తెలంగాణలో కర్ణాటక సర్కారు ప్రకటనలపై ఈసీ ఆగ్రహం

తెలంగాణ ఎన్నికల్లో ఇష్టానుసారంగా ప్రకటనలు ఇస్తున్న కర్నాటక ప్రభుత్వంపై ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలో కర్నాటక ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడంపై తీవ్రంగా పరిగణించింది. ఎన్నికల సంఘం అనుమతి లేకుండా ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చినందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. 
 
ఈ మేరకు  సోమవారం కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది.  తెలంగాణలో కర్ణాటక ప్రభుత్వ ప్రకటనలు విడుదల చేయడం ఎన్నికల నియమావళి ఉల్లంఘన అవుతుందని కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. మంగళవారం సాయంత్రం 5 గంటల లోపు ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది.
 
ప్రకటనలు జారీ చేసిన కర్ణాటక సమాచార, పౌరసంబంధాల శాఖ ఇన్‌చార్జి కార్యదర్శిపై ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని తెలిపింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో కర్ణాటక ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడంపై ఎలక్షన్ కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు చేసింది. 
 
ఎన్నికలను ప్రభావితం చేసేలా, ఓటర్లను ప్రలోభ పెట్టేలా కర్ణాటక ప్రభుత్వ ప్రకటనలు ఉన్నాయని బీజేపీ ఆరోపించింది. దీనిపై స్పందించిన ఈసీ ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.  ఇటీవల తెలంగాణ పత్రికల్లో కర్ణాటక ప్రభుత్వం ఐదు నెలల్లో సాధించిన విజయాలు, ఎన్నికల హామీల అమలుపై ప్రకటనలు వెలువడటంతో బీజేపీ ఈసీకి పిర్యాదు చేసింది. 

కాంగ్రెస్‌ పార్టీ నవంబర్‌ 24 నుంచి 27 వరకు వరుసగా వివిధ పత్రికల్లో ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వ ప్రకటనలపై బీఆర్‌ఎస్‌, బీజేపీలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఈ ఫిర్యాదులపై ఎన్నికల సంఘం స్పందించింది. కర్ణాటక ప్రభుత్వ ప్రకటనలు ఎన్నికల నియామవళి ఉల్లంఘన కిందకి వస్తుందని స్పష్టం చేసింది.  అక్టోబరు 9న దీనికి సంబంధించిన ఆదేశాలను అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ ద్వారా చేరవేశామని పేర్కొంది.

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నంత వరకు తెలంగాణలో ప్రకటనలు జారీ చేయరాదని కర్ణాటక ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ప్రకటనల జారీ చేయడం కోసం కర్ణాటక ప్రభుత్వం ఈసీ అనుమతి తీసుకోలేదని స్పష్టం చేసింది. ఎన్నికలు లేని రాష్ట్రాలు ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ప్రకటనలు ఇవ్వాలని భావిస్తే తప్పనిసరిగా ఈసీ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసినట్లు ఈసీ పేర్కొంది.