ఒక్క సైగ చేస్తే పోలీసులంతా పరిగెత్తాల్సిందే… ఒవైసి

ఒక్క సైగ చేస్తే పోలీసులంతా పరిగెత్తాల్సిందే… ఒవైసి
 
* అక్బ‌రుద్దీన్ ఓవైసీపై కేసు న‌మోదు
 
“నేను చంద్రాయణగుట్ట నియోజకవర్గ ప్రజలకు ఒక్క సైగ చేస్ పోలీసులంతా ఇక్కడి నుంచి పరుగులు పెడతారు. పరుగెత్తించి చూపించమంటారా?” అంటూ పోలీసులను హెచ్చరించిన  ఎంఐఎం నేత, చంద్రాయణగుట్ట ఎంఐఎం అభ్యర్థి అక్బ‌రుద్దీన్ ఓవైసీపై బుధవారం సంతోష్ న‌గ‌ర్‌లోని పోలీసు స్టేష‌న్‌లో కేసు నమోదయింది. “చంద్రాయణగుట్ట నియోజకవర్గంలో నాకు పోటీ అభ్యర్థులు ఎవరూ లేరు కాబట్టి ఈ ఇన్‌స్పెక్టర్‌ అభ్యర్థిలా ఇక్కడి వచ్చి నన్ను ప్రశ్నిస్తున్నారా?” అని ఎద్దేవా చేశారు. దమ్ముంటే వచ్చి ఎన్నికల్లో పోటీ చేయాలంటూ పోలీస్‌ అధికారికి సవాల్‌ విసిరారు.
 
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియోలో వైరల్ అయింది. ఐపీసీలోని 353(విధుల్ని అడ్డుకోవ‌డం)తో పాటు ఇత‌ర కొన్ని సెక్ష‌న్ల కింద కేసును న‌మోదు చేసిన‌ట్లు డీసీపీ రోహిత్ రాజు పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం రాత్రి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న అక్బ‌రుద్దీన్‌కు పోలీసులను ఈ విధంగా హెచ్చరించడంతో  కేసు నమోదు చేశారు. 
 
ల‌లితాబాగ్‌లో ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న స‌మయంలో ప్రచారం నిర్వహించటానికి సమయం ముగిసిందని సంతోష్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.శివచంద్ర అక్బరుద్దీన్‌ ఒవైసీకి చెప్పారు. దీంతో ఒక్కసారిగా అక్బరుద్దీన్‌ ఆగ్రహంతో ఊగిపోయారు. ప్రచార సమయానికి ఇంకా ఐదు నిమిషాలు ఉందని, ముందే ప్రచారాన్ని ఎలా ఆపుతారంటూ ఇన్‌స్పెక్టర్‌పై మండిపడ్డారు. 
 
వేదికపై నుంచి సీఐ వైపు వెళ్లి తీవ్రంగా హెచ్చరించారు. ఒక‌వేళ స‌మ‌యం రాత్రి 10.01 నిమిషం దాటితే అప్పుడు ఆ స‌భ‌ను అడ్డుకునే హ‌క్కు ఉంటుంద‌ని, ఇంకా అయిదు నిమిషాలు ఉన్నా ఎందుకు పోడియం వ‌ద్ద‌కు వ‌చ్చార‌ని ప్రశ్నించారు.  తనను ఆపే ధైర్యం ఎవరికీ లేదు.. ఉండబోదని అక్బరుద్దీన్‌ తెగేసి చెప్పారు. అంతటి ఆగకుండా తాను చంద్రాయణగుట్ట నియోజకవర్గ ప్రజలకు ఒక్క సైగ చేస్తే పోలీసులంతా ఇక్కడి నుంచి పరుగులు పెడతారని హెచ్చరించారు. పరుగెత్తించి చూపించమంటారా అని పోలీసులను ఉద్దేశించి ఆయన సవాల్ చేశారు.
 
‘మీ దగ్గర గడియారం లేకపోతే నా వాచ్‌ మీకిస్తా టైమ్‌ చూసుకోండి. నాపై తూటాలు, కత్తులతో దాడులు జరిగాయి. అంతమాత్రాన అలసిపోయానని అనుకుంటున్నారా? దయచేసి నన్ను రెచ్చగొట్టొవద్దు. పెద్ద ఏదో చెప్పడానికి వచ్చి నిలబడ్డావ్‌.. ఐదు నిమిషాలు ఇంకా సమయం ఉంది. ఖచ్చితంగా నేను మాట్లాడి తీరుతా. నన్ను ఆపే ధైర్యం ఎవరికీ లేదు.. ఉండబోదు’ అని స్పష్టం చేశారు.
 
ఈ వీడియోను తెలంగాణ బీజేపీ తమ ట్విట్టర్ ఖాతా ఎక్స్‌లో షేర్ చేశారు. గత దశాబ్దాలుగా, కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతుతో ఐంఐఎం ఒక నేర సంస్థగా మారిందని బీజీపీ మండిపడింది. హైదరాబాద్ పాతబస్తీ మెుత్తం నాశనం చేసిందన్నారు. వారికి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని ప్రజలకు పిలుపిచ్చారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. అక్బరుద్దీన్ చేసిన ఈ చర్యకు బుల్డోజర్ రియాక్షన్ ఉంటుందని హెచ్చరించారు. దుర్భషలాడటంలో, ముఖ్యంగా శాంతిభద్రతల పట్ల తమకు గల గౌరవాన్ని ప్రదర్శించడంలో ఎంఐఎం నేతలు పిహెచ్ డి పొందారని బిజెపి ఎమ్యెల్యే రాజా సింగ్ ఎద్దేవా చేశారు.