భీకర ఎన్‌కౌంటర్ లో ఇద్దరు కెప్టెన్లు, ఇద్దరు జవాన్ల వీరమరణం

జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరి జిల్లా బాజీ మాల్ అడవుల్లో బుధవారం ఉదయం నుంచి జరిగిన భీకర ఎన్‌కౌంటర్  లో ఇద్దరు ఆర్మీ అధికారులు, ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. మరో ఇద్దరు గాయపడ్డారు.  చనిపోయిన వారిని రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన కెప్టెన్ ఎంవి ప్రాంజల్, 9 పిఎఆర్ఎ కు చెందిన కెప్టెన్ శుభం, హవిల్దార్ మజీద్ గా గుర్తించారు. మరో జవాన్ ను గుర్తించాల్సి ఉంది. 

కాలాకోట్‌ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం అందటంతో ఆదివారం నుంచి సైనిక బలగాలు గాలింపు చేపట్టాయి.  దట్టమైన అడవిలో నక్కి ఉన్న ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడ్డాయి. దీంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ క్రమంలో ఇద్దరు కెప్టెన్లు, ఒక హవల్దార్‌, ఒక జవాన్‌ వీరమరణం పొందినట్టు అధికారులు వెల్లడించారు. మరో మేజర్‌, జవాన్‌ గాయపడినట్టు తెలిపాయి. బాజిమాల్‌ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకున్నట్టు వివరించాయి.

కార్డ‌న్ సెర్చ్ ఆప‌రేష‌న్‌లో భాగంగా ధ‌ర్మ‌శాల స‌మీపంలోని బ‌జిమాల్ ప్రాంతంలో  ఉగ్ర‌వాదుల‌ను సైన్యం చుట్టుముట్టింది. ఉగ్ర‌వాదులు, భ‌ద్ర‌తా ద‌ళాల మ‌ధ్య భీక‌ర పోరు కొన‌సాగుతోంద‌ని అధికారులు తెలిపారు.  డ్రోన్ సహాయంతో ఉగ్రవాదులకై గాలింపు చర్యలు చేపట్టారు.  అటవీ ప్రాంతంలో ఇద్దరు- ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో ఆర్మీ ప్రత్యేక బలగాలు, పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి.

బుధవారం తెల్లవారుజామున అక్కడకు చేరుకుని తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన సైన్యం ఎదురుకాల్పులు జరపడంతో ఎన్‌కౌంటర్‌కు దారితీసింది.  ముష్కరుల కాల్పుల్లో గాయపడిన సైనికులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా అక్కడ నలుగురు మృతి చెందారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

ఆ ప్రాంతం కాల్పులతో దద్దరిల్లుతోంది.  ఈ ఘటన తర్వాత భారత సైన్యం మరింత అప్రమత్తమైంది. పెద్ద సంఖ్యలో బలగాల్ని ఘటనా స్థలానికి పంపింది. అటవీ ప్రాంతంలో నక్కివున్న ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తున్నది. గ్రామానికి అత్యంత సమీపంలో కార్డ్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ఇండ్ల నుంచి ఎవ్వరూ బయటకు రావొద్దని పోలీసులు చెప్పారని గ్రామస్థులు తెలిపారు. 

పిర్‌ పంజాల్‌ అటవీ ప్రాంతం గత కొన్నాండ్లుగా సైన్యానికి సవాల్‌గా మారింది. ఉగ్రమూకలు ఇక్కడి దట్టమైన అడవుల్ని తమకు అనుకూలంగా మలుచుకున్నాయి. ఈ క్రమంలో నవంబర్‌ 17న భద్రతా బలగాలు ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టాయి.  ఏప్రిల్‌ 20, మే 5న పూంఛ్‌, రాజౌరీ జిల్లాలోని మెంధార్‌, కాండీ అడవుల్లో జరిగిన కాల్పుల్లో 10 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.

జమ్ముకశ్మీర్‌లో ఈ ఏడాది జరిగిన ఎన్‌కౌంటర్లలో మొత్తం 120 మంది చనిపోగా, అందులో 81 మంది ఉగ్రవాదులు, 26 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. జమ్ము రీజియన్‌లో 46 మంది చనిపోయారు. ప్రమాదకరమైన పర్వతాలు, దట్టమైన అరణ్యాలు, ఆల్పైన్ అడవులను ఉగ్రవాదులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు.

ఇలా ఉండగా, జ‌మ్ము క‌శ్మీర్‌లో ఉగ్ర మూక‌ల‌తో సంబంధాలున్నాయ‌నే ఆరోప‌ణ‌ల‌పై డాక్ట‌ర్‌, పోలీస్ స‌హా న‌లుగురు ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను విధుల నుంచి తొల‌గించారు. ఎస్ఎంహెచ్ఎస్ హాస్పిట‌ల్ శ్రీన‌గ‌ర్ అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ (మెడిసిన్‌) డాక్ట‌ర్ నిసారుల్ హ‌స‌న్‌, కానిస్టేబుల్ (జ‌మ్ము క‌శ్మీర్ పోలీస్) అబ్దుల్ మాజీద్ భ‌ట్‌, లేబ‌రేట‌రీ బేర‌ర్ అబ్ధుల్ స‌లాం రాద‌ర్‌, టీచ‌ర్ ఫ‌రూక్ అహ్మ‌ద్ మిర్‌ల‌ను స‌ర్వీస్ నుంచి డిస్మిస్ చేసిన‌ట్టు అధికారులు వెల్ల‌డించారు.

ఫ‌రూక్ అహ్మ‌ద్ మిర్‌ను తొలుత 1994లో విద్యాశాఖ‌లో నియ‌మించ‌గా ఆపై 2007లో టీచ‌ర్‌గా ప‌దోన్న‌తి పొందారు. ఉగ్ర‌వాదాన్ని క‌ఠినంగా అణిచివేయ‌డం, ఉక్కుపాదం మోప‌డ‌మే త‌మ విధాన‌మ‌ని, జ‌మ్ము క‌శ్మీర్‌ను ఉగ్ర‌వాద ర‌హిత ప్రాంతంగా మ‌లిచేందుకు ఎల్‌జీ యంత్రాంగం క‌ట్టుబ‌డి ఉంద‌ని ప్ర‌భుత్వం పేర్కొంది.