మోసపూరిత వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ 

మోసపూరిత వాగ్ధానాలతో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీపై ప్రజలు ఆలోచించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. మంగళవారం నాడు కూకట్‌పల్లిలో బిజెపి మద్దతు ఇస్తున్న జనసేన అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ  తెలంగాణ రాష్ట్రంలో మార్పు అనేది అవసరమని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. 

 ఇక్కడ లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి తొమ్మిదేళ్లు అధికారంలో ఉండి కేసీఆర్ మాట తప్పారని ఆమె విమర్సించారు. ఒక్కసారి టీఎస్పీపీస్సీ నోటిఫికేషన్ ఇచ్చి, అదే కార్యాలయం ద్వారా పేపర్ లీక్ అవ్వటంతో అభ్యర్థులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని  పురంధేశ్వరి మండిపడ్డారు.

బీజేపీ మిత్రపక్షమైన జనసేన పార్టీకి చెందిన అభ్యర్థి ప్రేమ్ కుమార్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ప్రేమ్ కుమార్‌‌ని గెలిపిస్తే నియోజక వర్గంలో అభివృద్ధి పనులకు కేంద్రం మద్దతు ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు. బీజేపీ, జనసేన పార్టీలు ప్రజాసమస్యలపై గళం విప్పి పోరాడే పార్టీలని పేర్కొంటూఈ పార్టీల అభ్యర్థులను ఆదరిస్తే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని ఆమె తెలిపారు.

‘‘అసలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. పేద ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని గొప్ప వాగ్దానాలు చేశారు.. కానీ ఆ హామీ నెరవేర్చలేదు. జీహెచ్ఎంసీలో 9 లక్షల అప్లికేషన్స్ ఉండగా కేవలం 50 వేల ఇళ్లను మాత్రమే నిర్మించారు. పేదవాడి సొంతింటి కళ కలగానే మిగిలిపోయింది” అంటూ ఆమె విమర్శలు గుప్పించారు.

పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీల్లో ఉపాధ్యాయులకు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని ఎందుకు భర్తీ చేయటంలేదని చెబుతూ ఏ హామీ నెరవేర్చారనేది చెప్పి కేసీఆర్ ఎన్నికల్లో ఓటు అడగాలని ఆమె స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నీటి మూటలుగా మారిపోయాయని చెబుతూ నియోజకవర్గంలో ట్రాఫిక్, మౌలిక వసతుల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆమె చెప్పారు.  

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే తెలంగాణ రాష్ట్రంలో రెండు పడకల ఇళ్లు నిర్మించారని చెబుతూ కేంద్ర ప్రభుత్వం దేశంలో 4 కోట్ల ఇళ్లను మంజూరు చేసిందని, అందులో మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిందని ఆమె తెలిపారు. దళితులకు మూడు ఎకరాల భూమి హామీ కూడ నెరవేర్చలేదని, పైగా  దళిత బంధు పథకంలో అవినీతి జరుగుతోందని స్వయంగా కెసిఆర్ ఒప్పుకున్నారని ఆమె గుర్తు చేశారు.