తాము రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేయడం వల్లే వాటి ధరలు పెరగకుండా అంతర్జాతీయ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించగలిగిందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం 5 రోజుల బ్రిటన్ పర్యటనలో భాగంగా లండన్ చేరుకున్న జై శంకర్ అక్కడ భారత హైకమిషన్ కార్యాలయంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగానే అంతర్జాతీయంగా చమురు ధరలు కట్టడి భారత్ చేసిన ప్రయత్నాలకు ప్రపంచ దేశాలు కృతజ్ఞతలు చెప్పాలని ఆయన సూచించారు. రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం వేళ.. భారత్, రష్యాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లపై ఎలాంటి ప్రభావం పడలేదని ఆయన చెప్పారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైన కొత్తలో ప్రపంచ ఆర్థిక పరిస్థితి కాస్త అయోమయంగా కనిపించిందని, ముఖ్యంగా చమురు, గ్యాస్ ధరలు ఆకాశాన్నంటే అవకాశం ఉందని విశ్లేషకులు భావించారని ఆయన గుర్తు చేశారు.
కానీ అలాంటి పరిస్థితులు ఏర్పడకుండా భారత్ సరైన నిర్ణయాలు తీసుకుందని, వ్యూహాత్మక కొనుగోలు విధానాల ద్వారా చమురు, గ్యాస్ ధరలు పెరగకుండా స్థిరీకరించిందని ఆయన గుర్తు చేశారు. ఫలితంగా అంతర్జాతీయ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించిందని జైశంకర్ స్పష్టం చేశారు. ‘‘మా కొనుగోలు విధానాల ద్వారా చమురు, గ్యాస్ మార్కెట్లను స్థిరీకరించాం. దాని పర్యవసానంగా.. మేము అంతర్జాతీయ ద్రవ్యోల్బణాన్ని మేము నిర్వహించాం. కాబట్టి.. ప్రపంచ దేశాల నుంచి ధన్యవాదాల కోసం నేను ఎదురుచూస్తున్నాను’’ అని జైశంకర్ చెప్పుకొచ్చారు.
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంతో అంతర్జాతీయ మార్కెట్లలో వాటి ధరలు పెరగకుండా చేసిందని, ఆ కారణంతో అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం అదుపులో ఉండేందుకు ఉపయోగపడిందని జై శంకర్ చెప్పారు. ఈ విషయంలో ప్రపంచ దేశాలు భారత్‌కు కృతజ్ఞతలు చెప్పాలని, దాని కోసం తాను ఎదురుచూస్తున్నానని వెల్లడించారు.
ఒకవేళ పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలతో రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయకుంటే అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు భారీగా పెరిగేవని తెలిపారు. చమురు కొనుగోళ్లలో భారతదేశం అనుసరిస్తున్న విధానం ప్రపంచ చమురు ధరల పెరుగుదలను నిరోధించిందని, మార్కెట్‌లో యూరప్‌తో సంభావ్య పోటీని నిరోధించిందని మంత్రి వివరించారు.
తాము రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకుండా, అంతర్జాతీయ మార్కెట్లలో చమురు విక్రేతల వద్దకు వెళ్లి ఉంటే.. అప్పుడు చమురు ధరలు ఊహించనంత స్థాయిలో పెరిగేవని తాము కనుగొన్నామన్నారు. ఫలితంగా.. అదే ధరలకు ఐరోపా కూడా కనుగోలు చేయాల్సి వచ్చేదని విశ్లేషించారు.
ఈ ఆంక్షల సమయంలో ఎల్‌పీజీ మార్కెట్లలో ఆసియాకు రావాల్సిన పెద్ద సరఫరాదారులు యూరప్‌కు వెళ్లారని, కొన్ని చిన్న దేశాలు ఎల్‌పీజీ ఇంధన కొనుగోలు కోసం దాఖలు చేసిన టెండర్లపై స్పందించేందుకు కూడా సరఫరాదారులు ఆసక్తి చూపలేదని ఆయన చెప్పారు. ఇక అదే సమయంలో రష్యాతో భారత్ తమ బంధాన్ని కూడా కొనసాగించాలని నిర్ణయించిందని జైశంకర్ స్పష్టం చేశారు.
రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అమెరికా సహా పశ్చిమ దేశాలన్నీ రష్యాపై అనేక ఆంక్షలు విధించాయి. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌పై చేసిన సైనిక చర్యను నిరసిస్తూ రష్యాను ప్రపంచంలోనే ఒంటరిని చేయాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగానే రష్యాను ప్రపంచం నుంచి వేరు చేయాలనే ఉద్దేశంతో ఆ దేశానికి ఎగుమతులు, దిగుమతులు, సహాయాన్ని నిలిపివేయాలని పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి.
అయితే రష్యాపై నిషేధం ఉన్నప్పటికీ భారత్ మాత్రం ఆ దేశం నుంచి చమురును దిగుమతి చేసుకుంది. అంతర్జాతీయ మార్కెట్లతో పోల్చితే చాలా తక్కువ ధరకే రష్యా భారత్‍కు చమురును ఎగుమతి చేసింది. ఈ నిర్ణయాన్ని ఇప్పటికే భారత్ సమర్థించుకోగా.. తాజాగా విదేశాంగ మంత్రి జై శంకర్ కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. .
More Stories
ఆరు నెలల్లో ఏపీకి కేంద్రం రూ 3 లక్షల కోట్ల సాయం
జగన్ ప్యాలస్ లపై ఆరా తీసిన అమిత్ షా
ఎన్కౌంటర్లో మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి దామోదర్ మృతి