ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాల పట్ల సుప్రీంకోర్టు అసహనం

వాయు కాలుష్య తీవ్రతకు సంబంధించి ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. దేశ రాజధాని ప్రాంతంలో వాయు కాలుష్య కట్టడి కోసం ఢిల్లీ, పొరుగు రాష్ట్రాలు కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించింది. గత ఆరేళ్లతో పోలిస్తే ఈ నవంబర్‌లో ఢిల్లీ మరింత కాలుష్య నగరంగా మారిందని, సమస్య ఏమిటో అందరికీ తెలుసునని, దాన్ని అరికట్టే బాధ్యత కూడా ప్రభుత్వాలదేనని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను డిసెంబర్ 5వ తేదీకి వాయిదా వేసింది.

ఢిల్లీ సహా ఉత్తరభారతంలో ఏటా శీతాకాలంలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని కట్టడి చేసేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారంనాడు విచారణ జరిపింది. ఢిల్లీ కాలుష్య సంక్షోభానికి కారణమవుతున్న వ్యవసాయ వర్ధ పదార్ధాల కాల్చివేత కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పంజాబ్, ఢిల్లీ, యూపీ ప్రభుత్వాలను జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ ఎస్.ధులియాతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.

అయితే, పంజాబ్ రైతుల పరిస్థితులపై కోర్టు సానుకూలంగా స్పందించింది. ప్రతిసారి రైతులను విలన్లుగా చూపిస్తున్నారని, ఈ కోర్టులో వారిని తాము విచారించడం లేదని పేర్కొంది. పంట వ్యర్థాలను కాల్చివేయాడానికి రైతులకు పలు కారణాలు ఉండవచ్చని తెలిపింది. 

పంట వ్యర్థాలు తగులబెట్టకుండా రైతులకు హర్యానా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తోందని పేర్కొంటూ హర్యానా సర్కార్ నుంచి పాఠాలు నేర్చుకోవాలని ఢిల్లీ, పంజాబ్ సర్కార్‌లను మందలించింది. చిన్న చిన్న భూములున్న పేద రైతులకు 100 శాతం మెషనరీ సౌకర్యం కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతని పంజాబ్ సర్కార్‌కు కోర్టు తెలిపింది.

ఢిల్లీ-మీరట్ ఆర్ఆర్‌టీఎస్ (రీజనల్ ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్)కు ఢిల్లీ ప్రభుత్వం నుంచి నిధులు ఆలస్యం కావడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ”మీరు మా ఉత్తర్వులను పాటించడం లేదు. ఇక మాకు మరో మార్గం లేదు. వారంలోగా ఢిల్లీ ప్రభుత్వం ఆ నిధులను చెల్లించాలి. లేదంటే మీ పార్టీ (ఆప్) ప్రకటనల కోసం కేటాయించిన నిధుల్లోంచి ఆ డబ్బును బదిలీ చేస్తాం” అని ధర్మాసనం హెచ్చరించింది. 

దీనికి ముందు, తమ వాటా రూ.415 కోట్లు చెల్లించలేకుండా ఉన్నామంటూ ఢిల్లీ ప్రభుత్వం అసక్తత వ్యక్తం చేయడంతో కోర్టు తీవ్రంగా స్పందించింది. గత మూడేళ్లలో అడ్వర్‌టైజ్‌మెంట్ల కోసం చేసిన ఖర్చుల నివేదికను తమకు సమర్పించాలని ఆదేశించింది. వారం రోజుల్లోగా ఆర్ఆర్‌టీసీ నిధుల వాటా చెల్లించకుంటే యాడ్ కేటాయింపుల నుంచి ఆ సొమ్మును బదిలీ చేయాల్సి వస్తుందని ఆప్ సర్కార్‌ను హెచ్చరించింది.