ఢిల్లీ ప్రధాన కార్యదర్శి వివాదంపై సుప్రీం మధ్యేమార్గం

ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్ వ్యవహారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు మధ్యేమార్గం సూచించింది. చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్‌ను తొలగించాలని ఆప్ ప్రభుత్వం, ఆయనను కొనసాగించేందుకు కేంద్రం ప్రభుత్వం పట్టుదలగా ఉండటంతో ఆప్ చేసిన విజ్ఞప్తిపై అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ జరిపింది. 
ఈ సందర్భంగా కేంద్రాన్ని మూడు పేర్లు సిఫారసు చేయాలని, దానిలో ఒక పేరును ఢిల్లీ ప్రభుత్వం ఎంచుకోవాలని సీజేఐ డీవై చంద్రచూడ్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం సూచించింది. కేంద్రం తరఫున హాజరైన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్రంతో చర్చించి మూడు పేర్లు ఢిల్లీ ప్రభుత్వానికి తెలియజేయాలని పేర్కొంది.

”ఒక ఆమోదయోగ్యమైన పరిష్కారానికి మాకు అవకాశం ఇవ్వండి. కోర్టులకు వెళ్లాల్సిన పని లేకుండా ప్రభుత్వం పని చేయాలి. మూడు పేర్లు మాకు ఇవ్వడం ఒక ఆప్షన్. లెఫ్టినెంట్ గవర్నర్ (వీకే సక్సేనా), సీఎం (అరవింగ్ కేజ్రీవాల్) కలిసి కూర్చుని చీఫ్ సెక్రటరీ వివాదాన్ని ఎందుకు పరిష్కరించుకోకూడదు?” అని ధర్మాసనం ప్రశ్నించింది. 

ఈ సూచనను సక్సేనా తరఫున హాజరైన న్యాయవాది హరీష్ సాల్వే స్వాగతించారు. అయితే పబ్లిక్ డొమైన్‌లో ఆ పేర్లు షేర్ చేయరాదని కోరారు. సాల్వే విజ్ఞప్తికి సీజేఐ అంగీకారం తెలిపారు. మూడు పేర్లలో ఎంపిక కాని వ్యక్తుల గౌరవానికి భంగం వాటిల్లో అవకాశం ఉందని అభిప్రాయపడింది.

కాగా, ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్‌పై ఆప్ ప్రభుత్వం కొద్దికాలంగా తీవ్ర ఆరోపణలు చేస్తోంది. కోట్లాది రూపాయల ‘ఆసుపత్రి స్కామ్’లో ఆయన ప్రమేయాన్ని నిలదీస్తోంది. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టుకు సంంధించి రూ.850 కోట్ల భూ నష్టపరిహారం కేసులో ఆయనకు ప్రమేయం ఉందని ఆరోపిస్తోంది.  ఆసుపత్రి స్కామ్‌కు సంబంధించి చీఫ్ సెక్రటరీ ప్రమేయానికి సంబంధించి విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ రిపోర్టును గవర్నర్ వీకే సక్సేనాకు కేజ్రీవాల్ గత వారంలో పంపారు. నరేష్ కమార్‌ను తొలగించాలని గవర్నర్‌ను సీఎం కోరారు.