అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపులకు చిహ్నం కాంగ్రెస్

అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపులకు కాంగ్రెస్ చిహ్నంగా ఉంటోందని, ఈ మూడు చెడు లక్షణాలే దేశం అభివృద్ధి కాకుండా అడ్డుకుంటున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. రాజస్థాన్ బారన్ జిల్లాలో ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగిస్తూ కాంగ్రెస్ నేతలు నీతి నియమాలకు కట్టుబడి ఉండరని, అధికార పార్టీ దోపిడీదారులకు, అక్రమార్కులకు, నేరస్థులకు పాలన అప్పగించడంతో రాష్ట్ర ప్రజలు అనేక బాధలకు గురవుతున్నారని ఆరోపించారు.

ఈ మూడు చెడు లక్షణాల శత్రువులు మనలో ఉన్నంత కాలం అభివృద్ధి చెందిన దేశంగా నెరవేర్చడం కష్టమని ప్రధాని స్పష్టం చేయసారు. కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎలు, మంత్రులు నుంచి కాంగ్రెస్ లోని ప్రతివారూ నీతినియమాలకు కట్టుబడని వారేనని అందువల్లనే ప్రజలు సతమతమవుతున్నారని ధ్వజమెత్తారు. “గెహ్లాట్ జీ మీరు ఓట్లు సంపాదించలేరు” అని ఈ రోజు రాజస్థాన్ లోని పిల్లలు కూడా అంటున్నారని చెబుతూ ప్రధాని ఎద్దేవా చేశారు.

రాజస్థాన్ లోని శాంతిభద్రతల పై కూడా మోదీ ధ్వజమెత్తారు. చెల్లెళ్లు, కుమార్తెల పాలిట అక్రమాలు, అఘాయిత్యాలకు ఎవరైతే పాల్పడుతున్నారో వారికి అండగా మంత్రులు ఉంటున్నారని ఆయన ఆరోపించారు. మహిళా సంక్షేమం, భద్రతే బీజేపీ ప్రాధాన్యతగా పేర్కొన్నారు. కాంగ్రెస్ మద్దతు కారణం గానే రాజస్థాన్‌లో సంఘ వ్యతిరేక శక్తుల మనోబలం ఎక్కువని ప్రధాని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఎక్కువ‌కాలం అధికారంలో ఉంటే అది స‌మాజానికి అంత హాని త‌ల‌పెడుతుంద‌ని ప్ర‌ధాని మోదీ హెచ్చరించారు. రాజ‌స్ధాన్‌లోని  కోటాలో మంగ‌ళ‌వారం జరిగిన ర్యాలీని ఉద్దేశించి ప్ర‌ధాని మాట్లాడుతూ అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం అన్ని రంగాల్లో విఫ‌ల‌మైంద‌ని విమర్శించారు.

నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ర్యాలీకి పూర్తి భ‌ద్ర‌త క‌ల్పించార‌ని ప్రధాని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. పేప‌ర్ లీక్ అంశంపై కాంగ్రెస్ ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా ప్ర‌ధాని మోదీ విమ‌ర్శ‌లు గుప్పించారు. పేప‌ర్ లీక్ బాధ్యుల‌ని తాము జైలుకు పంపుతామ‌ని, ఇది మోదీ గ్యారంటీ అని వెల్లడించారు. దేశ‌వ్యాప్తంగా విద్యార్ధులు శిక్ష‌ణ కోసం కోటాకు వ‌స్తార‌ని, విద్యార్ధులు, యువ‌త క‌ల‌ల‌ను కాంగ్రెస్ చిదిమేసింద‌ని ఆయన దుయ్య‌బ‌ట్టారు.

రాజ‌స్ధాన్‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి కౌంట్‌డౌన్ మొద‌లైంద‌ని ప్రధాని తేల్చి చెప్పారు. అశోక్ గెహ్లాట్ మాయాజాలం రాజ‌స్ధాన్ ప్ర‌జ‌ల శ‌క్తి ముందు ప‌నిచేయ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. డిసెంబ‌ర్ 3న రాజ‌స్ధాన్ నుంచి కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుంద‌ని ప్ర‌ధాని జోస్యం చెప్పారు. అశోక్ గెహ్లాట్ ప్ర‌భుత్వం ప‌ట్ల రాష్ట్ర ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నార‌ని పేర్కొంటూ రాజ‌స్ధాన్ యువ‌త కాంగ్రెస్ నుంచి స్వేచ్ఛ కావాల‌ని కోరుతున్నార‌ని తెలిపారు.

కాంగ్రెస్ బీసీల వ్య‌తిరేక పార్టీ

ఇలా ఉండగా, కాంగ్రెస్ పార్టీ, రాజ‌స్ధాన్‌లో అశోక్ గెహ్లాట్ ప్ర‌భుత్వం బీసీల వ్య‌తిరేక‌ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. అళ్వార్ జిల్లా ఖైర్తాల్‌లో జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ కాంగ్రెస్‌పై విమ‌ర్శ‌లతో విరుచుకుప‌డ్డారు. ఓట్ల కోసం కాంగ్రెస్ బుజ్జ‌గింపు రాజ‌కీయాలు చేస్తోంద‌ని దుయ్య‌బ‌ట్టారు.
 
కాంగ్రెస్‌ బీసీల వ్య‌తిరేక వైఖ‌రిని అవలంభిస్తూ మండ‌ల్ క‌మిష‌న్ నివేదిక‌ను వ్య‌తిరేకించింద‌ని మండిప‌డ్డారు. బీసీ క‌మిష‌న్‌కు కాంగ్రెస్ చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించ‌లేద‌ని ఆయన గుర్తు చేశారు. కేంద్రంలో న‌రేంద్ర మోదీ సార‌ధ్యంలోని ప్ర‌భుత్వం బీసీ క‌మిష‌న్‌కు రాజ్యాంగ హోదా క‌ల్పించింద‌ని తెలిపారు. కేంద్ర క్యాబినెట్‌లో 27 మంది ఓబీసీ మంత్రులున్నార‌ని, విద్యాసంస్ధ‌ల్లోనూ బీసీల‌కు 27 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించామ‌ని చెప్పారు.