టిఎంసీ ఎంపీ మహువా మొయిత్రీపై సీబీఐ దర్యాప్తు

డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగారానే ఆరోపణలపై తృణమూల్ కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీ మహువా మెయిత్ర చట్టూ ఉచ్చు బిగుస్తోంది. లోక్‌పాల్ ఆదేశాలపై ఆమెపై సీబీఐ ప్రాథమిక దర్యాప్తు ను ప్రారంభించింది. దర్యాప్తు ఆధారంగా మొయిత్రపై క్రిమినల్ కేసు నమోదు చేయాలా వద్దా అనేది లోక్‌పాల్ నిర్ణయిస్తుంది.

ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, కేసులో నిందితుని (మొయిత్రీ) సీబీఐ అరెస్టు చేయడం కానీ, సోదాలు జరపడం కానీ చేయరాదు. సమాచారం అడగడం, డాక్యుమెంట్ల పరిశీలన, మెయిత్రీని ప్రశ్నించే అధికారం ఉంటుంది. లోక్‌పాల్ ఆదేశానుసారం దర్యాప్తు ప్రారంభించినందున ఇందుకు సంబంధించిన నివేదికను కూడా లోక్‌పాల్‌కు సీబీఐ సమర్పించాల్సి ఉంటుంది.

పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందాని నుంచి ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలపై సుప్రీంకోర్టు న్యాయవాది జై అనంత్ దేహాద్రయి సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఆయన బీజేపీ ఎంపీ నిషాకాంత్ దుబేకి కూడా ఫిర్యాదు చేయడంతో ఈ విషయాన్ని స్పీకర్ ఓం బిర్లా దృష్టికి తీసుకురావడం, ఆయన ఎథిక్స్ కమిటీకి అప్పగించడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నారు. దుబే సైతం లోక్‌పాల్‌కు ఈ విషయమై ఫిర్యాదు చేశారు.

మహువా మొయిత్ర తన ఈ-మెయిల్ ఐడీని షేర్ చేశారని, దీంతో హీరానందాని ఆమెకు సమాచారం పంపేవారని, వాటిని మొయిత్ర పార్లమెంటులో లేవనెత్తేవారని ప్యానల్‌కు సమర్పించిన ఒక అఫిడవిట్‌లో దూబే పేర్కొన్నారు. తన పార్లమెంటు లాగిన్, పాస్‌వర్డ్ ఇవ్వడం వల్ల హీరానందాని నేరుగా ఆమెకు తన ప్రశ్నలు పోస్ట్ చేసేవారని ప్యానల్ దృష్టికి తెచ్చారు. 

కాగా, చాలా మంది పార్లమెంటేరియన్ల తరహాలోనే తాను కూడా ఇ-మెయిల్ ఐడీని షేర్ చేశానని మహువా మొయిత్ర అంగీకరించినప్పటి, అయితే ఇందులో తన స్వప్రయోజనాలు ఏవీ లేవని చెబుతున్నారు. మరోవంక, లోక్ సభ ఎథిక్స్ కమిటీ కూడా ఈ ఆరోపణలపై దర్యాప్తి జరిపి స్పీకర్ కు తమ నివేదికను సమర్పించింది. 

అందులో ఆమె లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సిఫార్సు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ సందర్భంగా కమిటీ ఆమెను విచారణకు పిలవగా, ఆమె హాజరై మధ్యలో చైర్మన్ వేస్తున్న ప్రశ్నలపట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ భేటీని బహిష్కరించి వెళ్లిపోయారు.

తమ ఎంపీ మహువా మెయిత్రపై వచ్చిన ఈ ఆరోపణలపట్ల ఇప్పటివరకు మౌనంగా ఉంటూ వస్తున్న ఆ పార్టీ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి రెండు రోజుల క్రితమే వాఖ్యలు చేశారు. తమ ఎంపీని లోక్ సభ నుండి బహిష్కరించాలని చూస్తున్నారని, అదే జరిగితే ఆమె మరింత ఆధిక్యతతో తిరిగి ఎన్నికై వస్తారని అంటూ ఆమె చెప్పుకొచ్చారు.