25 నుంచి తెలంగాణాలో ప్రధాని మోదీ ప్రచారం

 
* 27న తిరుమలలో శ్రీవారి దర్శనం
 
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో బీజేపీ ప్రచారాన్ని ఉధృతం చేస్తోంది. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జెపి నడ్డా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, దేవేంద్ర ఫడ్నవిస్, హిమంత్ బిస్వా శర్మ తదితరులు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.  మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల పాటు తెలంగాణలో పర్యటించి బీజేపీ తరపున ప్రచారం నిర్వహించేందుకు వస్తున్నారు.
ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. నవంబర్ 25న మహేశ్వరం, కామారెడ్డి సభల్లో పాల్గొననున్నారు.  నవంబర్ 26న తూప్రాన్, నిర్మల్, 27న మహబూబాబాద్, కరీంనగర్ ప్రచార సభల్లో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం హైదరాబాద్‌లో జరిగే భారీ రోడ్‌షోకు హాజరవుతారు. 28తో తెలంగాణాలో ప్రచార గడువు ముగియనున్నది.
ప్రధాని మోదీతో ప్రచార సభల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఈ సమయంలోనే తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రధాని రానున్నట్లు తెలుస్తోంది. ప్రాధమికంగా అందిన సమాచారంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 26 సాయంత్రం తిరుమలకు చేరుకొని, 27న  శ్రీవారిని దర్శించుకుంటారని సమాచారం.