అవినీతి పరుడని నిరూపిస్తే ఆస్తులన్నీ ప్రజలకే రాసిస్తా!

తాను వందల కోట్లు సంపాదించానని ఆరోపించిన మంత్రి గంగుల కమలాకర్ వాటిని నిరూపించాలని కోరుతూ అవినీతి పరుడెవరో తేల్చుకుందామా? అంటూ బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు. తాను అవినీతికి పాల్పడినట్లు తేలితే తన ఆస్తులన్నీ కరీంనగర్ ప్రజలకు రాసిస్తానని కరీంనగర్ లో ఎన్నికల ప్రచారం చేస్తూ ప్రకటించారు.
 
“గంగుల కమలాకర్.. నేను వందల కోట్లు సంపాదించానన్నవ్ కదా! నీకు దమ్ముంటే నా ఆస్తిపాస్తులు, డబ్బుసంచులన్నీ చూపియ్. నాకున్న ఆస్తిపాస్తులన్నీ ప్రజల ముందుంచుతా. నేను కోట్లు సంపాదించినట్లు నిరూపిస్తే అవన్నీ కరీంనగర్ ప్రజలకే రాసిస్తా” అని స్పష్టం చేశారు. అదే విధంగా అవినీతి, అక్రమాలతో నువ్వు సంపాదించిన ఆస్తిపాస్తులు, డబ్బు సంచుల వివరాలన్నీ నేను ప్రజల ముందుంచుతా. కరీంనగర్ ప్రజలకు పంచి ఇచ్చేందుకు సిద్ధమా? అంటూ నిలదీశారు. 
 
కేసీఆర్‌ను ఒప్పించి ఎన్ని నిధులు తీసుకొచ్చావో చెప్పాలని గంగులను డిమాండ్ చేశారు. తాను కేంద్రంతో మాట్లాడి ఎన్ని నిధులు తీసుకొచ్చానో లెక్కాతో సహా వివరించేందుకు సిద్ధమని చెప్పారు. స్మార్ట్ సిటీ కింద కరీంనగర్, వరంగల్‌కు రూ.196 కోట్ల చొప్పున కేంద్రం నిధులు మంజూరు చేసిందని.. అదే సమయంలో రాష్ట్రం కూడా తన వాటా కింద కేటాయించాల్సి ఉంది కానీ పైసా కూడా ఇవ్వలేదని ఆరోపించారు. 
 
పైగా కేంద్రం ఇచ్చిన నిధులను దారిమళ్లించారని సంజయ్ ధ్వజమెత్తారు. ఇదే విషయంపై కేంద్రం మూడుసార్లు రాష్ట్రానికి లేఖ రాసి దారి మళ్లించిన నిధులన్నింటినీ జమ చేయాలని చెప్పిందని పేర్కొన్నారు. ఇదే విషయంపై తాను కూడా అధికారులతో సమావేశమై ఆ లెక్కలన్నీ చెప్పాలని నిలదీశానని తెలిపారు. 
 
ఆ నిధులన్నీ రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లపాటు దారిమళ్లించిందని అధికారులే ఒప్పుకున్నారని చెప్పుకొచ్చారు.  స్మార్ట్ సిటీతో పాటు తీగలగుట్టపల్లి ఆర్వోబీ నిర్మాణం కోసం నిధులు తెచ్చింది తానేనని సంజయ్  తెలిపారు. రాష్ట్రం వాటా కేటాయించకుండా జాప్యం చేసినా, సహకరించకపోయినా కరీంనగర్ ప్రజల కోసం కేంద్రంతో మాట్లాడి పూర్తి నిధులు తాను తీసుకొస్తే సిగ్గు లేకుండా గంగుల కమలాకర్ కొబ్బరికాయ కొట్టి తామే తెచ్చినట్లు ఫోజులు కొట్టిండన్నారని ఎద్దేవా చేశారు. 
 
గ్రామాల్లో రోడ్ల నిర్మాణం కోసం అయ్యే నిధులతో పాటు గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి నిధులన్నీ కేంద్రానివే అని సంజయ్ చెప్పుకొచ్చారు. తాను ఏ రోజు ఏ వ్యాపారస్తుల వద్ద పైసలు వసూలు చేయలేదని… ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని చెప్పారు.  తాను నోరు తెరిస్ ఏ ఒక్క వ్యాపారస్తుడు కూడా గంగులను, తన అనుచరులను వారి ఇంటి గడప కూడా తొక్కనీయరని హెచ్చరించారు. ఇలానే వ్యవహరిస్తే.. వ్యాపారస్తులు గంగులను రోడ్డుమీద కూడా తిరగనీయరని చెప్పారు.