నాడు శివాజీ లేకపోతే నేడు హిందువులుండేవారు కాదు

గజానన్ భాస్కర్ మహందలే  గారు ఆంగ్లంలో రచించిన ‘సేవియర్ ఆఫ్ హిందూ ఇండియా’ అనే పుస్తకాన్ని తెలుగులోకి = కేశవనాథ్  ‘హిందూ జనరక్షకుడు శివాజీ ‘ పేరుతో  అనువాదం చేశారు. సంవిత్ ప్రకాశన్ వెలువరించిన ఈ  పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం 18 నవంబర్ , 2023 భాగ్యనగర్ లో నిర్వహించారు.

హబ్సిగూడలోని సుప్రభాత్ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ రామలింగారెడ్డి పాల్గొంటూ ఛత్రపతి శివాజీ  కనుక లేకపోతే ఈనాడు హిందువులనేవాళ్లు ఉండేవారు కాదని చెప్పారు. మరాఠా సామ్రాజ్యం ఆఫ్ఘనిస్తాన్ వరకు విస్తరించిందని , శివాజీ మహారాజ్ సైనిక నిర్వహణ, పరిపాలన దక్షతకు ప్రతీక అని చెప్పారు. హిందువులు జాతీయ వాద దృక్పథం కలిగి ఉండాలని ఈనాడు హిందూ సమాజాన్ని ఎదుర్కొంటున్న శక్తుల నుంచి హిందూ సమాజాన్ని కాపాడుకోవాలని చెప్పారు.

‘సుందర శివ చరితం’ పుస్తక రచయిత , ఐటి నిపుణులు కేవీ సుబ్రహ్మణ్యం గౌరవ అతిథిగా మాట్లాడుతూ హిందూ సామ్రాజ్య స్థాపకుడు, మహనీయుడు అయిన శివాజీ గురించి మన  పాఠ్యాంశాలలో కేవలం ఒక పేరాగ్రాఫ్ కి పరిమితం కావడం దురదృష్టకరమని అన్నారు.  త్యాగరాజ స్వామి కాలంలో మరాఠా రాజైన ‘మహారాజ సర్ఫోజి’ తంజావూరు పాలకులని, వారు కర్ణాటక సంగీతాన్ని ఎంతో ఆదరించారని చెప్పారు. తెలుగువారు వారి చరిత్రను మర్చిపోయారని, మహారాణి రుద్రమ గురించి ప్రతాపరుద్రుడు గురించి సరైన చారిత్రాత్మక గ్రంథాలు లేవని వారి ఘనతను మనం గుర్తు పెట్టుకోవాలని చెప్పారు.

మహారాష్ట్రీయులు వారి  రాజులను, వారి జీవిత గాథలను, చరిత్రను  అనేక పుస్తకాలలో పొందుపరిచారని చెప్పారు. శివాజీ గారి స్ఫూర్తితో ప్రేరేపితమైన ఛత్రసాల్ మహారాజు వంటి ఎందరో మరాఠా రాజులు ఎన్నో సంవత్సరాల వరకు మరాఠా రాజ్యాన్ని పరిపాలించారు.భిల్ జాతికి చెందిన గోకుల్ జాట్ అనే వీరుడ్ని ఔరంగాజేబు చంపినప్పుడు అతని కొడుకు తన తండ్రిని చంపినందుకు ప్రతీకారంగా  తాజ్ మహల్ వెండి ముఖద్వారాలను  తీసుకుపోయాడు. అది ఆ రోజుల్లో మరాఠాలకున్న క్షాత్ర స్ఫూర్తి. సిద్ధి జోహర్ శివాజీ కోట్లను ముట్టడించి బ్రిటిష్ తో మైత్రి చేసుకున్నాడు. అమెరికా ఒసామా బిన్ లాడని బంధించిన రీతిని చూసి కొంతమంది రచయితలు అమెరికా  శివాజీ నుంచి స్పూర్తి పొంది నట్టుగా అనుకున్నారు. సుబ్రహ్మణ్యం గారు మనకి షయిస్థా ఖాన్ కథని వివరించారు.

 కేశవ నాథ్  ప్రసంగిస్తూ  మహందలే , జదునాథ సర్కార్,  ఎంతోమంది పాశ్చాత్య రచయితలు  శివాజీ మహారాజ్  చరితను  సవిస్తరంగా వ్రాశారని అన్నారు. కానీ మహందలే పుస్తకపు ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఇది శివాజీ మహారాజు హిందూ సామ్రాజ్య స్థాపనకు పూర్వం అప్పటి సమాజంలో ఇస్లాం పరిపాలన ఎట్లా ఉండేదో, శివాజీ మహారాజు హిందూ జనరక్షకుడుగా ఎట్లా ఎదిగాడో మనకి తెలియజేయడమని అన్నారు.

ఆనాటి ముస్లిం పాలకులు హిందువులపై విధించిన జిజియా పన్ను గురించి, వారు గ్రామాలను దోచుకున్న విధానం గురించి ఈ పుస్తకంలో తెలుస్తుంది.  ఇలాంటి అకృత్యాలకు కారణమైన ఇస్లాం మత సిద్ధాంతాల వల్ల ప్రపంచానికి ఎప్పటికీ ముప్పే అని మహందలే  పుస్తకం  ముందుమాటలో చెప్పారు.ఈనాటికీ  ప్రపంచంలో  ఇటువంటి ఇస్లామిక్ దాడులు జరుగుతూనే ఉన్నాయి.

ఈ పుస్తకంలో సగభాగం శివాజీ మహారాజు హిందూ సామ్రాజ్య స్థాపనకు పూర్వం ఉన్న పరిస్థితుల గురించి వివరిస్తే , మిగతా సగభాగం శివాజీ మహారాజు ఆనాటి ఇస్లామిక్ రాజుల ఆగడాలను, అరాచకాలను ఎదిరించి హిందూ సామ్రాజ్య స్థాపన ఎలా చేశాడో మనకి వివరిస్తుంది. అంతేకాక ఆ నాడుహిందువులపై బలవంతంగా విధించిన జిజియా పన్ను గురించి,  హిందువులను బానిసలుగా మార్చిన విధానం గురించి, హిందూ స్త్రీల మీద చేసిన అరాచకాల గురించి   ఈ పుస్తకంలో వివరించడం జరిగింది.  హిందువులకి బతికే మార్గమే లేనప్పుడు ఎలా శివాజీ మహారాజ్ ఆ ఇస్లాం దుష్ట పరిపాలనని ఎదుర్కొని హిందూ జనరక్షకుడుగా  , హిందూ సామ్రాజ్య స్థాపన  చేశాడో  వివరిస్తుంది. శివాజీ  మహోన్నత పరిపాలనాదక్షుడు.  ఆనాడు అమలులో ఉన్న రాజ్యపాలన పద్ధతులు, పదాలను పూర్తిగా దేశీయంగా మార్చాడు అని వివరించారు.

కళ్యాణ చక్రవర్తి ,CSIS దక్షిణాపథ స్టడీస్, శైలజ , సంవిత్ ప్రకాశన్  క్లుప్తంగా వారి వారి సంస్థల గురించి వివరించారు. అనేక మంది పుస్తకాభిమానులు , రచయితలు ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.