ఎన్నికల బరిలో ఉన్న 62 శాతం అభ్యర్థులు నేర చరితులే!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచిన మొత్తం అభ్యర్థుల్లో 62 శాతం మంది నేర చరిత్ర కలిగిన వారేనని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ వెల్లడించింది. నవంబర్ 30న జరగనున్న ఎన్నికలకు ఇటీవలే పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లతో పాటు సమర్పించిన అఫిడవిట్ ల ఆధారంగా అభ్యర్థుల నేర చరిత్రను వెలుగులోకి తెచ్చింది ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్.

ఈసారి ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలు తరఫున మొత్తం 360 మంది బరిలో ఉన్నారు. కాగా అందులో 226 మంది అభ్యర్థులపై నేర చరిత్ర ఉన్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. రాజకీయ పార్టీలు గెలుపు గుర్రాల వేటలో నేర చరిత్ర కలిగిన అనేక మందికి టిక్కెట్లు కేటాయించినట్లు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పేర్కొంది.

అయితే ఇలాంటి నేర చరిత్ర కలిగిన అభ్యర్థులకు రాజకీయాల్లో అవకాశం కల్పించడం ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదని ఆ సంస్థ ప్రతినిధులు విచారం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు నియమాలను రాజకీయ పార్టీలు పక్కన పెట్టి నేర చరిత్ర గల నేతలకు టిక్కెట్లు ఇచ్చారని ఆ సంస్థ తెలిపింది. దేశంలోనే నేర చరిత్ర కలిగిన ఎమ్మెల్యేలలో తెలంగాణ టాప్ లో ఉందని కూడా ఆ సంస్థ స్పష్టం చేసింది.

బీఆర్ఎస్ పార్టీలో మంత్రి గంగుల కమలాకర్ పై 10 కేసులు, వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పై 9 కేసులు, మంత్రి సబితా ఇంద్రారెడ్డి పై 5 కేసులు, ఎమ్మెల్యే సైదిరెడ్డి పై 5 కేసులు ఉన్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డిపై అత్యధికంగా 89 కేసులు ఉన్నాయి. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై 20 కేసులు ఉన్నాయి. 

ఇక గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ పై కూడా అత్యధికంగా 89 కేసులు ఉన్నాయి. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై 59 కేసులు,  ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావుపై 55 కేసులు, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుపై 20 కేసులు ఉన్నట్లు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వెల్లడించింది.