
ఉత్తరాఖండ్ ఉత్తర కాశీ సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికుల వెలికితీతకు గత రెండు వారాలుగా అడ్డంకులు మీద అడ్డంకులు ఏర్పడుతున్నాయి. రెండు మూడు రోజుల్లో బయటకు వస్తారని అందరూ అనుకుంటుండగా, వారు బయటపడటానికి మరిన్ని రోజులు లేదా వారాలు కూడా పట్టవచ్చునని అధికారులు శనివారం పేర్కొన్నారు.
సొరంగం తవ్వడానికి తెచ్చిన ఆగర్ మిషన్ ఆగిపోవడంతో శుక్రవారం సాయంత్రం సహాయపని నిలిచిపోయింది. అంత సజావుగా సాగుతుంది.. మరి కొద్ది గంటల్లో బయటకు వచ్చేస్తారని అనుకుటుంన్న తరుణంలో ఊహించని ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఆపరేషన్‌లో ప్రత్యామ్నాయాలు కొలిక్కిరావడం లేదు.
మొండిగా, వేగంగా వెళ్దామంటే మరో ముప్పు ముంచుకొస్తుందేమోననే ఆందోళన.
భారీ ఆశలు పెట్టుకున్న యంత్రాలేమో మోరాయిస్తున్నాయి. ఇప్పటి వరకూ చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో కార్మికులు బయటకు ఎప్పుడొస్తారనేది కచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. సమాంతరంగా తవ్వకాలు జరుపుతున్న అమెరికాకు చెందిన ఆగర్ మిషన్‌కు సొరంగంలోని ఒక ఇనుప పట్టీ అడ్డుపడి బ్లేడ్ దెబ్బతినడంతో పని ఆగిపోయింది.
దీంతో ఇరుక్కుపోయిన బ్లేడ్‌ను కట్ చేయడానికి హైదరాబాద్ నుంచి ప్లాస్మా కట్టర్‌ను రప్పిస్తున్నారు. లక్ష్యానికి ఇంకా 10-12 మీటర్ల దూరంలో డ్రిల్లింగ్ నిలిచిపోయింది. ఇప్పుడు అధికారులు రెండు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు. 10-12 మీటర్ల దూరాన్ని మాన్యువల్‌గా డ్రిల్లింగ్ చేయడం, లేదా కొండపై నుంచి నిలువుగా 86 మీటర్లు డ్రిల్లింగ్ చేయడం. ఇది పూర్తవ్వడానికి కొన్ని వారాల పాటు పట్టవచ్చునని ఎన్‌డీఎంఏ మెంబర్ లెఫ్ట్‌నెంట్ జనరల్ సయ్యద్ హస్నాయన్ తెలిపారు.
కాగా, భారత సైనికులు మాన్యువల్ డ్రిల్లింగ్ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. అందుకోసం చెన్నై నుండి 20 మంది నిపుణులను పిలిపిస్తున్నట్లు చెప్పారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ మీడియాతో మాట్లాడుతూ లోపలి చిక్కుకున్న బాధితులను తీసుకొచ్చేందుకు అందుబాటులో ఉన్న అన్ని ప్రత్యామ్నాయాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగిస్తున్నాయని తెలిపారు. వారి దగ్గరకు చేరుకుని బయటకు తీసుకురావడానికే ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
‘శిథిలాల్లో ఇరుక్కుపోయిన ఆగర్ యంత్రం బ్లేడ్లను కత్తిరించేందుకు ప్లాస్మా కట్టర్ అవసరం.. దాన్ని హైదరాబాద్ నుంచి విమాన మార్గంలో తీసుకొస్తున్నాం. అది వచ్చాక ఆదివారం మాన్యువల్ డ్రిల్లింగ్‌ను ప్రారంభించే అవకాశాలున్నాయి” అని ఆయన తెలిపారు. అంతకు ముందు రెస్క్యూలో పాల్గొంటున్న ఆస్ట్రేలియాకు చెందిన మైక్రో టన్నల్ నిపుణుడు అర్నాల్ డిక్స్ మాట్లాడుతూ లోపలి చిక్కుకున్న 41 మంది కార్మికులు క్రిస్మస్ పండుగ నాటికి బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు.
‘డ్రిల్లింగ్, ఆగరింగ్ ఆగిపోయింది. ఆగర్ మెషిన్ ఇంకేమీ చేయలేదు. మేము అనేక ఎంపికలను చూస్తున్నాం.. కానీ ప్రతి ఎంపికతో 41 మంది కూలీలను సురక్షితంగా తీసుకురావడమే మా లక్ష్యం.. పర్వతం మళ్లీ ఆగర్‌ను ప్రతిఘటించింది, కాబట్టి మేము మా విధానాన్ని పునరాలోచిస్తున్నాం’ అని తెలిపారు.
ఇక, కూలీలను చేరుకునేందుకు దాదాపు 60 మీటర్ల వరకు డ్రిల్లింగ్ అవసరమవుతుందని అంచనా వేశారు. దీనిలో 46.9 మీటర్ల పని ఇప్పటివరకు పూర్తయింది. ఇప్పుడు కూలీల ద్వారా తవ్విస్తే ఎలా ఉంటుందని యోచిస్తున్నారు. అదీ కాకుండా ఎక్కువ రోజులు నిరీక్షించాల్సి రానున్నా.. కొండ ఎగువ భాగం నుంచి నిట్టనిలువునా 86 మీటర్ల మేర కిందికి మరో సొరంగం తవ్వడమే మేలని నిపుణులు భావిస్తున్నారు.
More Stories
ఒకే దేశం- ఒకే ఎన్నిక జేపీసీ గడువు పొడిగింపు!
రూ. 1 లక్ష కోట్లతో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తొలి బడ్జెట్
నాపై సెటైర్లు వేయడానికి కమ్రా సుపారి తీసుకున్నట్లుంది