బీజేపీ అధికారంలోకి వస్తె దారుసలాం స్వాధీనం చేసుకుంటాం

బీజేపీ అధికారంలోకి వస్తె మజ్లిస్ కు ఇచ్చిన దారుసలాంతో పాటు తెలంగాణ ఆస్తులను న్యాయపరంగా స్వాధీనం చేసుకుంటామని బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ ఛార్జ్ పి మురళీధరరావు వెల్లడించారు. తెలంగాణలో రజాకార్ల హెడ్ క్వార్టర్ గా దారుసలాం పని చేస్తోందని మురళీధర్‌ రావు ఆరోపించారు. తెలంగాణ ప్రజల ఆస్తి దారుసలాంను 1969లో సల్లాఉద్దీన్ ఓవైసీకి ఆ నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గిఫ్ట్ గా ఇచ్చారని ఆరోపించారు.
 
ప్రజల ఆస్తి అయిన దారుసలాంను మజ్లీస్ కి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని పేర్కొంటూ మతతత్వ రాజకీయాలు నడుపుకునెందుకు దరుసలాంను ఇచ్చింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.  నిజాం, కాశీం రిజ్వీ వారసత్వ రాజకీయాలు నడుపుకునేందుకు కార్యాలయం, భద్రత ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? అని నిలదీశారు. 
 
అది దేశ వ్యతిరేక చర్య కాదా? అని పేర్కొంటూ అమరవీరుల స్థూపం వద్ద రాహుల్ గాంధీ క్షమాపణ ఎందుకు కోరలేదని ప్రశ్నించారు.  నిజాం, కాంగ్రెస్ చేసిన ద్రోహాలను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని స్పష్టం చేశారు.  బిఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని దొంగలించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోందని చెబుతూ కాంగ్రెస్ గెలిస్తే బీఅర్ఎస్ గెలిచినట్టేనని మురళీధరరావు ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న వారిలో 21మందిని బీఆర్ఎస్ పోటీకి నిలబెట్టి వారికి డబ్బులు ఇస్తుందని ఆయన ఆరోపించారు. తెలంగాణలో బిఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమని చెబుతూ మజ్లిస్, కాంగ్రెస్, బీఅర్ఎస్ లక్ష్యం బీజేపీని ఓడించడమని పేర్కొన్నారు. ఈ మూడు పార్టీల ఉనికిని బీజేపీ ప్రశ్నిస్తుందని చెప్పారు.

వ్యవసాయక విప్లవాన్ని తీసుకువచ్చినట్లు బీఅర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారని, అయితే కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు కలగకుండా అనేక కార్యక్రమాలు చేపట్టిందని ఆయన గుర్తు చేశారు. రైతాంగానికి కనీస మద్దతు ధరతో పాటు క్వింటాల్ కు వెయ్యి రూపాయలు బోనస్ ఇస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొందని తెలిపారు. 

కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇచ్చిన వాగ్దానాల కన్నా ఇది విలువైందని ఆయన చెప్పారు. ఉత్పత్తి, దిగుబడికీ బోనస్ ఇవ్వడం ద్వారా కౌలు రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు.  సరికొత్త హరిత విప్లవాన్ని తీసుకువచ్చే విధంగా బీజేపీ ఎన్నికల ప్రణాళిక రూపొందించినట్టు చెప్పారు.  నూనె గింజలు, పప్పు దినుసులు, చిరుధాన్యాల్లో ఆత్మ నిర్భరత రావాలని, సాగు చేసే రైతుకు నష్టం రాకూడదని ఆయన పేర్కొన్నారు. మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేస్తామని, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక మార్క్ ఫెడ్ బలహీన పడిందని మురళీధరరావు విమర్శించారు.

డబుల్ ఇంజన్ సర్కారు వస్తే తెలంగాణ వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందని, గ్రామాల్లో ఆవులు లేకపోవడం వల్ల రసాయనిక ఎరువుల వినియోగం పెరుగుతుందని తెలిపారు. రసాయనిక ఎరువుల వల్ల నీరు కలుషితమై అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, గ్రామీణ ఆర్థిక, వ్యవసాయ పెరుగుదలలో ఆవు చాలా ముఖ్యమని చెబుతూ  రైతులకు ఉచితంగా ఆవును ఇస్తామన్న ఏకైక పార్టీ బీజేపీ అని స్పష్టం చేశారు.