
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమదే అంటూ కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఏకంగా 80కు పైగా సీట్లు తమ పార్టీకి వస్తాయంటూ పీసీసీ చీఫ్ రేవంత రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ గాలి వీస్తోందని.. ఇక తమకు ఎదురేలేదని ఆయన వాదిస్తున్నారు. కానీ, నిజంగానే కాంగ్రెస్ పార్టీకి అంత సీన్ ఉందా..? రేవంత్ రెడ్డి చెబుతున్నట్టు 80 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడతాయా..? అంటే.. గత ఎన్నికల గణాంకాలు కాదనే చెబుతున్నాయి. గడచిన 40 ఏళ్ళలో తెలంగాణ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ముచ్చటగా మూడోసారి జరుగుతున్న ఎన్నికలు ఇవి. గత రెండు సార్లు ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్ ఈ సారి ఎన్నికలకు కేవలం 4 నెలల ముందు అనూహ్యంగా రేస్‌లోకి వచ్చింది. అయితే.. ఆ పార్టీ నాయకులు చేస్తున్న ప్రకటనలు వాపును చూసి బలం అనుకునేలా ఉన్నాయనే అభిప్రాయాల్ని కలిగిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ అంతా పేలిపోయే గాలి బుడగ లాంటిదని.. నిజానికి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అంత సీన్ లేదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి చెబుతున్నట్టుగా తెలంగాణలో 80 సీట్లు సాధించే మాట అటుంచితే.. ఆ పార్టీ గాలి ఇంతకన్నా బాగా వీచిన రోజుల్లోనూ 60 సీట్లను ఏనాడు సాధించటలేదని ఎన్నికల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత 40 ఏళ్ళ ఎన్నికల ఫలితాల డేటాను విశ్లేషిస్తే ఈ విషయం స్పష్టంగా అర్ధం అవుతోంది.
1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత తెలంగాణ పరిధిలోని 119 సీట్లలో కాంగ్రెస్ పార్టీ కేవలం 30 సీట్లను మాత్రమే సాధించగలిగింది. 1989లో ఎన్టీఆర్ వేవ్ బాగా తగ్గి.. కాంగ్రెస్ గాలి వీచినప్పుడు కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 59 స్థానాలే వచ్చాయి. ఆనాటి ఎన్నికల్లో ఉమ్మడి ఏపీ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ 181 సీట్లను గెలుచుకుంది. తిరిగి 1994 లో ఉమ్మడి ఏపీలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మొత్తం మీద కేవలం 26 సీట్లే వచ్చాయి. 1999 ఎన్నికల్లో తెలంగాణలో 42 నియోజకవర్గాల్లోనే గెలుపొందింది.
2004, 2009 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2004 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు 185 సీట్లు రాగా, తెలంగాణలో కేవలం 48 సీట్లు మాత్రమే వచ్చాయి. అదేవిధంగా 2009లో ఉమ్మడి ఏపీలో 156 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందగా, తెలంగాణలో 49 స్థానాల్లో హస్తం పార్టీ గెలుపొందింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 21 సీట్లు మాత్రమే వచ్చాయి. 2018 ముందస్తు ఎన్నికల్లో 19 స్థానాల్లో గెలుపొందింది.
ఇలా గడచిన 40 సంవత్సరాల ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే తెలంగాణ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఏనాడూ 60 సీట్ల మార్కును అందుకోలేదు. కానీ.. ప్రస్తుతం ఆ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం 80 సీట్లు వచ్చేస్తాయని ఆర్భాటంగా ప్రకటనలు ఇస్తున్నారు. అయితే.. రేవంత్ రెడ్డి మాటలు అటుంచితే.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధారణ మెజార్టీకి అవసరమైన 60 సీట్లు తెచ్చుకున్నా చరిత్ర సృష్టించినట్టే అని రాజకీయ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. ఓ వైపు బీఆర్ఎస్, మరోవైపు భారతీయ జనతాపార్టీలు అత్యంత పటిష్టంగా ఎన్నికల బరిలో ఉన్న తరుణంలో.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రకటనలు ఉత్తర కుమారుని ప్రగల్భాలను తలపిస్తున్నాయనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
More Stories
హైదరాబాద్ శివాలయంలో మాంసపు ముద్దలు
బీజేపీలోకి ఇద్దరు కాంగ్రెస్ నేతలు ప్రవేశం
కుంభమేళాకు వెళ్లి వస్తుండగా 8 మంది తెలంగాణ వాసుల మృతి