తెలంగాణలో పోరాట స్ఫూర్తికి విరుద్ధంగా సాగుతున్న పాలన

పోరాడి సాధించుకున్న తెలంగాణాలో అవినీతి రహిత, సామాజిక తెలంగాణాను కోరుకున్నానని, కానీ ఇక్కడ తెలంగాణ పోరాట స్ఫూర్తికి విరుద్ధ పాలన జరుగుతోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు.  తెలంగాణ ఎన్నికల్లో మిత్ర పక్షం బీజేపీ, జనసేన అభ్యర్థుల విజయం కోసం వరంగల్ నగరంలో బుధవారం బీజేపీ ఏర్పాటు చేసిన ప్రచార సభలో ఆయన మాట్లాడారు. 

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, తనలో పోరాట స్ఫూర్తికి కారణం తెలంగాణ ఉద్యమమని, తెలంగాణ బతుకులు మారుతాయని ఆశించానని చెప్పారు. అయితే, తాను కోరుకున్న మార్పు కనపడలేదని విచారం వ్యక్తం చేశారు. ఏపీలో అవినీతి ఉన్న మాట వాస్తవం, కానీ ప్రజలు సాధించిన తెలంగాణాలో అవినీతి పెరగటం బాధకరం అని పేర్కొన్నారు.

ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ మీడియాతో మాట్లాడుతూ, అవినీతి పాల్పడుతాం, 6 శాతం కమీషన్ ఇస్తాం, 8 శాతం, 12 శాతం కమీషన్ ఇస్తామని అంత ధైర్యంగా కాంట్రాక్టర్ మాట్లాడుతుంటే… తెలంగాణ యువత ప్రశ్నించలేని స్థితికి చేరిందని పవన్ కళ్యాణ్ విస్మయం వ్యక్తం చేశారు. ఇక సామాజిక న్యాయానికి చోటు లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 

ఒక సభలో గద్డర్ మాట్లాడుతూ, సమాజంలో 50 శాతం పైగా ఉన్న బీసీ వర్గాలకు రాజ్యాధికారంలో చోటు లేదని అన్నారని, అదే స్ఫూర్తితో తన జనసేనను ముందుకు నడుపుతున్నానని చెబుతూ బీసీ సీఎం కావాలని కోరుకుంటున్నానని పేర్కొంటూ బీజేపీ ఈ కోరికను తీర్చబోతోందని సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణలో అధికారం కాదు మార్పు కావాలని స్పష్టం చేశారు.

ఆంధ్రా జన్మనిస్తే తనకు తెలంగాణ పునర్జన్మనిచ్చిందని చెప్పారు. తెలంగాణలో దళిత ముఖ్యమంత్రిని చూడలేకపోయామని.. బీసీ ముఖ్యమంత్రినైనా చూడాలని అందుకే బీజేపీతో కలిసినట్లు తెలిపారు బిజెపి అభ్యర్థులు ఎర్రబెల్లి ప్రదీప్ రావుతో పాటు రావు పద్మాలను వరంగల్ లో గెలిపించాలని అయన కోరారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, జనసేన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపిచ్చారు.

‘తెలంగాణ ఇచ్చిన స్ఫూర్తితోనే పదేళ్లుగా పార్టీని నడుపుతున్నా. బలిదానాలపై ఏర్పడిన రాష్ట్రం అవినీతిమయం కావడం బాధ కలిగించింది. ఆంధ్రా నాకు జన్మనిస్తే.. తెలంగాణ పునర్జన్మ ఇచ్చింది. నాడు తెలంగాణకు మద్దతు ఇచ్చిన వారిలో నేనూ ఒకడిని’ అని పవన్ కళ్యాణ్ తెలిపారు.  ఉగ్రవాదులను మట్టుబెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ అంటే తనకు అపార గౌరవమని, దేశ ఆర్థిక స్థితిని ఆయన చక్కదిద్దారని, ఎందరో హామీలు ఇస్తారని ఆయన కొనియాడారు. బీజేపీ కూడా హామీలు ఇచ్చిందని, వీటిని నెరవేర్చకునేందుకు యువకులు నడుము బిగించాలని పవన్ కళ్యాణ్ పిలుపిచ్చారు. 

తాను ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో నిమగ్నమయ్యానని, ఇక తెలంగాణపై దృష్టి సారించానని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి తెలంగాణాలో క్రియాశీల రాజకీయాల్లో పాల్గొంటానని పవన్ కళ్యాణ్ వివరించారు. ఈ ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి కావాలంటే, అవినీతి పాలన పోవాలంటే కమలం గుర్తుకు ఓటు వేయాలని, అలాగే జనసేన అభ్యర్థులను గెలిపించాలని పవన్ కళ్యాణ్ వరంగల్ ప్రజలను కోరారు.