తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించిన ప్ర‌ధాని మోదీ

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ శనివారం బెంగుళూరులో తేజస్ యుద్ధ విమానంలో విహ‌రించారు. పూర్తిగా స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో డెవ‌ల‌ప్ చేసిన తేజ‌స్‌లో ఆయ‌న ట్రిప్ వేశారు. బెంగుళూరులో ఉన్న హెచ్ఏఎల్ కంపెనీని ఆయ‌న సందర్శించారు. ర‌క‌ర‌కాల ఫైట‌ర్ జెట్ల త‌యారీ గురించి తెలుసుకున్నారు. యుద్ధ విమానాల ఉత్ప‌త్తి కేంద్రాన్ని ఆయ‌న ప‌రిశీలించారు. తేజ‌స్ త‌యారీ గురించి కూడా ఆయ‌న తెలుసుకున్నారు. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్ తేజ‌స్ యుద్ధ విమానాల‌ను త‌యారు చేస్తున్నది. లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌గా వాటికి గుర్తింపు ఉన్న‌ది.
 
“తేజస్​ విమానంలో ప్రయాణించాను. ఆత్మనిర్భరం విషయంలో మన కష్టం, శ్రమ ఇతర దేశాలతో పోల్చుకుంటే తక్కువేమీ కాదు. భారత వాయుసేన, డీఆర్​డీఓకు, హెచ్​ఏఎల్​ నా హృదయపూర్వక అభినందనలు,” అని మోదీ ట్వీట్​ చేశారు. “ఈ ప్రయాణంతో.. భారత దేశ సత్తాపై నాకు మరింత నమ్మకం పెరిగింది,” అని మోదీ పేర్కొన్నారు.

పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన యుద్ధ విమానాన్నిఉద్దేశిస్తూ నమ్మశక్యం కానిది సాధించి చూపించాం అంటూ ఎక్స్ లో రాసుకొచ్చారు. రక్షణ ఉత్పత్తులను భారత్ లోనే తయారు చేసేలా ప్రధాని ప్రోత్సహిస్తున్నారు. వాటి తయారీ, ఎగుమతులను కూడా ప్రభుత్వం పెంచిన విధానాన్ని ఆయన వివరించారు.

అమెరికాకు చెందిన జీఈ ఏరోస్పేస్ సంస్థ‌తో హిందుస్థాన్ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్న‌ది. తేజ‌స్ విమానాల‌కు చెందిన‌ మాక్‌-3 ఇంజిన్ల‌ను హెచ్ఏఎల్ ఉత్ప‌త్తి చేస్తోంది. తేలికపాటి యుద్ధ విమానమైన తేజస్‌ను కొనుగోలు చేసేందుకు పలు దేశాలు ఆసక్తి కనబరిచాయి. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ రక్షణ ఎగుమతులు రూ.15,920 కోట్లకు చేరాయని ఈ ఏడాది ఏప్రిల్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఇది దేశం సాధించిన ఘన విజయంగా అభివర్ణించారు.