తెలంగాణాలో కేసీఆర్ వ్యతిరేక ప్రభంజనం

 
* అనూహ్యంగా బిజెపి పుంజుకోవడంతో కాంగ్రెస్ లో ఖంగారు
 
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉండగా, మరో నాలుగు రోజులలో పోలింగ్ జరుగుతున్న సమయాన అధికారంలో ఉన్న బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రజల నుండి తీవ్ర వ్యతిరేక పవనాలు ఎదుర్కొంటున్నట్లు స్పష్టం అవుతున్నది. వరుసగా మూడోసారి గెలుపొంది, ఇప్పటివరకు దక్షిణాది రాష్ట్రాలలో ఏ ముఖ్యమంత్రి సాధించలేని అనూహ్య విజయం సాధించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు వికటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 
దాదాపు అన్ని జిల్లాలో ప్రజలలో అధికార పార్టీ పట్ల, ముఖ్యంగా పాలనలో, పార్టీలో కేసీఆర్ కుటుంబ ఆధిపత్యం పట్ల తీవ్ర వ్యతిరేకత వెల్లడి అవుతున్నట్లు దాదాపు అన్ని సర్వేలు స్ఫష్టం చేస్తున్నాయి.  తెలంగాణాలో తనకు తిరుగేలేదనే ధీమాతో రెండు నెలల ముందు దాదాపుగా సిట్టింగ్ ఎమ్యెల్యేలు అందరికి తిరిగి సీట్లు ఇస్తూ అభ్యర్థుల జాబితా ప్రకటించడం ఒక విధంగా అధికార పక్షంకు చేటు తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 
ఎన్నికల ప్రచారం సందర్భంగా కేసీఆర్ చేస్తున్న ప్రసంగాలు ఆయనలో ఓటమి భయాన్ని స్పష్టం చేస్తున్నట్లు పలువురు పరిశీలకులు భావిస్తున్నారు.  తెలంగాణాలో తనతో సరిసమానమైన రాజకీయ నాయకులు మరెవ్వరు లేరనే ధీమాతో ఆయన సాధారణంగా ఇతర పార్టీల నాయకుల పేర్లను ప్రస్తావించారు. కానీ, మొదటిసారిగా ఆయన ఆ విధంగా ప్రస్తావించడం అధికార పార్టీ నేతలకే విస్మయం కలిగిస్తున్నది.
 
టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కొడంగల్ లో 25 నిముషాల సేపు చేసిన ప్రసంగంలో సుమారు 20 సార్లు రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించారు. అంతేకాకుండా, రేవంత్ రెడ్డిని ఓడిస్తే ఆ నియోజకవర్గానికి వందల కోట్ల రూపాయల నిధులు ఇస్తానని ప్రకటించారు. అదేవిధంగా గజ్వేల్ లో ఈటెల రాజేందర్, కరీంనగరంలో బండి సంజయ్ వంటి నేతల పేర్లను సహితం ప్రస్తావిస్తున్నారు.
 
రాష్ట్ర నిఘా విభాగం అధికారులు, సొంతంగా సర్వే చేయించుకున్న సంస్థల నివేదికలు ఎన్నికలలో తీవ్ర ప్రతికూలత ఎదురవుతున్నట్లు వెల్లడి చేయడంతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను గత సోమవారం పిలిపించుకొని మూడు గంటలసేపు మంతనాలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. కేసీఆర్ కోర్కెపై రెండు రోజులపాటు రాష్ట్రంలోని పరిష్టితులను అధ్యయనం చేసి పరిస్థితులు చేజారిపోయిన్నట్లు ఆయన తేల్చి చెప్పారుని తెలుస్తున్నది.
ముఖ్యంగా కేసీఆర్ కుటుంబ పాలనపై ప్రజలలోనే కాకుండా, బిఆర్ఎస్ శ్రేణులలో సహితం అసంతృప్తి పెరిగిన్నట్లు ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేసారని చెబుతున్నారు.  కేటీఆర్, కవితల ఆధిపత్యం పట్ల పార్టీలో చాలామంది సీనియర్ నేతలు ఇతర పార్టీలకు వలస వెళ్లిన్నట్లు భావిస్తున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత విషయంలో పార్టీ నాయకత్వం ఆత్మరక్షణలో పడింది.
 
కేసీఆర్ తాను పోటీ చేస్తున్న రెండు చోట్ల కూడా గెలుపు కష్టం అనే సంకేతాలు వెలువడుతున్నాయి. గజ్వేల్ లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీనియర్ నేత ఈటెల రాజేందర్, కామారెడ్డిలో  టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆయనకు గట్టిపోటీ ఇస్తున్నారు.
 
మరోవంక, ఆయన కుమారుడు కె టి రామారావు పోటీ చేస్తున్న సిరిసిల్లలో సహితం పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నట్లు ఆయన నియోజకవర్గంలోని పార్టీ నేతలతో మాట్లాడుతున్న ఆడియో వైరల్ కావడం కలకలం రేపుతోంది. తెలంగాణాలో  కాంగ్రెస్, బిజెపి తనకు పోటీకాబోవనే మితిమీరిన విశ్వాసంతో కేసీఆర్ ఉంటూ వచ్చారు. అయితే, అనూహ్యంగా ఆ రెండు పార్టీల నుండి ఇప్పుడు గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు.
 
కర్ణాటక ఎన్నికల అనంతరం మూడోస్థానంలోకి వెళ్లిపోయిందని, నాలుగైదు సీట్లు మించి గెలుపొందలేదని భావిస్తూ వస్తున్న బిజెపి ఎవ్వరూ ఊహించని విధంగా `బిసి ముఖ్యమంత్రి’, `ఎస్సి వర్గీకరణ’ అంశాలతో ఎన్నికలలో పెద్దఎత్తున కలకలం రేపింది. అధికార పార్టీకి మాత్రమే కాకుండా, కేసీఆర్ వ్యతిరేకతతో అధికారంలోకి వచ్చేశామని అనుకొంటున్న కాంగ్రెస్ నేతలకు సహితం ఖంగారు కలిగిస్తున్నది.
 
చివరి వారంలో బిజెపి అగ్రనేతలు అందరూ తెలంగాణాలో సుడిగాలి పర్యటనలతో ప్రచారం చేస్తుండటంతో ఎన్నికల రంగంలో బిజెపి ప్రధాన రాజకీయ శక్తిగా నిలబడింది. ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా, యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లతో పాటు పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ప్రచారంలో పాల్గొంటున్నారు.
 
మరోవంక కుమ్ములాటలకు పేరొందిన కాంగ్రెస్ లో సహితం ప్రస్తుతంకు ఎవ్వరు  మెదపకుండా కట్టడి చేయడంలో పార్టీ నాయకత్వం విజయవంతమైనది. 20 మందికి పైగా తిరుగుబాటు అభ్యర్థులను పోటీ నుంచి విరమింప చేయడంతో అధికార పార్టీలో ఆందోళన కలిగిస్తున్నది. రాహుల్ గాంధీకి ప్రియాంక గాంధీ విస్తృతంగా ప్రచారం చేస్తుండటం పార్టీ శ్రేణులను కదిలిస్తుంది.
 
కర్ణాటక ప్రభుత్వం అండతో బిఆర్ఎస్ కు పోటీగా కాంగ్రెస్ సహితం వనరులను మోహరింప చేస్తున్నది.  అయితే, గత రెండు ఎన్నికల అనుభవాల దృష్ట్యా గెలుపొందేవారిలో ఎంతమంది కాంగ్రెస్ ను అంటిపెట్టుకొని ఉంటారనే అనుమానాలు సహజంగానే వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటివరకు పార్టీలో గెలుపొందిన వారెవ్వరూ పార్టీని విడవకుండా కట్టడి చేస్తున్నామనే మాటలు ఆ పార్టీ నాయకత్వం నుండి రావడం లేదు.
 
బిఆర్ఎస్ వర్గాలే కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీచేస్తున్న వారిలో 20 మందికి పైగా తమ పార్టీ వారిని, ఎన్నిక అనంతరం తమకు పూర్తి మెజారిటీ రాని పక్షంలో పార్టీ ఫిరాయింపుకు వారంతా సిద్ధం అనే సంకేతాలు బహిరంగంగానే ఇస్తున్నారు.