మోదీ కాన్వాయ్‌ను అడ్డుకున్న కేసులో ఎస్పీపై వేటు

సాగు చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ ప్ర‌ధాని నరేంద్ర మోదీ కాన్వాయ్‌ను పంజాబ్‌లో రైతులు అడ్డుకున్న విష‌యం తెలిసిందే. సుమారు 20 నిమిషాల పాటు మోదీ కాన్వాయ్ గ‌త ఏడాది జ‌న‌వ‌రి 5వ తేదీన ఫిరోజ్‌పుర్ ర‌హ‌దారిపై నిలిచిపోయింది. ఆ కేసులో పంజాబ్ ఎస్పీపై వేటు ప‌డింది.  ఎస్పీ గుర్బింద‌ర్ సింగ్‌ను స‌స్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.
బ‌ఠిండా ఎస్పీగా ఉన్న గుర్బింద‌ర్‌ను సస్పెండ్ చేశారు.  పంజాబ్ హోం మంత్రిత్వ శాఖ శనివారంనాడు ఈ విషయం తెలిపింది. ఫెరోజ్‌పూర్‌లో ఎస్‌పీ ఆపరేషన్స్‌ కోసం నియమించిన గుర్విందర్ సింగ్ విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆరోపణలపై ఈ చర్య తీసుకున్నట్టు పేర్కొంది. ఎస్పీ తన విధిని సక్రమంగా నిర్వహించలేదని పేర్కొంటూ ఆ నాటి సంఘటనపై పంజాబ్ డిజిపి ఇచ్చిన నివేదిక ఆధారంగా సుమారు రెండేళ్ల అనంతరం ఈ చర్య తీసుకున్నారు.
ప్రధానమంత్రి 2022 జనవరి 5న పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ ప్ర‌చారం నిమిత్తం ఫెరోజ్‌పూర్ నుంచి హుస్సైనివాలా వెళ్తుండగా భద్రతా లోపం తలెత్తింది. ఉదయం 5 గంటలకు బటిండా చేరిన ప్రధాని అక్కడి నుంచి హుస్సైనివాలాలోని జాతీయ అమరవీరుల స్మారకం వద్దకు హెలికాప్టర్‌లో వెళ్లాల్సి ఉంది. వాతావరణం అనుకూలించకపోవడంతో రోడ్డు మార్గంలో మోదీ ప్రయాణించారు. 

అమరవీరుల స్మారకానికి 30 కిలోమీటర్ల దూరంలో ఒక ఫ్లై ఓవర్ దగ్గరకు ఆయన కాన్వాయ్ వచ్చేసరికి కొందరు ఆందోళనకారులు రోడ్లును దిగ్బంధం చేశారు. దీంతో ఫ్లై ఓవర్ పైనే ప్రదాని 15 నుంచి 20 నిమిషాల పాటు ఉండిపోవాల్సివచ్చింది.  రైతులు వెన‌క్కి త‌గ్గ‌క‌పోవ‌డంతో.. మోదీ కాన్వాయ్ వెన‌క్కి వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఆయన ముందుగా అనుకున్న కార్యాక్రమానికి, ర్యాలీకి హాజరుకాకుండానే పంజాబ్‌ నుంచి వెనక్కి తిరిగి వచ్చేశారు.

2022 జనవరిలో కాంగ్రెస్ నేత చరణ్‌జిత్ సింగ్ చన్ని పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రధాని పర్యటనలో జరిగిన భద్రతా వైఫల్యంపై పలువురు రాష్ట్ర అధికారులను సుప్రీంకోర్టు నియామక కమిటీ తప్పుపట్టింది. 22 నెలల అనంతరం దీనిపై పంజాబ్ సర్కార్ చర్య తీసుకుంటూ బటిండా ఎస్‌పీని సస్పెండ్ చేసింది.

కాగా, మరో ఆరుగురు పోలీసులను పంజాబ్‌ హోంశాఖ ఆదివారం  సస్పెండ్‌ చేసింది. సస్పెండ్‌ అయిన వారిలో ఫిరోజ్‌పూర్‌ జిల్లా ఎస్పీతోపాటు ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు ఇన్‌స్పెక్టర్‌, ఎస్సై, ఏఎస్సై ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి రెండు రోజుల క్రితం అప్పటి ఫిరోజ్‌పూర్‌ (ప్రస్తుతం ఆయన బఠిండా ఎస్పీ) జిల్లా ఎస్పీని సస్పెండ్‌ చేసింది. దీంతో మొత్తంగా ఏడుగురు పంజాబ్‌ పోలీసులపై వేటు పడింది.