కాంగ్రెస్ శుష్క వాగ్దానాలతో మోసపోవద్దు

కర్ణాటకలో శుష్కవాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తెలంగాణాలో కూడా అదే ప్రయత్నం చేస్తున్నదని చెబుతూ ఆ పార్టీ శుష్క వాగ్దానాలతో మోసపోవద్దని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్ నేత బిఎస్ యడియూరప్ప హెచ్చరించారు. బిజెపి అభ్యర్థులకు ప్రచారం చేసేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్ణాటకలో ఐదు వాగ్దానాలు చేస్తే, తెలంగాణాలో కాంగ్రెస్ ఆరు వాగ్దానాలు చేస్తుందని చెప్పారు.
 
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా  వాగ్దానాల అమలులో విఫలమైందని, కర్ణాటక ప్రజలను మోసం చేసిన సిద్ధరామయ్య ప్రభుత్వం దివాలా దిశగా నడుస్తుందని ధ్వజమెత్తారు. గ్రాడ్యుయేట్ లకు రూ 3,000, డిప్లొమా హోల్డర్లకు రూ 2,500 చొప్పున చెల్లిస్తామన్న నిరుద్యోగ భృతిని ఇప్పటివరకు చెల్లించడం లేదని ఆయన చెప్పారు.
 
గృహలక్ష్మి పధకం క్రింద బీపీఎల్ మహళలు అందరికి ఇస్తామన్న రూ 2,000 ఇంకా అందరికి అందటం లేదని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని 1.16 కోట్ల మంది లబ్ధిదారులు ఈ పధకం కింద నమోదు చేసుకోవడంతో నెలకు రూ 2,300 కోట్లు అవసరమని, ఆగష్టులో ప్రారంభించి గత నాలుగు నెలల్లో రూ 9,200 కోట్లు చెల్లించాల్సి ఉండగా రూ 2,110 కోట్లు మాత్రమే చెల్లించారని ఆయన వెల్లడించారు.
 
ఇక బస్సులలో మహిళలకు ఉచిత రవాణాకు సంబంధించి ప్రతి నెల 84 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తుండగా, కెఎస్ఆర్టిసికి ప్రభుత్వం బకాయిలు చేయించడం లేదని, పైగా గ్రామీణ ప్రాంతాలలో ఆర్టిసి బస్సులను కుదించివేస్తున్నారని ఆయన విమర్శించారు. గృహజ్యోతి పధకం క్రింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ను ప్రకటించి, కేవలం 200 కన్నా తక్కువ యూనిట్లు వినియోగించినవారికి మాత్రమే ఇస్తున్నారని ఆయన తెలిపారు.
మరోవంక డిస్కోమ్ లకు ప్రభుత్వం బకాయిలు చెల్లించడం లేదని చెబుతూ మొత్తం రూ 8,506 కోట్లు చెల్లించాల్సి ఉండగా రూ 1,500 కోట్లు మాత్రమే చెల్లించిందని ఆయన వివరించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు  యడియూరప్ప చెప్పారు. తెలంగాణ ప్రజలు ఈసారి బీజేపీకి పట్టం కట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
 
బిసిని సీఎం చేస్తానంటే అవహేళన చేస్తున్నారు

ఇలా ఉండగా, బిజెపి బిసిని ముఖ్యమంత్రి చేస్తానంటే బిఆర్ఎస్ అవహేళన చేస్తుందని కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఈనెల 25, 26, 27 తేదీల్లో ప్రధాని మోదీ తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని చెప్పారు. మోదీ ప్రచారంతో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బిజెపికి సానుకూల వాతావరణం ఏర్పడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

బిసిని సీఎం చేస్తానంటే బిఆర్ఎస్ అవహేళన చేస్తుందని పేర్కొంటూ దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర హామీ ఏమైందని ఆయన నిలదీశారు. బిసిని సిఎం చేసే దమ్ము కాంగ్రెస్, బిఆర్ఎస్ కు ఉందా? అని ఆయన ప్రశ్నించారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ బీసీలను అవమానించే విధంగా మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ తెలంగాణను సర్వనాశనం చేసిందని పేర్కొంటూ ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ కు ప్రజలు అవకాశం ఇవ్వరని కిషన్ రెడ్డి హెచ్చరించారు.