రష్మిక డీప్‌ఫేక్‌ వీడియోపై లభించిన కీలక ఆధారాలు

స్టార్‌ నటి రష్మిక మందన్నాకు సంబంధించిన డీప్‌ఫేక్‌ వీడియో ఇటీవలే సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయిన ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో డీప్‌ఫేక్‌ వీడియోకు సంబంధించిన కేసు దర్యాప్తులో తమకు కీలకమైన ఆధారాలు లభించినట్లు ఢిల్లీ పోలీసులు తాజాగా వెల్లడించారు. 
 
సాంకేతిక విశ్లేషణ ద్వారా వాటిని పరిశీలిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ హేమంత్‌ తివారీ తెలిపారు. ఏయే అడ్రెస్‌ నుంచి వీడియో అప్‌లోడ్‌ అయ్యిందో గుర్తించే పనిలో ఉన్నట్లు వెల్లడించారు. నిందితుల్ని త్వరలోనే గుర్తించి అరెస్ట్‌ చేస్తామని పేర్కొన్నారు.   జారా పటేల్ అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కి సంబంధించిన వీడియోకి రష్మిక ముఖాన్ని మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది.
దీనిపై సినీ ప్రముఖులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 
ఈ వీడియోకు సంబంధించి ఢిల్లీ మహిళా కమిషన్‌ కూడా స్పందించింది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులకు నోటీసు పంపింది. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతో కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 
మరోవంక, సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న డీప్‌ఫేక్ వీడియోల‌పై కేంద్రం సీరియ‌స్‌గా ఉన్న విష‌యం తెలిసిందే. ఆ అంశాన్ని ప‌రిశీలించేందుకు ప్ర‌త్యేక అధికారిని నియ‌మించ‌నున్న‌ట్లు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్ తెలిపారు. డీప్‌ఫేక్ కాంటెంట్ విష‌యంలో చ‌ర్య‌లు తీసుకునేందుకు ఆ ఆఫీస‌ర్‌ను నియ‌మించ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. 
 
సోష‌ల్ మీడియా కంపెనీల‌తో జ‌రిగిన స‌మావేశం త‌ర్వాత ఆయ‌న ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. డీప్‌ఫేక్ వీడియోలు సృష్టిస్తున్న వారిపై జ‌రిమానాలు విధిస్తామ‌ని, న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని కేంద్ర మంంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ కూడా వెల్ల‌డించారు. 
 
త‌ప్పుడు స‌మాచార వ్యాప్తిని నియంత్రించ‌డం కంపెనీల బాధ్య‌తే అని, అలాంటి కాంటెంట్ ఉంటే వాటిని 36 గంట‌ల్లోనే తొల‌గించాల‌ని, ఐటీ రూల్స్ 2021 ప్ర‌కారం చ‌ర్య‌లు ఉంటాయ‌ని మంత్రి చంద్ర‌శేఖ‌ర్ స్పష్టం చేశారు. డీప్‌ఫేక్‌ల‌ను క్రియేట్ చేసి, స‌ర్య్యూలేట్ చేసేవారికి ల‌క్ష జ‌రిమానాతో పాటు మూడేళ్ల జైలుశిక్ష విధించ‌నున్న‌ట్లు కేంద్రం పేర్కొన్న‌ది.