చంద్రబాబుకు బెయిల్‌ వైసిపి ప్రభుత్వంకు ఎదురు దెబ్బ!

* తీర్పుపై ఏఏజీ అసంతృప్తి… సుప్రీంకోర్టుకు ఏపీ సిఐడి 
 
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడుకు ఇటు, అటుగా రెగ్యులర్ బెయిల్ లభిస్తుందని అందరూ భావిస్తున్నప్పటికీ, ఏపీ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేస్తూ ఇచ్చిన తీర్పు వైసిపి ప్రభుత్వంకు కలవరం కలిగిస్తున్నట్లు తెలుస్తున్నది.  బెయిల్ పిటీషన్ పరిధిలోకి రాకపోయినప్పటికీ ఆయనపై సిఐడి చేస్తున్న ఆరోపణలకు తగు ఆధారాలు లేవనే రీతిలో, చంద్రబాబు న్యాయవాదులు చేస్తున్న వాదనలను బలపరిచే రీతిలో న్యాయమూర్తి పేర్కొనడంతో ఒక విధంగా విస్మయంకు గురైనట్లు చెబుతున్నారు. 
 
అందుకనే, న్యాయస్థానం తీర్పుపై సీఐడీ సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.  ప్రాజెక్టులో దుర్వినియోగమైనట్లు చెబుతున్న సొమ్మును టీడీపీ బ్యాంకు ఖాతాలకు మళ్లించినట్లు ఎలాంటి ఆధారాలూ లేవని కోర్టు తేల్చిచెప్పడం పరోక్షంగా రాజకీయ కక్షసాధింపు చర్యలలో భాగంగా ఈ అరెస్ట్ జరిగిన్నట్లు టిడిపి చేస్తున్న వాదనలకు బలం చేకూరినట్లు అవుతుంది. 
బెయిల్‌ మంజూరు విషయంలో సుప్రీంకోర్టు పదేపదే ఇచ్చిన ఆదేశాల పరిధిని హైకోర్టు అతిక్రమించిందని పేర్కొంటూ ఈ తీర్పు పట్ల అదనపు అడ్వకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి  తన అసంతృప్తిని కోర్టుకే నివేదించారు. పిటిషనర్లు వాదించని, వారు కోరని అంశాల్లోకి కూడా హైకోర్టు వెళ్లేందుకు ప్రయత్నించిందని, హైకోర్టు తన అధికారపరిధిని అతిక్రమిస్తూ తీర్పులో వ్యాఖ్యానాలు చేసిందని తెలిపారు.

కేసు మెరిట్స్‌ గురించి, ఔచిత్యం గురించి, ఆధారాల దర్యాప్తులో లోపాలుగురించి బెయిల్‌ పిటిషన్‌ సమయంలోనే వ్యా్ఖ్యానించిందని పేర్కొంటూ సీఐడీ కోరిన సమాచారాన్ని ఇప్పటివరకూ టీడీపీ ఇవ్వనే లేదని చెప్పారు.  కేసుల మూలాల గురించి హైకోర్టు తీర్పులో పేర్కొనడం ట్రయల్‌ కోర్టు అధికారాలను హరించడమే అని స్పష్టం చేశారు.

ఇది చాలా ఆందోళనకరమైన విషయం అని పేర్కొంటూ బెయిల్‌ దశలోనే న్యాయ పరిధిని మీరడమే అవుతుందని తెలిపారు. బెయిల్‌ సందర్భంగా సీఐడీ అభ్యంతరాలపై తిరిగి పిటిషనర్‌ ఎలాంటి వాదనలు చేయలేదని గుర్తు చేశారు. దర్యాప్తు సమయంలో బెయిల్‌ పిటిషన్‌ సందర్భంగా హైకోర్టు తీరు అనూహ్యమైనదని చెప్పారు.

 
కాగా, సిఐడి తన ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ప్రాథమిక ఆధారాలనూ ప్రాసిక్యూషన్‌ కోర్టుకు సమర్పించలేకపోయిందని కూడా హైకోర్టు పేర్కొంది. చంద్రబాబుకు రిమాండ్‌ విధించాలని కోరడానికి ముందే ఇలాంటి తీవ్రమైన ఆరోపణలకు బలమైన ఆధారాలను సీఐడీ చూపించి ఉండాల్సిందని అభిప్రాయపడింది.
 
దుర్వినియోగమైన నిధులు టీడీపీ ఖాతాల్లోకి వచ్చాయనే నిర్ణయానికి వచ్చేందుకు ఆధారాలేమిటో సీఐడీ చూపించకపోవడం దర్యాప్తులో లోపంగా భావిస్తున్నామని  న్యాయమూర్తి జస్టిస్‌ టి.మల్లికార్జునరావు తన తీర్పులో ప్రస్తావించారు. ఈ కేసులో ఇతర నిందితులందరూ బెయిల్‌పై ఉన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 
 
జడ్‌ ప్లస్‌ కేటగిరీలో ఉన్న చంద్రబాబు విదేశాలకు తప్పించుకుపోయే ప్రమాదం లేదని, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రస్తావన ఉత్పన్నమే కాదని కూడా న్యాయమూర్తి స్పష్టం చేయడం గమనార్హం. న్యాయమూర్తి తీర్పు పూర్తి పాఠం గమనిస్తే అరెస్ట్ కు ప్రాధమిక ఆధారాలు లేవన్న సంకేతం ఇచ్చినట్టు అవుతుందని వైసిపి ప్రభుత్వం ఆందోళన చెందుతుంది.
 
స్కిల్‌ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం విడుదల చేసిన రూ.371 కోట్లలో రూ.241 కోట్లను షెల్‌ కంపెనీల ద్వారా సీమెన్స్‌, డిజైన్‌ టెక్‌ సంస్థలు మళ్లించాయని సీఐడీ వాదిస్తోంది. అలాంటప్పుడు 2 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం సాధ్యమేనా అని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారని పేర్కొంటూ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, క్లస్టర్లలో మౌలిక సదుపాయాలు లేవని ప్రాసిక్యూషన్‌ కూడా చెప్పడం లేదని న్యాయమూర్తి గుర్తు చేశారు. 
 
 అక్రమ లావాదేవీలలో చంద్రబాబు పాత్ర ఉన్నట్లు ఆదాయ పన్ను శాఖ తేల్చిందని సీఐడీ చెబుతున్నప్పటికీ దానిని బలపరిచే ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఆర్థిక కార్యదర్శి అభ్యంతరాలు లేవనెత్తినప్పుడు నిధులు విడుదల చేయాలని ఆదేశించే అధికారం సీఎంకు లేదని ప్రాసిక్యూషన్‌ వాదించడం లేదని గుర్తు చేసింది.