తెలంగాణను భ్రష్టు పట్టించిన బిఆర్ఎస్

కెసిఆర్ బంగారు తెలంగాణ అని చెబుతున్నారని, కానీ ఉన్న బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించారు. మంగళవారం జూబ్లీహిల్స్‌, ఉప్పల్ తదితర నియోజకవర్గాలలో ఆమె బిజెపి అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ  తొమ్మిదిన్నరేళ్లు పాలించిన బిఆర్ఎస్ తెలంగాణను భ్రష్టుపట్టించిందని ధ్వజమెత్తారు.

హైదరాబాద్ లాంటి నగరాన్ని,  నైపుణ్యం ఉన్న‌ యువతను ఉపయోగించుకోవటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చెబుతూ కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులు రాబోయే తరాలకు భారంగా మారుతోందని ఆమె హెచ్చరించారు.  కేసీఆర్ ఎన్మికల‌ హామీ 3,116/- నిరుద్యోగ భృతి ఎక్కడ? అని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో 6వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆమె తెలిపారు.

ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని పేర్కొంటూ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని మాట తప్పారని ఆమె విమర్శించారు. దళిత ముఖ్యమంత్రి సంగతి దేవుడెరుగు. డిప్యూటీ సీఎం రాజయ్యను ఆరు నెలలకే తొలగించారని ఆమె గుర్తు చేశారు. ఒక్క ప్రాజెక్టును కూడా సరిగ్గా పూర్తి చేయలేదని ఆరోపించారు. ప్రజలకు ఉపయోగపడే పని ఏదీ బిఆర్ఎస్ చేయడం లేదని ఆమె మండిపడ్డారు.

కుటుంబ పాలనా? అవినీతికి పాల్పడిన ప్రభుత్వం మనకు కావాలా? ప్రజలు ఆలోచించాలని కేంద్ర మంత్రి కోరారు. కేంద్రం పెట్రోల్ ధరలు తగ్గించినా కెసిఆర్ వ్యాట్ తగ్గించకుండా బిజెపిపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో అత్యధిక ద్రవ్యోల్భణం ఉన్న రాష్ట్రం తెలంగాణ అని ఆమె తెలిపారు.

జూబ్లీహిల్స్‌లో ఎన్నికల ప్రచారం చేబడుతూ ‘‘ఎన్నికల ప్రచారంలో నా మొదటి సమావేశం ఇది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎడ్యుకేటెడ్, ప్రొఫెషనల్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రజలు ఉంటారు. తెలంగాణలో ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైనవి. ఈ ఎన్నికల ప్రాముఖ్యత ప్రజలకు తెలపాలి” అని కోరారు.  కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేయటంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందని స్పష్టం చేస్తూ కేసీఆర్ సర్కార్ అవినీతిపై విచారణ జరిపిస్తామని ఆమె స్పష్టం చేశారు. నీళ్లు.. నిధులు.. నియామకాల పేరుతో ఏర్పాటైన రాష్ట్రంలో బీఆర్ఎస్ హామీలేవి నెరవేరలేదని ఆమె చెప్పారు.

 కానీ ప్రధాని మోదీ  అద్భుతంగా పాలిస్తున్నారని చెబుతూ కరోనా సమయంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండ, రాష్ట్రాలపై భారం లేకుండా  ప్రభుత్వాన్ని నడిపించారని నిర్మలా సీతారామన్ గుర్తు చేశారు.దేశంలో పది లక్షలకు గాను 8లక్షల ఉద్యోగాలను కేంద్రం భర్తీ చేసిందని చెబుతూ
డిసెంబర్ లోపు మిగిలిన ఉద్యాలను భర్తీ చేస్తామని ఆమె తెలిపారు.

 కేంద్ర ప్రభుత్వం విధానాలల వల్ల మాత్రమే హైదరాబాద్‌కు పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయని ఆమె స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకులు ప్రధానమంత్రిని కూడా రాజకీయ విమర్శలకు వాడుకోవడం సిగ్గుచేటని పేర్కొంటూ ప్రధానమంత్రి అనే గౌరవం లేకుండా కించపర్చే ప్రభుత్వం తెలంగాణకు అవసరమా? అని నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు.

రాష్ట్రంలోనూ బిజెపి గెలుపొంది డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే తెలంగాణ మరింత ముందుకు సాగుతుందని ఆమె చెప్పారు. వేల కోట్ల పెట్టుబడి పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు పనికి రాకుండా పోయిందని ఆమె విచారం వ్యక్తం చేశారు.  కుటుంబ పార్టీ పాలనలోనూ, నిధులు సద్వినియోగ పరుచుకోవడంలోనూ విఫలమైందని ఆమె ధ్వజమెత్తారు