికులకు ఆధాయ పన్నును రద్దు చేస్తామని, ఒక్క రూపాయి కూడా చెల్లించే అవసరం లేదని హామీ ఇచ్చారు. 
 
కాంగ్రెస్ పార్టీ గుర్తుపై 2014, 2018లో గెలిచిన ఎమ్మెల్యేలంతా కేసీఆర్ కు అమ్ముడు పోయారని గుర్తు చేస్తూ కాంగ్రెస్ ను గెలిపిస్తే మళ్లీ అమ్ముడు పోతారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని వారు ఊహించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 
 
అయితే, కేసీఆర్ సర్కార్ వచ్చేది లేదు, రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేది లేదని చెబుతూ మూడవ సారి కూడా మోదీ ప్రధానమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.  ఓవైసీకి భయపడి సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని ధ్వజమెత్తారు.  బీజేపికి ఓటు వేసి గెలిపిస్తే అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని అమిత్ షా ప్రకటించారు. 
 
 కేసీఆర్, కాంగ్రెస్ పార్టీలు ఓవైసీకి భయపడుతాయని, అయితే భారతీయ జనతా పార్టీ భయపడదని, మతపరంగా ముస్లింలకు ఇచ్చిన 4శాతం రిజర్వేషన్ ను రద్దు చేసి బీసీలకు కేటాయిస్తామని స్పష్టం చేశారు. మాదిగ సమాజం ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని చెప్పారు. వారికిచ్చిన హామీని నెరవేరువస్తామని, అదేవిధంగా బీసీ అభ్యర్థినే ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చారు.