గాజా ఆసుపత్రిని స్వాధీనం చేసుకున్న ఇజ్రాయిల్ దళాలు

గాజాలో అతిపెద్ద ఆస్పత్రి అల్‌-షిఫాను ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సె్‌స్(ఐడీఎఫ్‌) తన అధీనంలోకి తెచ్చుకుంది. వారం రోజులుగా ఈ ఆస్పత్రి సమీపంలో హమా్‌స-ఐడీఎఫ్‌ మధ్య భీకర పోరు జరగ్గా క్రమంగా ఇజ్రాయెల్‌ సేనలు ఆస్పత్రి సమీపానికి చేరుకున్నాయి. బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా ఆస్పత్రిలోకి చొచ్చుకుని వెళ్లాయి. 

‘‘16 ఏళ్లపైన వయసున్న పురుషులంతా చేతులను పైకెత్తి ఓ వరుసలో నిలబడండి..’’ అంటూ అరబిక్‌లో హుకుం జారీ చేశాయి. ఆ సమయంలో ఆస్పత్రిలో 36 మంది నవజాత శిశువులు సహా 2,300 మంది రోగులు, వైద్య సిబ్బంది, నిర్వాసితులు ఉన్నారు. వేర్వేరు బృందాలు రోగులు, నిర్వాసితుల సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని, వారిని విచారిస్తున్నాయి. 

బుధవారం సాయంత్రానికి ఆస్పత్రి కింద ఉన్న టన్నెల్‌, బేస్‌మెట్‌లలోకి ఐడీఎఫ్‌ దళాలు ప్రవేశించాయి. గత నెల 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడులు జరిపినప్పుడు పట్టుకెళ్లిన తమ సైనికుల ఆయుధాలు, ఇతర సామగ్రి.. ఉగ్రవాదుల ఆయుధాల డంప్‌ అక్కడ లభించినట్లు ఐడీఎఫ్‌ ఓ ప్రకటనలో తెలిపింది.  ఆస్పత్రిలోకి ప్రవేశించే సమయంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు హమాస్‌ ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు పేర్కొంది. అయితే.. హమాస్‌ బందీలుగా తీసుకెళ్లిన ఇజ్రాయెల్‌ పౌరుల జాడ మాత్రం ఆస్పత్రిలో ఎక్కడా లభించలేదంటూ ఇజ్రాయెల్‌ ఆర్మీ రేడియో వెల్లడించింది.

మరోవంక, అల్‌-షిఫా ఆస్పత్రిలో రోగులకు మానవతాసాయాన్ని అందజేస్తున్నట్లు పేర్కొంటూ ఐడీఎఫ్‌ పలు వీడియోలను ఎక్స్‌లో షేర్‌ చేసింది. 36 మంది నవజాత శిశువుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, వారికి సరిపడా ఇంక్యుబేటర్లను అందజేసినట్లు తెలిపింది. చిన్నారులకు కావాల్సిన ఆహారం, రోగులకు అవసరమయ్యే ఔషధాలను ఆస్పత్రిలోకి తీసుకెళ్తున్న వీడియోలను పోస్ట్‌ చేసింది. 

మరోవైపు ఈజిప్ట్‌ నుంచి రఫా సరిహద్దు మీదుగా వచ్చిన ఇంధనం ట్యాంక్‌ ఆస్పత్రిని చేరిందని, దీంతో జనరేటర్లను పునరుద్ధరించామని ఐరాస వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ఆస్పత్రిలో తలదాచుకుంటున్న నిర్వాసితులను ఒక్కొక్కరిగా బయటకు పంపేందుకు ఎలకా్ట్రనిక్‌ గేట్లను ఏర్పాటు చేశామని, వారిని దక్షిణానికి తరలిస్తామని ఐడీఎఫ్‌ చెప్పింది. 

అమెరికా కూడా అల్‌-షిఫాలో హమాస్‌ సొరంగాలున్నట్లు తెలిపింది. కాగా, ఇజ్రాయెల్‌ అధీనంలో ఉన్న అల్‌-షిఫా ఆస్పత్రిలోని రోగులు, నెలలు నిండని శిశువులు, వైద్యుల గురించేనని గాజా ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఆస్పత్రిపై ఇజ్రాయెల్‌ దాడి చేస్తుందని మంగళవారం సాయంత్రమే తమకు ‘రెడ్‌ క్రెసెంట్‌’ నుంచి సమాచారం అందిందని వివరించింది.

గాజా పార్లమెంట్‌ భవనాన్ని ఐడీఎఫ్‌ దళాలు బుధవారం కూల్చివేసినట్లు ‘అల్‌-హుర్రా’ న్యూస్‌ చానల్‌ ఆ దృశ్యాలను ప్రసారం చేసింది. ఇంధనం నిండుకోవడంతో టెలికాం సేవలను అందజేయలేమంటూ సెల్‌ఫోన్‌ సంస్థలు పాల్టెల్‌, జవ్వాల్‌ బుధవారం తమ వినియోగదారులకు సందేశాలను పంపాయి.