రాజస్థాన్ పోలింగ్ లో ఇద్దరు మృతి.. 74.96 శాతం పోలింగ్

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా రాజస్తాన్ లో పలు చోట్లు హింసాత్మక ఘటనలు జరిగాయి. మొత్తం 199 స్థానాలకు శనివారం పోలింగ్ జరిగింది. అభ్యర్థి మరణించడంతో ఒక సీట్లో పోలింగ్ ను నిలిపివేశారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో గత ఎన్నికలతో పోలిస్తే స్వల్పంగా అధికంగా ఓటింగ్ శాతం నమోదు కావడం గమనార్హం.

ఈ ఎన్నికల్లో 74.96% పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు.  2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్ లో 74.06% పోలింగ్ నమోదైంది. ఈ సారి కనీసం 75% పోలింగ్ ను ఎన్నికల సంఘం లక్ష్యంగా పెట్టుకోగా దాదాపు చేరుకోగలిగింది. కాగా, కాంగ్రెస్ అభ్యర్థి మృతితో శ్రీగంగానగర్‌లోని కరణ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ వాయిదా పడింది.

రాజస్థాన్ ఎన్నికల పోలింగ్ రోజు గుండె పోటుతో ఇద్దరు వ్యక్తులు పోలింగ్ కేంద్రాల్లోనే మరణించారు. వారిలో ఒకరు ఒక అభ్యర్థి తరఫు పోలింగ్ ఏజెంట్ కాగా, మరొకరు వృద్ధుడైన ఓటరు అని అధికారులు తెలిపారు. కాగా, పోలింగ్ సందర్భంగా రాష్ట్రంలోని పలు చోట్ల స్వల్పంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. 

దీగ్ జిల్లాలోని సాల్వర్ గ్రామంలో ఇరు వర్గాల మధ్య జరిగిన రాళ్ల దాడిలో ఒక పోలీసు సహా నలుగురు గాయపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు గాల్లోకి 12 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటన కారణంగా ఓటింగ్‌కు కొన్ని నిమిషాల పాటు అంతరాయం ఏర్పడింది.

ఎన్నికల కమిషన్ ప్రకారం రాష్ట్ర మంత్రి షాలే మొహమ్మద్ బిజెపి అభ్యర్థి మహంత్ ప్రతాప్ పురిపై పోటీచేస్తున్న జైసల్మేర్ జిల్లాలోని పోకారన్ నియోజకవర్గంలో అత్యధికంగా 81.12 శాతం పోలింగ్ జరిగింది. ఆ తర్వాత అత్యధికంగా బిజెపి ఎంపీ మహంత్ బాలకనాథ్ పై  కాంగ్రెస్ అభ్యర్థిగా ఇమ్రాన్ ఖాన్ పోటీ చేస్తున్న ఆళ్వార్ లో 80.55 శాతం పోలింగ్ జరిగింది.
 
ఆ తర్వాత అత్యధికంగా కాంగ్రెస్ నుండి చేరి బిజెపి అభ్యర్థిగా గిరిరాజ్ సింగ్ మలింగా కాంగ్రెస్ అభ్యర్థి ప్రశాంత్ సింగ్ పార్మర్ పై పోటీచేస్తున్న ఢోల్పూర్ జిల్లాలోని బారిలో పోలింగ్ జరిగింది. ఇక ప్రతిపక్ష నేత, బిజెపి అభ్యర్థి రాజేంద్ర రాథోర్ కాంగ్రెస్ అభ్యర్థి నరేంద్ర బుధనియాపై పోటీచేస్తున్న తారనగర్ లో ఆ తర్వాత అత్యధికంగా 76.5 శాతం పోలింగ్ జరిగింది.  

రాజస్థాన్‌లోని 199 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 51,000 పోలింగ్ బూత్‌లలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. రాజస్తాన్ లో మొత్తం 5.25 కోట్ల మంది ఓటర్లున్నారు. కొత్తగా ఈసారి 22 లక్షల 61 వేల మందికి ఓటు హక్కు లభించింది. 3 లక్షల మంది ముందుగానే పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.