74 వసంతాల భారత రాజ్యాంగం. నేడు రాజ్యాంగ దినోత్సవం

మన భారతదేశం సుదీర్ఘకాలం (సుమారు 400 ఏళ్లు) పరాయి పాలనలోనే మగ్గింది. చిన్న వ్యాపారం చేసుకునేందుకు మన దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో అడుగుపెట్టిన బ్రిటీష్ వాళ్లు ఇక్కడ దొరికే అమూల్యమైన సంపదపై కన్ను పడడంతో దాదాపు 400 ఏళ్లు భారతదేశాన్ని పాలించి.. ఇక్కడి ప్రజలతో వెట్టి చాకిరి చేయించుకున్నారు. ఎందరో స్వాతంత్య్ర సమరయోధుల త్యాగ ఫలితాలతో 1947 ఆగస్టు 15న స్వతంత్ర భారత్ గా అవతరించింది. నిజానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికి మనకంటూ సొంత రాజ్యాంగం ఉండాల్సిన అవసరం ఏర్పడింది. 400 ఏళ్ల పాలించిన తెల్లదొరల బానిస సంకెళ్ళను తెంచుకుంటూ కొత్త రాజ్యాంగ రచన చేసుకున్నాం.
ఈ నేపథ్యంలో సొంత రాజ్యాంగం ఏర్పరచుకోవడానికి మనకు మూడేళ్లకు పైగానే పట్టింది. రాజ్యాంగం అంటే దేశానికి, ప్రజలకు, ప్రభుత్వానికి కరదీపిక వంటిది. ఆ దీపస్తంభపు వెలుగుల్లో సర్వసత్తాక సార్వభౌమాధికార దేశంగా ప్రగతి వైపు అడుగులు వేయాలి. అందుకనే రాజ్యాంగానికి ఆధునిక ప్రజాస్వామ్య చరిత్రలో అంతటి విశిష్టమైన స్థానముంది. కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మన దేశం కంటే ముందు అనేక దేశాలు రాజ్యాంగాలను రచించుకున్నాయి.
అయితే భారత రాజ్యాంగ రచన ఒక సంక్లిష్టం. దీనికి కారణం.. దేశంలో అనేక ప్రాంతాలు, మతాలు, తెగలు, ఆదివాసీలు, దళితులు, అణగారిన, పీడనకు గురైన వర్గాలు తదితరులున్నారు. వీరి ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యాంగ రచన ఒక సవాల్ లాంటిదే. ఈ నేపథ్యంలో భారత మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ నేతృత్వంలోని రాజ్యాంగ సభ డా. బీఆర్ అంబేద్కర్ సారధిగా డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటైంది.
రాజ్యాంగ రచన పూర్తి కావడానికి మొత్తం 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజులు పట్టింది. 1946 డిసెంబర్ 6న రాజ్యాంగ సభ లేదా రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు మొదలుకొని 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగం ఆమోదం పొందేవరకు ఈ ప్రక్రియ కొనసాగింది.  1950 జనవరి 24న రాజ్యాంగ సభ చివరి సమావేశంలో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ సహా రాజ్యాంగ సభ సభ్యులందరూ భారత రాజ్యాంగంపై సంతకం చేశారు. జనవరి 26న ఇది పూర్తిగా అమలులోకొచ్చింది.
1948 ఫిబ్రవరిలో భారత రాజ్యాంగం తొలి ముసాయిదాను బీఎన్‌ రావు తయారుచేశారు. ఇందుకోసం ఆయన వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించారు.  రాజ్యాంగం తొలి ముసాయిదాను రూపొందించే క్రమంలో అమెరికా, కెనడా, ఐర్లండ్, బ్రిటన్ వంటి దేశాలలో పర్యటించి అక్కడి న్యాయమూర్తులు, పరిశోధకులు, అధికారులతో చర్చించారు. ఆయా దేశాల రాజ్యాంగాలను నిశితంగా పరిశీలించారు.బీఎన్‌రావు తయారుచేసిన రాజ్యాంగం ముసాయిదాను అధ్యయనం చేసి తుది  ప్రతిని రూపొందించేందుకు ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి అంబేడ్కర్ అధ్యక్షత వహించారు.
రాజ్యాంగమంటే కేవలం ప్రభుత్వ విధివిధానాలు, శాసనసభల రూపకల్పనే కాదు కోట్లాది పీడిత ప్రజల ఆశయాలను ప్రతిబింభించాలన్నది ఆయన ప్రధానాశయం. ఎంతో మంది మహానుభావుల కృషి ఫలితంగానే ప్రపంచంలోనే కొత్త రాజ్యాంగం రూపుదిద్దుకుంది. అందుకనే ప్రపంచంలోని అనేక దేశాల రాజ్యాంగాల కంటే భారత రాజ్యాంగం ఉన్నత విలువలు కలిగిందనే మన్ననలు పొందింది. ఇక 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించడంతో ప్రతి ఏటా ఈరోజు రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. ఇక జనవరి 26, 1950 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగం ఆమోదానికి ఇవాళ్టితో 74 ఏళ్లు. జయహో భారత్.