గాజాలో బందీల విడుదలను స్వాగతించిన ప్రధాని మోదీ

ఇజ్రాయెల్, హమాస్ మధ్య బందీల విడుదలపై నాలుగు రోజుల ఒప్పందాన్ని ప్రధాన నరేంద్ర మోదీ స్వాగతించారు. అయితే ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రపంచ దేశాలు సహించరాదని ఆయన స్పష్టం చేశారు. సమాజంలోని ప్రతి ఒక్కరికీ కృతిమ మేధ  చేరువకావాలని పేర్కొంటూ డీప్‌ఫేక్, పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి ఆందోళనకరమని తెలిపారు.

బుధవారం ఢిల్లీలో జీ-20 దేశాధినేతల వర్చువల్ భేటీలో ప్రధాని మాట్లాడుతూ, సవాళ్లను ఎదుర్కొనేందుకు జీ-20 దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.  ”పశ్చిమాసియాలో నెలకొన్ని అనిశ్చితి ఆందోళనకరం. ఉగ్రవాదాన్ని సహించకూడదు. ఈ ఘర్షణల్లో ఏ దేశంలోనైనా ప్రజలు ప్రాణాలు కోల్పోవడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి” అని కోరారు. 

“ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో బందీల విడుదలను స్వాగతిస్తున్నాం. తక్కినవారు కూడా త్వరలోనే విడుదలవుతారని ఆశిస్తున్నాం. తక్షణ మానవతా సాయం చాలా కీలకం. ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రాంతీయ ఘర్షణగా మారకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది” అని ప్రధాని తెలిపారు.

కాగా, కృత్రిమ మేధ (ఏఐ) విషయంలో తలెత్తుతున్న భద్రతా సమస్యలపై జీ-20 దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని ప్రధాని మోదీ కోరారు. సాంకేతికతను బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఏఐ ప్రతి ఒక్కరికీ చేరువ కావాలని, ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధి జరగాలని ప్రధాని తెలిపారు.

కృత్రిమ మేధ సామాజిక హితంగా ఉండాలని, ఇది భద్రతా పరిధిని దాటితే ముప్పు వాటిల్లుతుందని ప్రధాని హెచ్చరించారు. పౌరుల అవసరాలను, ప్రత్యేకించి భావితరాల బాగోగులను పరిగణనలోకి తీసుకుని ఈ వినూత్న పరిజ్ఞానం వెలుగులోకి రావచ్చునని మోదీ స్పష్టం చేశారు. ఏఐ నియంత్రణపై భారత్ ఆలోచన చాలా స్పష్టంగా ఉందని పేర్కొంటూ  ప్రపంచ దేశాలతో కలిసి పనిచేసేందుకు కూడా సిద్ధంగా ఉందని చెప్పారు. 

డీప్‌ఫేక్‌ను ఇటీవల కాలంలో కొందరు దుర్వినియోగం చేస్తు్న్నారని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. నటులు, సమాజంలో ప్రభావశీల వ్యక్తుల నకిలీ చిత్రాలను రూపొందించి ప్రచారం చేస్తున్నారని, ఇందువల్ల సమాజానికి, ప్రజలకు ముప్పు పొంచి ఉంటుందని తెలిపారు.  డీప్‌ఫేక్ దుర్వినియోగం కాకుండా నియంత్రించాలని పేకరోన్తు ఇందుకోసం ప్రపంచ దేశాలతో భారత్ కలిసి పనిచేస్తుందని చెప్పారు.

కృత్రిమ మేధ భాగస్వామ్య సదస్సు వచ్చే నెలలో ఉంటుందని ప్రధాని ప్రకటించారు. గ్లోబల్ సౌత్ దేశాల్లో డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) అమలుకు నిధుల ప్రతిపాదన చేస్తూ, ఇనీషియల్ ఫండ్‌గా 25 మిలియన్ డాలర్లను ప్రధాని ప్రకటించారు. గ్రీన్ ఎనర్జీ, క్లయిమేట్ ఫైనాన్స్, మహిళా రిజర్వేషన్ బిల్లు-2023 విషయంలో భారత్ గణనీయమైన కృషి చేసిందని తెలిపారు.