
ఉత్తరకాశీలోని కుంగిపోయిన సిల్క్‌యారా టన్నెల్‌లో చిక్కుకుపోయిన కార్మికుల ఫొటోలు తొలిసారి బయటకు వచ్చాయి. మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎనిమిది రోజుల క్రితం 41 మంది కార్మికులు టన్నెల్‌లో చిక్కుకుపోయారు. గత 10 రోజులుగా లేదా 240 గంటలకు పైగా ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న కార్మికులను చేరుకోవడానికి రెస్క్యూ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
సోమవారం ఆరు అడుగుల వెడల్పాటి పైపులైన్ ద్వారా వారికి ఆహారం అందించారు. చిక్కుకుపోయిన కార్మికులు ఎలా ఉన్నారో తెలుసుకునేందుకు టన్నెల్‌లోకి ఓ కెమెరాను పంపిన అధికారులు దాని ద్వారా వీడియో తీశారు. కార్మికులందరూ క్షేమంగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
తాము బాగానే ఉన్నామని, పరిస్థితులను తట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వారు చెప్పారు. అధికారులు.. వాకీ టాకీలతో కార్మికులతో మాట్లాడారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా ఉత్తరకాశీ సొరంగం రెస్క్యూ ఆపరేషన్ గురించి ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఆయన సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు.
“మొదటి సారిగా ఉత్తరకాశీలోని సిల్క్యారాలో నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిన ఘటనలో శిథిలాల్లో చిక్కుకున్న కార్మికుల విజువల్స్ బయటకొచ్చాయి. కార్మికులందరూ పూర్తిగా సురక్షితంగా ఉన్నారు, త్వరలో వారిని క్షేమంగా బయటకు తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తున్నాము,” అని ఆయన తెలిపారు.
కాగా, సోమవారం రాత్రి కార్మికులకు పైపు ద్వారా గ్లాస్ సీసాల్లో కిచిడీ పంపించారు. అంతకుముందు డ్రైఫ్రూట్స్ మాత్రమే అందించారు. ఈ ఉదయం వారికోసం వేడివేడి అల్పాహారం కూడా సిద్ధం చేశారు. త్వరలో వారికి మొబైల్ ఫోన్లు, చార్జర్లను కూడా పంపిస్తామని రెస్క్యూ ఆపరేషన్ ఇన్‌చార్జి కల్నర్ దీపక్ పాటిల్ చెప్పారు.
నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఐడీసీఎల్) డైరెక్టర్ అన్షు మనీష్ ఖల్ఖో మాట్లాడుతూ కార్మికులు ఎలా ఉన్నారో చూడడానికి పైప్‌లైన్ ద్వారా కెమెరాలను పంపిచినట్లు చెప్పారు. బయటికొచ్చిన విజువల్స్‌లో సొరంగంలో చిక్కుకున్న కార్మికులు సురక్షితంగా ఉండడంతో వారి కుటుంబసభ్యులకు పెద్ద ఊరట లభించింది.
More Stories
ఒకే దేశం- ఒకే ఎన్నిక జేపీసీ గడువు పొడిగింపు!
నాపై సెటైర్లు వేయడానికి కమ్రా సుపారి తీసుకున్నట్లుంది
ముస్లిం రేజర్వేషన్లపై డికె వ్యాఖ్యలపై పార్లమెంట్ లో దుమారం